ఎటెటోపోయిన ఎజెండాలు

క్లియర్ పిక్చర్‌‌‌‌ లేకుండా దేశంలో ఎన్నికలు జరుగుతున్న రెండో సందర్భం ఇది. 1996లో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. మళ్లీ ఇన్నేళ్లకు ‘జనరల్‌‌‌‌ ఎలక్షన్స్‌‌‌‌–2019’ అదే తరహాలో జరుగుతున్నాయి. 2014నాటి పరిస్థితితో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నం. అప్పట్లో దేశమంతా మోడీ హవాలో ‘ఛాయ్‌‌‌‌ పె చర్చ’ సాగించి… ఒక మానియాలో ఉండగా ఎన్నికలు జరిగాయి. ఊహించినదానికంటే ఎక్కువగా బీజేపీ  ఫుల్‌‌‌‌ మెజారిటీతో అధికారానికొచ్చింది. ఫ్రంట్‌‌‌‌ ధర్మాన్ని పాటించి నేషనల్‌‌‌‌ డెమొక్రటిక్‌‌‌‌ అలయెన్స్‌‌‌‌ (ఎన్‌‌‌‌డీఏ)లోని భాగస్వాములనుకూడా కేబినెట్‌‌‌‌లో చేర్చుకున్నారు. ఆ తర్వాత జరిగిన దాదాపు అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్‌‌‌‌డీఏ ప్రభంజనం సాగింది. దేశంలోని సగానికిపైగా రాష్ట్రాల్లో బీజేపీ నేరుగా, లేదా మిత్రపక్షాల సహకారంతో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.

పోయినేడాది చివరలో జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రభంజనానికి అడ్డుకట్ల పడింది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌‌‌‌, రాజస్థాన్‌‌‌‌, ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లలో కాంగ్రెస్‌‌‌‌ జెండా ఎగిరింది. ఈ మూడు రాష్ట్రాల విజయం కాంగ్రెస్‌‌‌‌ పార్టీకి, దాని నాయకత్వంలోని యునైటెడ్‌‌‌‌ ప్రోగ్రెసివ్‌‌‌‌ అలయెన్స్‌‌‌‌ (యూపీఏ)కి గొప్ప ఉత్సాహాన్నిచ్చింది. అప్పటివరకు ఎన్‌‌‌‌డీఏ తన చుట్టూ వ్యాపించిన గెలుపు ధీమాని వదిలించుకుంది. జనరల్‌‌‌‌ ఎలక్షన్‌‌‌‌ నాటికి చెప్పుకోవడానికి అంశాలు లేని అయోమయ పరిస్థితిలోకి వెళ్లిపోయింది. మరోవైపున రాఫెల్‌‌‌‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో కాంగ్రెస్‌‌‌‌ పదే పదే దాడికి దిగి, మోడీ సర్కారుని ఉక్కిరిబిక్కిరి చేసేసింది. ఎన్‌‌‌‌డీఏ అధికారంలో రావడానికి సహకరించిన తెలుగు దేశం పార్టీ, కాశ్మీర్‌‌‌‌లోని పీపుల్స్‌‌‌‌ డెమొక్రటిక్‌‌‌‌ పార్టీ (పీడీపీ) వంటివి దూరమయ్యాయి. బీజేపీ పూర్తిగా ఉత్తరాది పార్టీ రంగు పులుముకుంది.  దక్షిణాది అయిదు రాష్ట్రాల్లోనూ ఒక్క కర్ణాటక మినహా మిగతా నాలుగు రాష్ట్రాలు కలిసినా బీజేపీకి డబుల్‌‌‌‌ డిజిట్‌‌‌‌ సీట్లు వచ్చేలా లేవు.

