వెంటాడి వేటాడి శిక్షిస్తాం.. కలలో కూడా ఊహించరు: ఉగ్రవాదులకు ప్రధాని మోడీ మాస్ వార్నింగ్

వెంటాడి వేటాడి శిక్షిస్తాం.. కలలో కూడా ఊహించరు: ఉగ్రవాదులకు ప్రధాని మోడీ మాస్ వార్నింగ్

పాట్నా: పహల్గాంలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించి అమాయకుల ప్రాణాలు తీశారని ప్రధాని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం (ఏప్రిల్ 24) మోడీ బీహార్‎లోని మధుబనీలో పర్యటించారు. పహల్గాం టెర్రర్ ఎటాక్ తర్వాత మోడీకి ఇదే తొలి పబ్లిక్ మీటింగ్. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి మృతులకు ఆయన రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ టెర్రరిస్టులకు వెన్నులో వణుకుపుట్టేలా మాస్ వార్నింగ్ ఇచ్చారు.

‘‘ఇది పర్యటకులపై కాదు.. భారతదేశ ఆత్మపై దాడి. ఉగ్రవాదులను కలలో కూడా ఊహించని రీతిలో శిక్షిస్తాం. నిందితులు ఊహించిన దానికంటే ఎక్కువగానే శిక్ష పడుతుంది. ఉగ్రవాద కీలక నేతలను కూడా విడిచిపెట్టేది లేదు. ఉగ్రవాదాన్ని మట్టిలో కలిసే సమయం ఆసన్నమైంది. దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా.. ఉగ్రవాదులపై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం.

 ప్రపంచం కూడా మా ప్రతీకారం ఎలా ఉంటుందో చూడబోతుంది. పహల్గాంలో దాడికి పాల్పడ్డ ప్రతి ఒక్కడిని వేటాడి వెంటాడి శిక్షిస్తాం. ఉగ్రదాడి మృతుల కుటుంబ సభ్యులకు న్యాయం చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ఈ ఉగ్రదాడిని భారత్ ఎప్పటికీ క్షమించదు’’ అని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పహల్గాం ఉగ్రదాడిపై మాకు మద్దతుగా నిలిచిన ప్రపంచ దేశాల నాయకులకు, ప్రజలకు కృతఙ్ఞతలు తెలిపారు. 

కాగా, జమ్ముకాశ్మీర్‎లోని పహల్గాం ప్రాంతం బైసారన్ మైదాన ప్రాంతంలో మంగళవారం (ఏప్రిల్ 22) ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. కుటుంబంతో కలిసి సరదాగా టైమ్ స్పెండ్ చేసేందుకు వచ్చిన పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులు జరపడంతో 26 మంది అమాయక ప్రజలు మృతి చెందగా.. మరికొందరు బుల్లెట్ గాయాలకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో యావత్ దేశమంతా ఉలిక్కిపడింది. ఈ క్రమంలో పహల్గాంలో రక్తపుటేరులు పారించిన ముష్కరులు కోసం భద్రత దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.