అయోధ్యకు చేరుకున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు చేరుకున్నారు. ఉదయం ఢిల్లీ నుండి బయలుదేరి కొద్దిసేపటి క్రితం ప్రత్యేక విమానంలో అయోధ్యకు చేరుకున్నారు.  మోదీ మొత్తం ఆరు గంటల పాటు అయోధ్యలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 12.05- 12.55 గంటల మధ్య ఆయన రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు.  

ఈ చారిత్రక ఘట్టం కోసం ప్రపంచవ్యాప్తంగా   కొన్ని కోట్ల మంది ఎదురుచూస్తున్నారు. మధ్యాహ్నం 1.00-2.00 గంటల మధ్య మోదీ బహిరంగ సభలో పాల్గొంటారు. గంట పాటు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2.00 గంటలకు అయోధ్యలోని కుబేర్ తిలా ఆలయంలో మోదీ ప్రార్థనలు చేయనున్నారు.  

అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ వేడుకల నేపథ్యంలో 11 రోజుల దీక్ష చేపట్టారు ప్రధాని మోదీ.. కఠిన నియమాలు పాటించారు. రోజూ నేలపైనే నిద్రించారు.  కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకున్నారు.  అలాగే దేశవ్యాప్తంగా దేవాలయాలను సందర్శించి ప్రార్థనలు చేశారు.  రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం నియమ నిష్ఠలతో 11 రోజుల పాటు పూజలు చేస్తానని మోదీ గత శుక్రవారం ప్రకటించారు.