సరిగ్గా అదే సమయంలో…. అనుకోకుండా ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్‌‌‌‌లోని పుల్వామాలో సూసైడ్‌‌‌‌ బాంబర్‌‌‌‌ ఎటాక్‌‌‌‌ జరిగింది.  ఆ దాడిలో కేంద్ర రిజర్వ్‌‌‌‌ పోలీసు ఫోర్స్‌‌‌‌ (సీఆర్‌‌‌‌పీఎఫ్‌‌‌‌)కి చెందిన 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.  ఎన్నికల్లో ఫైట్‌‌‌‌ చేయడానికి ఇదొక అవకాశంగా మార్చుకుంది. మొత్తం ఎన్నికల ప్రచారమంతా పుల్వామాపై మిలిటెంట్ల దాడి, పాకిస్థాన్‌‌‌‌లో సర్జికల్‌‌‌‌ స్ట్రయిక్స్‌‌‌‌ చుట్టూనే తిరిగింది. ఇప్పటివరకు జరిగిన ఆరు దశల పోలింగ్‌‌‌‌లో ప్రజా సమస్యలు పెద్దగా చర్చకు రాలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించిన ప్రతిచోట దేశభక్తిని నింపడమే ప్రచార వ్యూహంగా మలుచుకున్నారు. ఈ స్ట్రేటజీని మొదటి రెండు విడతల్లో కంటే… చివరి అయిదు ఫేజ్‌‌‌‌ల్లోనే ఎక్కువగా ప్రయోగించారు. మొదటి రెండు విడతల పోలింగ్‌‌‌‌ దక్షిణాది రాష్ట్రాల్లోనే జరగ్గా, మలి విడతలన్నీ ఉత్తరాదిన ముఖ్యంగా హిందీ బెల్ట్‌‌‌‌ రాష్ట్రాల్లో జరిగాయి.  దేశభక్తి, దేశ భద్రత వంటి అంశాలు ఈ ఫేజ్‌‌‌‌ల్లో వర్కవుట్‌‌‌‌ అయ్యేలా ఉంది.  నిన్నటికి నిన్న బలియా (యూపీ), ససారాం (బీహార్‌‌‌‌) ప్రచార సభల్లో సైతం దేశ భద్రతపైనే మోడీ ప్రసంగం సాగింది.  ప్రతిపక్ష కాంగ్రెస్‌‌‌‌ కూడా మోడీ ప్రసంగాన్ని తిప్పికొట్టడానికే ప్రయత్నిస్తోంది.

ఇదిలా ఉంటే… దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలన్నీ బలం పుంజుకున్నాయి. కేంద్ర స్థానంలో పొలిటికల్‌‌‌‌ సిట్యుయేషన్‌‌‌‌ని లీడ్‌‌‌‌ చేసే స్థాయిలో ప్రాంతీయ పార్టీల నాయకులు ఎదిగారు. మునుపటిలా కేంద్రం పెత్తనానికి తలాడించే దశ దాటిపోయారు. మన రాష్ట్రం, మన ప్రజలు, మన సమస్యలు అనే కోణంలో ప్రతి రాష్ట్రంలోనూ జాతీయ పార్టీలను సవాల్‌‌‌‌ చేసే లెవెల్‌‌‌‌కి చేరారు. ప్రస్తుతం జాతీయ హోదా కలిగినవి ఏడు పార్టీలుండగా, వాటిలో కాంగ్రెస్‌‌‌‌, బీజేపీ మినహా కమ్యూనిస్టులు సహా మిగిలినవన్నీ రీజనల్‌‌‌‌ పార్టీలేనని చెప్పాలి. ఆలిండియా తృణమూల్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ (టీఎంసీ) పశ్చిమ బెంగాల్‌‌‌‌కి, బహుజన సమాజ్‌‌‌‌ పార్టీ (బీఎస్‌‌‌‌పీ) ఉత్తరప్రదేశ్‌‌‌‌కి, లెఫ్ట్‌‌‌‌ ఫ్రంట్‌‌‌‌లోని పెద్ద పార్టీలైన సీపీఐ, సీపీఎంలు కేరళకు, నేషనలిస్టు కాంగ్రెస్‌‌‌‌ పార్టీ (ఎన్‌‌‌‌సీపీ) మహారాష్ట్రకు పరిమితమయ్యాయి. కేవలం నేషనల్‌‌‌‌ పార్టీగా రికగ్నైజేషన్‌‌‌‌ని నిలుపుకోవడానికి మాత్రమే దేశంలోని ఇతర ప్రాంతాల్లో పోటీ చేస్తున్నాయి.  2014 ఎన్నికల్లో మార్క్సిస్టులు 9 స్థానాలు గెలవగా, కమ్యూనిస్టులు ఒక్కటీ గెలవలేకపోయారు. ఈ విధంగా దేశ రాజకీయాల్లో రెండే కూటములు ఉనికిని చాటుకుంటున్నాయి. థర్డ్‌‌‌‌ ఫ్రంట్‌‌‌‌ ఆలోచనలు ఎప్పటికప్పుడు పుడుతున్నాగానీ, కార్యరూపం దాల్చలేకపోతోంది.  దేశమంతటినీ కదిలించగల నిరుద్యోగం, ధరలు, ఇండస్ట్రియలైజేషన్‌‌‌‌ వంటి కీలక సమస్యలు వెనక్కి పోతున్నాయి. స్థానిక సమస్యలపై పోట్లాడుతున్న రీజనల్‌‌‌‌ పార్టీలు బలంగా తయారవుతున్నాయి. దీనివల్ల  ఎన్నికల ప్రచారంకూడా అదే రీతిలో సాగుతోంది.

