ఢిల్లీ: రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీపై విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే నిప్పులు చెరిగారు. జవహర్లాల్ నెహ్రు లేఖల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మోదీపై ఖర్గే మండిపడ్డారు. ప్రధాని మోదీ ఇంకా గతంలోనే బతుకుతున్నారని, వర్తమానంలోకి రాలేదని ఖర్గే ఎద్దేవా చేశారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రస్తుతం సాధించిన విజయాలేవైనా ఉంటే వాటి గురించి వివరించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఖర్గే సూచించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నంబర్.1 అబద్ధాలకోరు అని ఖర్గే పార్లమెంట్ సాక్షిగా కడిగిపారేశారు. ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షలని నమ్మించి ఓట్లు దండుకున్నారని, ఇంతవరకూ ఆ డబ్బుల ఊసే లేదని.. దేశాన్ని తప్పుదోవ పట్టించడంలో, అబద్ధాలు చెప్పడంలో బీజేపీ ఆరితేరిందని విమర్శించారు. గత 11 ఏళ్లలో రాజ్యాంగ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రధాని మంత్రి చేసిన ఒక్క పని గురించైనా చెప్పగలరా అని ఖర్గే సూటిగా ప్రశ్నించారు.
ఏ మతంలోనైనా మోక్షం పొందడానికి భక్తి గొప్ప మార్గమని, రాజకీయాల్లో మాత్రం వ్యక్తి పూజ నియంతృత్వానికి బీజం వేస్తుందని.. డిక్టేటర్గా రూల్ చేయడానికి మోదీ సిద్ధమయ్యారని రాజ్యసభ సమావేశాల్లో విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే చెప్పుకొచ్చారు.
లేడీ మౌంట్బాటెన్కు నెహ్రూ రాసిన లేఖలను తిరిగి అప్పగించాలని ప్రధాన మంత్రి మ్యూజియం రాహుల్ను కోరిన సంగతి తెలిసిందే. చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన నెహ్రూ రాసిన లేఖలను 2008లో సోనియా గాంధీ తీసుకున్నారని, వాటిని తిరిగి అప్పగించాలని ఆమెను కోరినా స్పందన లేదని ప్రధాని మంత్రి మ్యూజియం సభ్యుడు రిజ్వాన్ ఖాద్రీ చెప్పుకొచ్చారు.
నెహ్రూ లేఖల విషయంలో కాంగ్రెస్ను బీజేపీ రాజకీయంగా టార్గెట్ చేసింది. నెహ్రూ ఆ లేఖల్లో ఎడ్వినా మౌంట్ బాటెన్ కు ఏం రాశారో దేశ ప్రజలకు తెలియాలని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా చెప్పారు. కీలక డాక్యుమెంట్లను అన్నింటినీ డిజిటలైజ్ చేయాలని 2010లో నిర్ణయం తీసుకున్నారని, మరి ఈ లేఖలు డిజిటలైజ్ అవ్వకుండా సోనియా గాంధీ ఎందుకు అడ్డుపడ్డారని బీజేపీ ప్రశ్నించింది. దేశ ప్రజలకు తెలియకూడని విషయాలు ఉన్నాయని భావించి కాంగ్రెస్ ఈ లేఖలను కనుమరుగు చేయాలని చూస్తుందా అని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా నిలదీశారు.