- మానవాళి సక్సెస్ యుద్ధభూమిలో ఉండదు
- యూఎన్ ‘సమిట్ ఆఫ్ ది ఫ్యూచర్’లో ప్రధాని మోదీ ప్రసంగం
యూఎన్:ఐక్యరాజ్య సమితి సహా అంతర్జాతీయ సంస్థలలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూయా ర్క్ లోని యూఎన్ వేదికగా జరిగిన ‘సమిట్ ఆఫ్ ది ఫ్యూచర్’ సభలో మోదీ ప్రసంగించారు.
ఈ సందర్భంగా ప్రపంచ శాంతికి అన్ని దేశాలు పాటుపడాలని సందేశం వినిపించారు. మానవాళి సక్సెస్ యుద్ధభూమిలో కాదు, మన ఐకమత్యంలో ఉంటుందని మోదీ స్పష్టం చేశారు. కీలకమైన సంస్థలలో సంస్కరణలు చేపట్టడం ప్రపంచ శాంతికి, అభివృద్ధికి తప్పనిసరి అని అన్నారు.
ప్రపంచ శాంతికి టెర్రరిజం పెనుముప్పుగా మారగా.. సైబర్, మారిటైం, స్పేస్ రంగాలలో పలు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని మోదీ గుర్తుచేశారు. గ్లోబల్ యాంబీషన్ సాధించేందుకు గ్లోబల్ యాక్షన్ అవసరమని మోదీ ఉద్ఘాటించారు.
సుస్థిరాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూనే మానవ సంక్షేమం, ఆహారం, ఆరోగ్య భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. భారత్ లో 25 కోట్ల మందిని పేదరికంలో నుంచి బయటకు తీసుకొచ్చామని ఆయన వివరించారు.
తద్వారా సుస్థిరాభివృద్ధిని సాధించవచ్చని నిరూపించామన్నారు. ఈ విజయానికి సంబంధించిన విశేషాలను, తీసుకున్న చర్యలను ప్రపంచంతో పంచుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని యూఎన్ వేదికపై ప్రధాని మోదీ పేర్కొన్నారు.