మోడీ ముందు 7సవాళ్లు

మోడీ ముందు 7సవాళ్లు

రెండో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ ముందు అనేక సవాళ్లులున్నాయి. రాజకీయరంగంలో ప్రతిపక్షాలను తన మార్క్ వ్యూహాలు, ఎత్తు గడలతో చిత్తు చేసిన మోడీ ఇప్పుడు మిగతా రంగాలను కూడా చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. సమాజంలో అన్ని వర్గాల ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది. రైతులకు భరోసా కల్పించడం, యువతకు ఉద్యోగాలు చూపించడం
మోడీ సర్కార్ ముందున్న ప్రధాన టాస్క్.

రైతుకు అండగా..

నరేంద్ర మోడీ సర్కార్ ముందుగా దృష్టి పెట్టాల్సింది వ్యవసాయరంగంపైనే. సమాజానికి అన్నం పెట్టే వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. 2004–05 నాటికి దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) లో వ్యవసాయ రంగం 21 శాతం ఉంది. గత 13 ఏళ్లుగా జీడీపీలో  అగ్రికల్చర్ కంట్రిబ్యూషన్ తగ్గిపోతోంది. దాదాపు 13 శాతం తగ్గిపోయిందని లెక్కలు చెబుతున్నాయి. అయితే వ్యవసాయం పై ఆధారపడి బతికే వారి సంఖ్య తగ్గలేదు. వారికి పొలం పనులు తప్ప మరే ఇతర పనులు రావు. దీంతో కష్టమొచ్చినా సుఖమొచ్చినా వ్యవసాయాన్నే అంటిపెట్టుకుని బతుకుతున్నారు. మనదేశ జనాభాలో 55 శాతం మంది అగ్రికల్చర్ మీదే ఆధారపడి బతుకుతున్నారు. మారిన వాతావరణ పరిస్థితుల్లో వ్యవసాయం అనేది ఓ లాటరీగా మారింది. నాణ్యమైన విత్తనం దొరకటం నుంచి పండిన పంట ఇంటికి వచ్చేంతవరకు ఎక్కడా గ్యారంటీ ఉండదు.ఇన్ని కష్టాలకు ఓర్చి పంట పండించినా మార్కెట్ లో గిట్టుబాటు ధర దొరుకుతుందన్న ఆశ కూడా లేదు. ఈ నేపథ్యంలో రైతులకు మేలు చేయడానికి  ‘ప్రధానమంత్రి కిసాన్ యోజన’ పేరుతో ఓ పథకాన్ని  మోడీ సర్కార్ ప్రారంభించింది. అయితే రైతుల కష్టాలు దీంతోనే తీరవు. విత్తు విత్తిన దగ్గర నుంచి సర్కార్ అండగా ఉంటుందన్న భరోసాను రైతులకు మోడీ సర్కార్ ఇవ్వాలి. వ్యవసాయాన్ని లాభాల బాటలోకి తీసుకెళ్లడానికి  ప్రయత్నించాలి. రైతులకు ఆదాయం రెండింతలు చేస్తానన్న మోడీ హామీని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. డబుల్ ఇన్ కం అనే హామీ ఇప్పటివరకు హామీ గానే మిగిలింది. దీని కోసం మోడీ సర్కార్ పక్కా ప్లాన్ రూపొందించుకోవలసిన అవసరం ఉంది.

ఉద్యోగాలు లేక విలవిల

దేశ యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఉద్యోగాలు లేకపోవటం. ఏడాదికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని 2014 లో ప్రధాని మోడీ ఇచ్చిన హామీ ఇప్పటివరకు నెరవేరలేదు. కిందటిసారి ఎన్నికల్లో మోడీ ని అధికారంలోకి తీసుకువచ్చిన ప్రధాన అంశాల్లో ఈ ఉద్యోగాల హామీ ఒకటి. మొదటి టర్మ్ లో మోడీ రాజకీయంగా అనేక ఒడిదుడుకులకు గురవడంతో ఈ అంశంపై  పూర్తిగా దృష్టి పెట్టి ఉండకపోవచ్చు. దీంతో కనీసం ఈసారైనా మోడీ తమ సమస్యలు పట్టించుకుంటారని, తమకు ఉద్యోగాలు కల్పిస్తారని యువత భావిస్తోంది. తొలి టర్మ్ లో  మోడీ సర్కార్ తీసుకున్న  పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారని ‘ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ’ ( సీఎంఐఈ) పేర్కొంది. డీమానిటైజేషన్ ప్రభావంతో దాదాపు 1.1 కోటి మంది ఉద్యోగాలు హుష్ కాకి అయ్యాయని ఈ ఏడాది జనవరిలో విడుదలైన సీఎంఐఈ రిపోర్ట్ వెల్లడించింది. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిందని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ప్రస్తుతం నిరుద్యోగం 6.1 శాతంగా నమోదైంది. తొలి టర్మ్ లో మోడీ ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా ’ ఇప్పటికీ సాధించింది ఏమీ లేదు. పరిశ్రమలు పెట్టే ఇండస్ట్రియలిస్టులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అవసరమైతే రాయితీలు కల్పించాలి. పెట్టుబడులను ఆహ్వానించాలి. ‘ జాబ్ జనరేషన్ ’ ను సీరియస్ గా తీసుకోవాలి. అప్పుడే  యువతరానికి ఉద్యోగాలు దొరుకుతాయి.