2014 నుంచి జరిగిన అసెంబ్లీ ఎన్నికలను పరిగణనలోకి తీసుకుంటే… రీజనల్‌‌‌‌ పార్టీల ప్రాబల్యం బాగా పెరిగింది. యాంటీ–ఇనకంబెన్సీ  ఓటు పెరగడాన్ని బట్టి జనరల్‌‌‌‌ ఎలక్షన్స్‌‌‌‌లో బీజేపీకి మెజారిటీ మార్క్‌‌‌‌ (273))కి 30 సీట్లు తక్కువ కావచ్చనే అంచనాలున్నాయి. బీజేపీలో ఒక వర్గం తమకు 240కి మించి రాకపోవచ్చని చెబుతోంది.  ఎన్‌‌‌‌డీఏలో గతంలో ఉన్న తెలుగు దేశం పార్టీ  వంటివి ఇప్పుడు లేనందువల్ల, యూపీలో యోగి ప్రభుత్వ వ్యతిరేకత పెరిగినందువల్ల ఆ మేరకు లోటు ఏర్పడుతుందని చెబుతున్నారు. ఈ లోటు భర్తీకోసం తూర్పున పశ్చిమ బెంగాల్‌‌‌‌, అస్సాం, దక్షిణాన తమిళనాడు, కేరళ రాష్ట్రాలపైన ఎక్కువగా మోడీ దృష్టి పెట్టారు. బీజేపీలో విక్టరీ జోడీగా పేరుబడ్డ నరేంద్ర మోడీ–అమిత్‌‌‌‌ షా జంట వ్యూహం ఫలిస్తే… ఎన్‌‌‌‌డీఏ 319 సీట్లతో అధికారాన్ని నిలబెట్టుకోవచ్చునని పోల్‌‌‌‌ పండిట్లు అంటున్నారు.

