
ప్రధాని మోదీ అమెరికా టూర్ ముగిసింది. వైట్ హౌస్ లో ట్రంప్ తో భేటీ తర్వాత మోదీ భారత్ కు బయల్దేరారు. ఫిబ్రవరి 12,13 (అమెరికా కాలమానం ప్రకారం) అమెరికాలో పర్యటించారు మోదీ.
ఫిబ్రవరి 14 ఉదయం 3 గంటలకు(భారత కాలమాన ప్రకారం) ట్రంప్ తో భేటీ అయిన మోదీ..ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు,బలోపేతాలపై చర్చించారు. ఈ సందర్బంగా మాట్లాడిన మోదీ.. అమెరికాలో చమురు,గ్యాస్, వాణిజ్యంపైన దృష్టిపెడతామన్నారు. 2030 నాటికి 500 మిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యమే లక్ష్యమన్నారు. అమెరికాలో చట్టవిరుద్దంగా ఉంటున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామన్నారు మోదీ. యుద్ధం విషయంలో భారత్ తటస్థ వైఖరి కాదని..తాము ఎప్పుడూ శాంతి వైపే నిలబడతామన్నారు.
స్నేహితుడితో కలవడం సంతోషంగా ఉందన్నారు మోదీ. తనలాగే ట్రంప్ కు కూడా దేశమే ఫస్ట్ నినాదం అని అన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతాయన్నారు. అమెరికా, భారత్ బంధం మరింత బలోపేతం కావాలన్నారు మోదీ. మరో నాలుగేళ్లు ట్రంప్ తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. భారత్ ఎపుడూశాంతినే కోరుకుంటుందన్నారు మోదీ
భారత్ కు ఎఫ్ 35 యుద్ధవిమానాలను అమ్మేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ వెల్లడించారు.26/11 కుట్రదారుడు తహవూర్ రాణాను భారత్ కు అప్పగించేందుకు ట్రంప్ ఆమోదం తెలిపారు. ఈ ఏడాది నుంచి భారత్ కు మిలిటరీ ఉత్పత్తులను పెంచుతామన్నారు.
చాలా ఏళ్లుగా తనకు మోదీ స్నేహితుడని అమెరికా అధ్యక్షడు ట్రంప్ అన్నారు. తమ స్నేహాన్ని మరో నాలుగేళ్లు కొనసాగిస్తామన్నారు. ఇరు దేశాల మధ్య ఐక్యత, స్నేహ బంధం ఉన్నాయన్నారు. భారత్, అమెరికా కలిసి ఉండటం చాలా ముఖ్యం అన్నారు. తాము ఎవర్నీ ఓడించాలనుకోవడం లేదన్నారు ట్రంప్.