కమోడిటీ మేనేజ్మెంట్..

ఆర్థిక వ్యవస్థ ను గాడిలో పెట్టడానికి  కేంద్రంలో కొలువుదీరిన మోడీ సర్కారు కొన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం  ఉందని నిపుణులు సూచిస్తున్నారు.వ్యవసాయ వస్తువులకు సంబంధించి డేటాబేస్ నిర్వహించడం ద్వారా నిత్యావసరాల నిర్వహణ (కమాడిటీ మేనేజ్‌మెంట్ )ను సక్రమంగా అమలు చేయాలంటున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విషయంలో కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు ఫైనాన్షియల్ ఎక్స్ పర్ట్స్.  కమాడిటీ మేనేజ్ మెంట్ ను సరిగా అమలు చేయకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో చక్కెర కార్మికులకు అక్కడి ప్రభుత్వాలు, సంస్థలు బకాయిలు చెల్లించలేకపోవడానికి కారణం   కమాడిటీ మేనేజ్ మెంట్ అమలులో తలెత్తిన ఫెయిల్యూర్సే. అలాగే ఎగుమతుల విషయంలో ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనదేశ ఆహార అవసరాలకు తగ్గట్టు ఎగుమతులపై  నిర్ణయం తీసుకోవాలి. దీంతోపాటు ఫుడ్ సెక్యూరిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి.

బ్యాంకింగ్లో మార్పులు

ఎడాపెడా పెరిగిన అప్పుల ఫలితంగానే ప్రభుత్వరంగంలో ఉన్న బ్యాంకులు దెబ్బతిన్నాయి. 2018 డిసెంబర్ నాటికి  పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల నాన్ పెర్ఫార్మింగ్ ఆస్తుల విలువ 8 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. దీని ప్రభావం బ్యాంకుల పనితీరుపై పడుతోంది. బ్యాంకింగ్ రంగంలో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నది నిపుణుల అభిప్రాయం. బ్యాంకులను రైతులు,  సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలి. ఇవాళ్టి రోజున రైతులకు కొత్తగా లోన్లు ఇచ్చే పరిస్థితుల్లో బ్యాంకులు లేవు. ఈ పరిస్థితి నుంచి బ్యాంకింగ్ రంగాన్ని బయటపడేయాల్సిన పరిస్థితి నెలకొంది.

పవర్ సెక్టార్లో పవర్ పెంచాలి

గుజరాత్‌ పవర్ సెక్టార్​లో అమలు చేసిన సంస్కరణలు మంచి ఫలితాలనిచ్చాయి. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా పవర్ సెక్టార్​ను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు విద్యుత్ రంగ నిపుణులు. పవర్ సెక్టార్ బలోపేతం కావాలంటే సంస్కరణలతోనే  సాధ్యమవుతుంది.అలాగే పవర్ సెక్టార్​లో ట్రాన్స్ మిషన్, పంపిణీ నష్టాలు తగ్గించాల్సిన అవసరం ఉంది.  దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇవాళ డిస్కంలు, జెన్కోలు తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. నష్టాల ఊబి నుంచి వీటిని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది.

మైనారిటీల్లో
భయాన్ని పోగొట్టాలి

బీజేపీ విజయంతో మైనారిటీల్లో భయం నెలకొందన్న విషయాన్ని అంగీకరిస్తూనే  ఆ వర్గాల్లోని భయాన్ని పోగొట్టాల్సిన అవసరం ఉందని సాక్షాత్తూ ప్రధాని మోడీ చెప్పారు. పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ఎన్డీయే ఎంపీలను ఉద్దేశించి మోడీ చేసిన తాజా ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.మైనారిటీలతో  మెజారిటీలకు కల్చర్ పరంగా, ఆహారపుటలవాట్ల ఫలితంగా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ వైరుధ్యాలను అధిగమించడానికి, మైనారిటీలను కలుపుకుని పోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి.

పొరుగు దేశాలతో సంబంధాలు

ఇరుగుపొరుగు దేశాలతో సంబంధాలపై మోడీ సర్కార్ దృష్టి పెట్టాలి. ముఖ్యంగా  పాకిస్థాన్ తో ఇండియా సంబంధాలు కేవలం డిప్లొమసీకే పరిమితమైనవి కావు. రెండు దేశాల మధ్య పరిష్కారం కాని ఎన్నో సమస్యలు ఉన్నాయి. వీటిలో కాశ్మీర్ సమస్య చాలా ముఖ్యమైనది. కాశ్మీర్ ఇష్యూ పై మూడో దేశం జోక్యాన్ని ఒప్పుకునేది లేదని ఇండియా అనేక సార్లు తేల్చి చెప్పింది. అయితే పాక్ ఈ విషయాన్ని పట్టించుకోదు. వీలు దొరికినప్పుడల్లా  ప్రతి అంతర్జాతీయ వేదికపై  కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం పాకిస్థాన్ కు ఒక అలవాటుగా మారింది. ఈ నేపథ్యంలో పాక్ తో సంబంధాల విషయమై మోడీ సర్కార్ గట్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే చైనాతో కూడా మనకు సరిహద్దు సమస్యలు ఉన్నాయి. చైనాతో గొడవల ఇష్యూ మన దేశ వాణిజ్యం పై పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పై ఉంది.