భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని 2023 జూలై 15 న యూఏఈ చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఒక్కరోజు పర్యటనలో భాగంగా వివిధ అంశాలపై యూఏఈ అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ప్రధాని మోదీ చర్చలు జరుపనున్నారు. ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సత్సంబంధాలపై చర్చించి కీలక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు.
ఇంధన, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆహార భద్రత లాంటి అంశాలపై యూఏఈ అధ్యక్షుడితో ప్రధాని మోదీ చర్చలు జరపనున్నారు. అలాగే ఫిన్‌టెక్, రక్షణ, సాంస్కృతిక విభాగాల్లో కూడా భారత్, యూఏఈల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చిస్తారు.
రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ 2023 జూలై 14 శుక్రవారం బాస్టిల్ డే వేడుకల్లో పాల్గొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు గౌరవ అతిథిగా చాంప్స్‌లో జరిగిన బాస్టిల్ డే పరేడ్‌కు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో కూడా ఆయన సమావేశమై పూర్తి స్థాయి సంబంధాలను సమీక్షించారు.
పారిస్‌లోని ఎలిసీ ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రాన్స్ అత్యున్నత పౌర, మిలిటరీ అవార్డు ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆనర్’ను మోదీకి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ అందజేశారు. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి భారత ప్రధాని మోదీనే కావడం గమనార్హం. తద్వారా నెల్సన్ మండేలా, కింగ్ చార్లెస్, ఏంజెలా మెర్కెల్ తదితరుల సరసన ఆయన నిలిచారు.