అవినీతి, అబద్ధాల పాలనకు చరమగీతం .. ఢిల్లీలో వికాస్, విజన్, విశ్వాస్ విజయం: ప్రధాని మోదీ

అవినీతి, అబద్ధాల పాలనకు చరమగీతం .. ఢిల్లీలో వికాస్, విజన్, విశ్వాస్ విజయం: ప్రధాని మోదీ
  • అవినీతి వ్యతిరేక ఆప్..అదే అవినీతిలో కూరుకుపోయింది 
  • కాంగ్రెస్ మళ్లీ ఖాతా తెరువలే 
  • ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని వెల్లడి

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం.. ‘వికాస్, విజన్, విశ్వాస్’ సాధించిన విజయమని ప్రధాని మోదీ అన్నారు. అవినీతిని, అబద్ధాలను సహించబోమని ఢిల్లీ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని చెప్పారు. వాళ్లంతా సుపరిపాలనను కోరుకున్నారని తెలిపారు. బీజేపీ విజయం అనంతరం శనివారం ఢిల్లీలోని పార్టీ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించిన విజయోత్సవ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆప్, కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. ‘‘అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టిన ఆప్.. అదే అవినీతిలో కూరుకుపోయింది. ఆ పార్టీ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు జైలుపాలయ్యారు. లిక్కర్ స్కామ్, స్కూల్ స్కామ్ లాంటి వాటితో ఢిల్లీ ఇమేజ్ ని దెబ్బతీశారు. 

కరోనా కాలంలో ఢిల్లీ ప్రజలంతా ఇబ్బందులు పడ్తే, వాళ్లేమో అద్దాల మేడలు కట్టుకున్నారు” అని ఆప్ నేతలపై మోదీ మండిపడ్డారు. ఆప్ అక్రమాలపై కాగ్ రూపొందించిన రిపోర్టును మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే సభలో పెడతామని చెప్పారు. ‘‘దేశంలోనే ఓల్డెస్ట్ పార్టీ అయిన కాంగ్రెస్ ఢిల్లీలో జరిగిన ఆరు ఎన్నికల్లో (లోక్ సభ, అసెంబ్లీ కలిపి) ఖాతా తెరువలేకపోయింది. కాంగ్రెస్.. పరాన్నజీవి పార్టీ. అది తనతో పాటు ఇతర పార్టీలను ముంచుతుంది. కాంగ్రెస్ ఇప్పుడు.. స్వాతంత్ర్యానికి ముందున్న పార్టీ కాదు. వాళ్లిప్పుడు అర్బన్ నక్సల్ పాలిటిక్స్ చేస్తున్నారు. అరాచకాలు సృష్టించాలని చూస్తున్నారు. ఆప్ కూడా అలాంటి ప్రయత్నాలే చేస్తున్నది” అని ఫైర్ అయ్యారు. 

ఢిల్లీని అభివృద్ధి చేస్తం.. 

ఢిల్లీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మోదీ తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. ‘‘అవినీతి రాజకీయాలను ఢిల్లీ ప్రజలు తిరస్కరించారు. సుపరిపాలనకు పట్టం కట్టారు. ప్రజల కోరుకున్నట్టుగానే ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్, పూరా ఢిల్లీ కా వికాస్’ నినాదంతో ముందుకెళ్తాం. ఢిల్లీ పక్కనున్న ఉత్తరప్రదేశ్, హర్యానాలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నది. ఇప్పుడు ఢిల్లీలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది. ఒకప్పుడు యూపీలో లాఅండ్ ఆర్డర్ సమస్య ఉండేది. మేం వచ్చాక దాన్ని పరిష్కరించాం. మహారాష్ట్ర రైతులు కరువు పరిస్థితులతో అల్లాడితే వాళ్లను ఆదుకున్నాం. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం.

 ట్రాఫిక్, కాలుష్యం, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తాం. యమునా నదిని ప్రక్షాళన చేస్తాం. మహిళలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం” అని తెలిపారు. ‘‘బిహార్ లో మేం వచ్చాక మార్పు తీసుకొచ్చాం. అలాగే ఆంధ్రప్రదేశ్ లోనూ సీఎం చంద్రబాబు నాయుడు మంచి పాలనను అందిస్తున్నారు. ఎన్డీయే అంటే అభివృద్ధి, సుపరిపాలన గ్యారంటీ. ఎన్డీయే పాలనలో పేదలతో పాటు మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుంది. అందుకే వాళ్లంతా మా వెంట ఉంటున్నారు” అని చెప్పారు.