మోడీ సర్కారు 2016 నవంబర్‌‌‌‌లో కొట్టిన దొంగ దెబ్బగా ఇప్పటికీ జనం డీమానిటైజేషన్‌‌‌‌ని గుర్తు చేసుకుంటున్నారు. అలాగే, 2017లో దేశవ్యాప్తంగా అమల్లోకి తెచ్చిన గూడ్స్‌‌‌‌ అండ్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌ ట్యాక్స్ (జీఎస్‌‌‌‌టీ)కూడా ప్రజలను గందరగోళంలో పడేసింది. ఈ రెండు నిర్ణయాల మూలాన లక్షలాది మంది ఉపాధి కోల్పోయారన్న విమర్శ బలంగా ఉంది. చిన్న మద్య తరహా పరిశ్రమలు కోలుకోలేని చావుదెబ్బ తిన్నాయని, జనం మరోసారి సైలెంట్‌‌‌‌ రివల్యూషన్‌‌‌‌కి సిద్ధపడ్డారని నేషనల్‌‌‌‌ మీడియా విశ్లేషించింది. ఈసారి ఎన్నికల్లో ప్రి–పోల్‌‌‌‌ సీట్ల సర్దుబాటుపై పెద్దగా ఎవరూ పట్టించుకోకపోవడానికి కారణం కూడా ఇదే కనిపిస్తోంది. 1996లో మాదిరిగా ఎవరికి వారుగా పోటీ చేసి, సాధ్యమైనన్ని సీట్లను సంపాదించుకోగలిగితే… పోస్టు–పోల్‌‌‌‌ అలయెన్స్‌‌‌‌లో ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి పెట్టవచ్చని భావిస్తున్నారు. మే 23న హంగ్‌‌‌‌ ఫలితాలు వెలువడితే… కొత్త ప్రభుత్వ ఏర్పాటులో తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రపదేశ్‌‌‌‌, పశ్చిమ బెంగాల్‌‌‌‌, యూపీ, ఢిల్లీ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయి.

2018లో ఒక విజయం, మూడు ఓటములు

పోయినేడాది బీజేపీకి అంతగా అచ్చిరాలేదు. ఏడాది మొదట్లో యూపీలో జరిగిన మూడు బై ఎలక్షన్‌‌లలోనూ ఓడిపోగా, త్రిపురలో మాత్రం అనూహ్యంగా విజయం దక్కింది. పాతుకుపోయిన మార్క్సిస్టులను జనం తరిమికొట్టారు. ప్రజలే బీజేపీ కార్యకర్తలుగా మారారు.  ఈ విజయం ఎంతోకాలం నిలువలేదు. ఏడాది చివరలో జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడుచోట్ల బీజేపీ దెబ్బతిన్నది. వరుసగా గెలుస్తూ వస్తున్న చత్తీస్‌‌ఘఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌‌ల్లో అధికారాన్ని కోల్పోయింది. ఇక్కడ కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంది. కిందటిసారి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమే  బీజేపీ ఓటమికి ప్రధాన కారణమైంది. 2013 ఎన్నికల సమయంలో ఛత్తీస్‌‌గఢ్‌‌ రైతులకు అనేక హామీలు గుప్పించి నెరవేర్చలేకపోయింది. ఇదే అంశాన్ని కాంగ్రెస్ ఆయుధంగా మలచుకుని గెలిచింది.

మధ్యప్రదేశ్ బీజేపీకి కంచుకోట. ఇక్కడ బీజేపీ వరుసగా మూడు సార్లు అధికారంలో ఉంది. క్రమంగా శివరాజ్ ప్రభుత్వం మీద ప్రజల్లో పెరిగిన అసమ్మతిని మాత్రం అంచనా వేయలేకపోయింది.  తమ సమస్యలపై ఉద్యమించిన మండసౌర్ రైతులపై కాల్పులు జరిపి ఐదుగురిని బలి తీసుకున్న సంఘటన చౌహాన్ సర్కార్ కు మాయని మచ్చగా మారింది. రాజస్థాన్ విషయానికొస్తే… యువతకు ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి 2013లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అవి నెరవేర్చడంలో రాజే సర్కార్ ఫెయిలైంది. వ్యక్తిగతంగా రాజే అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. ఈ అన్ని కారణాలతో ప్రజలకు బీజేపీ సర్కార్‌‌పై నమ్మకం పోయింది. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఈ అపనమ్మకం కంటీన్యూ కావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

