న్యూఢిల్లీ: దేశంలోని ప్రతిపక్ష పార్టీలు తమ కూటమికి ‘ఇండియా’ అని పేరు మార్చుకున్నంత మాత్రాన ఆ పార్టీల తీరు మాత్రం మారబోదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అసలు ‘ఇండియా’ కూటమికి ఒక లక్ష్యమంటూ లేదని ఫైర్ అయ్యారు. దారీతెన్నూ లేని ఇలాంటి కూటమిని ఎన్నడూ చూడలేదని విమర్శించారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లో మోదీ ఈ మేరకు ప్రతిపక్షాల కూటమిపై ఫైర్ అయ్యారని ఆ మీటింగ్ తర్వాత పార్టీ నేతలు రవి శంకర్ ప్రసాద్, ప్రహ్లాద్ జోషి మీడియాకు వెల్లడించారు.
దేశాన్ని ముక్కలు చేయాలని భావించే టెర్రరిస్ట్ సంస్థలు కూడా ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఇండియా, ఇండియన్ లాంటి పేర్లను పెట్టుకున్నాయన్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పేరును కూడా ఏఓ హ్యూమ్ అనే బ్రిటిష్ వ్యక్తి పెట్టారన్నారు. ‘‘ఇండియా అని పేరు పెట్టుకుని వాళ్లు తమను తాము పొగుడుకుంటున్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇండియన్ ముజాహిదీన్. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ఇండియా.. వీటిలో కూడా ఇండియా అనే పేరుంది. కేవలం ఇండియా అనే పేరును ఉపయోగించుకున్నంత మాత్రాన వాళ్లకు ఒరిగేదేమీ ఉండదు” అని ఆయన ఎద్దేవా చేశారు. అవినీతి నేతలు, పార్టీలు గుంపుగా మారి ఏర్పాటు చేసుకున్న కూటమి అదని మండిపడ్డారు.
ప్రజలను మభ్యపెట్టలేరు..
దేశం పేరును వాడుకోవడం ద్వారా ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించలేవని మోదీ ఈ మీటింగ్‌లో స్పష్టం చేశారు. ‘‘మోదీని వ్యతిరేకించాలన్న సింగిల్ పాయింట్ ఎజెండాతో ఉన్నారు. అందుకే ఓడిపోయారు. అలసిపోయారు. నిరాశలో మునిగిపోయారు. వారి ప్రవర్తన సుదీర్ఘ కాలం ప్రతిపక్షంలోనే ఉండిపోయేలా ఉంది” అని ఆయన విమర్శించారు. ఇప్పుడు ఇలాంటి పేర్లను చూసి ప్రజలు తప్పుదోవ పట్టరన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
చర్చకు సిద్ధమన్నా.. సభను అడ్డుకుంటున్నరు
‘‘ప్రతిపక్షాలు బాధ్యతారహితంగా సభను అడ్డుకుంటున్నాయి. మణిపూర్ అంశంపై పార్లమెంట్లో చర్చకన్నా ముందే ప్రధాని వివరణ ఇవ్వాలంటూ పట్టుబడుతున్నాయి. చర్చకు సిద్ధమని, హోంమంత్రి జవాబిస్తారని ప్రభుత్వం చెప్తున్నా పట్టించుకోవడంలేదు” అని మోదీ మండిపడ్డారు. అంతర్జాతీయంగా దేశానికి పేరు ప్రఖ్యాతలు పెరిగాయన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 10వ స్థానంలో ఉన్న దేశం తన పాలనలో ఐదో స్థానానికి వచ్చిందని, మళ్లీ అధికారంలోకి వచ్చాక మూడో స్థానానికి చేరుతుందన్నారు. పంద్రాగస్టును పురస్కరించుకుని హర్ ఘర్ తిరంగా, అమృత్ వన్ వంటి కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ క్యాడర్‌కు ఆయన పిలుపునిచ్చారు. కాగా, ఇండియా కూటమిపై జేపీ నడ్డా విమర్శలు గుప్పించారు. ‘‘ఒక పిల్లాడు అన్ని ఎగ్జాంలలో ఫెయిల్ అయ్యేవాడు. దీంతో ఆ పిల్లాడి వైఖరిని మార్చాలని తల్లిదండ్రులు అతడి పేరును మార్చారు. ఇండియా కూటమి పేరు కూడా అచ్చం అలాగే ఉంది కదూ!” అంటూ ఆయన ట్విట్టర్ లో ఎద్దేవా చేశారు.