తెలంగాణ రాజకీయాల్లో రాహుల్ vs మోదీ.!.. కాంగ్రెస్, బీజేపీ మధ్య కులం, మతం పంచాది

తెలంగాణ రాజకీయాల్లో రాహుల్ vs మోదీ.!.. కాంగ్రెస్, బీజేపీ మధ్య కులం, మతం పంచాది
  •  బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధతకు కాంగ్రెస్ యత్నం
  • ముస్లింలను లిస్ట్ నుంచి తొలగించాలన్న బీజేపీ
  • చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటున్న కాంగ్రెస్


హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో మోదీ, రాహుల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. రెండు జాతీయ పార్టీల మధ్య కులం, మతం నిప్పు రాజుకుంది. మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై బీజేపీ  నేతలు భగ్గమంటున్నారు. మోదీ కులం సరే.. రాహుల్ గాంధీ మతమేంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రాహల్ బ్రాహ్మిణ్​ అని క్లారిటీ ఇచ్చారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. 

అదే సమయంలో ప్రధాన మంత్రి మోదీ లీగల్లీ కన్వర్టెడ్ ఎలా అయ్యారనే అంశంపై గూగుల్ లో వెతికేశారు నెటిజెన్లు. వాస్తవానికి మోదీ కుల వృత్తి నూనె తీయడం, అమ్మడం.. తెలంగాణలో ఈ కమ్యూనిటీని గాండ్ల తేలికులు అంటారు. మన దగ్గర బీసీ జాబితాలోనే ఉన్న ఈ కులం. మోదీ ముఖ్యమంత్రి కాకముందు గుజరాత్ లో ఓసీ లిస్ట్ లో ఉంది. వీరిని చేతి వృత్తుల వారిగా కాకుండా నూనె వ్యాపారులుగా పరిగణించి ఓసీ జాబితాలో చేర్చారు. ఆ తర్వాత చేతి వృత్తులగా నోటీఫై చేస్తూ బీసీలకు మార్చారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి లీగల్లీ కన్వర్టెడ్ అని చెప్పారు. దీనిపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు మోదీ కులాన్నే ప్రశ్నిస్తారా? అంటూ ఘీంకరించారు.  రాష్ట్ర  ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా బీసీ కులగణన చేపట్టింది. ఈ మేరకు అసెంబ్లీలో బీసీ కులాల వివరాలను వెల్లడించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ నేతలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 

పలువురు వివరాలు ఇవ్వలేదని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా వారి కోసం కొనసాగింపు సర్వే ను నిర్వహిస్తోంది. ఈ తరుణంలో బీజేపీ నేతలు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బీసీల జాబితా నుంచి ముస్లింలను తొలగించాలని, ఆ తర్వాతే బిల్లును పార్లమెంటుకు పంపితే రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్ లో పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. 

అదే  పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. 42%  రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని చెబుతున్నారు. అసెంబ్లీలో తీర్మానం  సరిపోతుందని అంటున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ హామీ అమలు చేస్తుంటే తామెందుకు మద్దతు ఇవ్వాలని మరికొందరు బీజేపీ  నేతలు చెబుతున్నారు. ఏది ఏమైనా తెలంగాణ కులగణన పుణ్యమా అని రాహుల్ మతం, మోదీ  కులం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.