గుజరాత్‌‌లో కాస్త పుంజుకున్న కాంగ్రెస్‌‌

కేంద్రంలో ఎన్డీయే సర్కార్  ఏర్పడ్డ  ఒకట్రెండు ఏళ్లలోనే  బీజేపీ ప్రభావం తగ్గడం మొదలైంది. 2017లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలే దీనికి నాంది పలికాయి.  గుజరాత్ అసెంబ్లీ కి జరిగిన ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు తయారైంది. నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం కాబట్టి ఇక్కడ బీజేపీ లీడర్లు ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ సెగ్మెంట్ల సంఖ్య 182. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 92.. బీజేపీ కేవలం 99 సీట్లు గెలుచుకుని సర్కార్ ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీ సొంతంగా 77 సీట్లు గెలుచుకోగా ఆ పార్టీ మిత్రపక్షాలు మూడు నియోజకవర్గాల్లో విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ కూటమికి 80 సీట్లు దక్కినట్లు అయింది. 2012 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే  కాంగ్రెస్ కు 19 సీట్లు పెరిగాయి. 2012లో 115 సెగ్మెంట్లు గెలుచుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో 16 సెగ్మెంట్లు తక్కువ గెలుచుకుంది. వంద సీట్ల మార్క్ దాటలేకపోయింది.

ఎస్పీ–బిఎస్పీ స్నేహానికి నాంది

2018 తర్వాత ఉత్తరప్రదేశ్‌‌లో బీజేపీ ఇమేజ్ మసకబారడం మొదలైంది. అదే ఏడాది జరిగిన మూడు బై ఎలక్షన్ల ఫలితాలే దీనికి నిదర్శనం. కైరానా, ఫూల్‌‌పూర్‌‌,  గోరఖ్‌‌పూర్ బై ఎలక్షన్స్‌‌లో అధికారంలో ఉన్న బీజేపీ ఓడిపోయింది. ఉప్పు–నిప్పులా ఉండేలా ఎస్పీ, బిఎస్పీలు జట్టు కట్టడానికి ఈ ఫలితాలే నాంది పలికాయి. సమాజ్‌‌వాది పార్టీ గోరఖ్‌‌పూర్‌‌, ఫూల్‌‌పూర్‌‌ దక్కించుకుంటే, ఆర్ఎల్డీ  కైరానాలో విజయం సాధించాయి..సీఎం యోగి సొంత లోక్‌‌సభ సెగ్మెంట్ గోరఖ్‌‌పూర్‌‌లో ఎస్పీ కేండిడేట్‌‌ ప్రవీణ్ కుమార్ విజయం సాధించారు. ఫూల్‌‌పూర్‌‌ బై ఎలక్షన్‌‌లో నాగేంద్ర ప్రతాప్ సింగ్ పటేల్ గెలిచారు. కైరానా నియోజకవర్గంలో అజత్‌‌ సింగ్‌‌కి చెందిన ఆర్ఎల్డీ కేండిడేట్ తబస్సుమ్ హసన్ విజయం సాధించారు. ఈ మూడు సెగ్మెంట్లలోనూ బీజేపీ ఓడిపోవడానికి ప్రత్యేక కారణాలున్నాయి. కైరానా నియోజకవర్గాన్నే  తీసుకుంటే ఇక్కడ రైతులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. షుగర్ ఫ్యాక్టరీస్ తమకు పెద్ద మొత్తంలో ఇవ్వాల్సిన బకాయిల్ని ఇప్పించడంలో యోగి ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని రైతులు గట్టిగా నమ్మారు. దీంతో బీజేపీకి వ్యతిరేకంగా పోలరైజ్ అయ్యారు. గోరఖ్‌‌పూర్‌‌, ఫూల్‌‌పూర్‌‌లలో విజయంతో ‘కలిసికట్టుగా పోటీ చేస్తే బీజేపీని ఓడించడం తేలిక’ అనే భరోసా ఎస్పీ–బిఎస్పీ కూటమికి కలిగింది.