- గల్లీ నుంచి ఢిల్లీ దాకా వాళ్ల అక్రమాలు పాకినయ్
- వాటిపై దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెట్టినయ్: ప్రధాని మోదీ
- మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ట్రైలర్ చూపినం
- అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‍ఎస్, కాంగ్రెస్ అడ్రస్ గల్లంతే
- పొద్దున లేచింది మొదలు నన్ను తిట్టడమే వీళ్ల పని
- కుటుంబ పాలన కోసమా అమరుల త్యాగాలు?
- టీఎస్పీఎస్సీ స్కామ్‌తో నిరుద్యోగులను ముంచిన్రు
- పేదలను, దళితులను, ఆదివాసీలను మోసం చేసిన్రు
- వచ్చే ఎలక్షన్స్‌లో సర్పంచ్‌లు గుణపాఠం చెప్తరని హెచ్చరిక
- వరంగల్‌లో వ్యాగన్ ఫ్యాక్టరీ, నేషనల్ హైవేలకు శంకుస్థాపన
వరంగల్/ హనుమకొండ, వెలుగు: దేశంలోనే అత్యంత అవినీతి సర్కార్ కేసీఆర్‌ది అని ప్రధాని నరేంద్రమోదీ ఫైర్ అయ్యారు. కుటుంబ పార్టీ అయిన కాంగ్రెస్ అవినీతిని దేశం మొత్తం చూస్తే.. మరో కుటుంబ పార్టీ బీఆర్‍ఎస్ అవినీతిని తెలంగాణ మొత్తం చూసిందని అన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ అక్రమాల ఊడలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పాకాయని, వాటిపై దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయని చెప్పారు. సాధారణంగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అభివృద్ధి కోసం ఒప్పందాలు చేసుకుంటాయని, అయితే.. ఇక్కడ మాత్రం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అవినీతి కోసం ఒప్పందం చేసుకున్నాయని బీఆర్‍ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీపై విమర్శలు చేశారు. శనివారం ప్రధాని మోదీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. మొదట భద్రకాళి గుడిలో పూజలు చేశారు. తర్వాత హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‍కు చేరుకొని.. అక్కడ వేదిక నుంచి రూ.6,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పక్కనే ఏర్పాటు చేసిన మరో వేదికపై బీజేపీ విజయ్ సంకల్ప్ సభలో మాట్లాడారు.
రాష్ట్రంలో అవినీతి ఆరోపణలులేని ప్రాజెక్ట్ లేదు. తెలంగాణ ఆర్థిక ప్రగతిని బీఆర్‍ఎస్ నాశనం చేసింది. అవినీతి పునాదుల మీద కుటుంబ పాలన నడిపిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో ప్రజలు తరిమికొడ్తరు” అని మోదీ హెచ్చరించారు.
నిరుద్యోగులను ముంచిన్రు
యువతను, నిరుద్యోగులను కేసీఆర్ సర్కార్ నిండా ముంచిందని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘తెలంగాణ ఉద్యమ టైమ్‌లో ఎన్నో చెప్పారు.. ఉద్యోగాలు ఇస్తామన్నరు.. కానీ.. అవినీతిపరులకు అందలం వేస్తున్నరు. టీఎస్పీఎస్సీ స్కామ్ ఎవరికీ తెలియనిది కాదు.. తొమ్మిదేండ్లలో సర్కార్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులను ఈ స్కామ్‌తో బీఆర్‍ఎస్ సర్కార్ నిండా ముంచింది. వాళ్ల భవిష్యత్తును నాశనం చేసింది. నిరుద్యోగ భృతి అని చెప్పి తప్పించుకుంది” అని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో విద్యా వ్యవస్థను ధ్వంసం చేశారని, 3వేల టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయాల్సి ఉన్నా చేయడం లేదని మండిపడ్డారు. సర్కారు బడుల్లో 15వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా.. భర్తీ చేయకుండా పేద పిల్లలను చదువుకు దూరం చేస్తున్నారని, నిరుద్యోగుల ఆశలను అడియాశలు చేస్తున్నారని అన్నారు.
సర్పంచ్‌లు గుణపాఠం చెప్తరు
పంచాయతీలను కేసీఆర్ సర్కార్ ఆగం చేసిందని మోదీ పేర్కొన్నారు. ‘‘కేసీఆర్ సర్కార్‌పై సర్పంచ్‌లు కోపంతో, అసంతృప్తితో ఉన్నారు. గ్రామ పంచాయతీల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులిస్తుంటే ఇక్కడి సర్కారు కనీసం స్పందించడం లేదు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వానికి సర్పంచ్‌లు తగిన గుణపాఠం చెప్తరు” అని హెచ్చరించారు. బీఆర్‍ఎస్ పాలనలో పేదలు, దళితులు, ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్ల ఇస్తామని చెప్పి, రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి కేసీఆర్ సర్కార్ మోసం చేసిందని మండిపడ్డారు.
తప్పుడు హామీలిచ్చేవాళ్లతో జాగ్రత్త
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు బీజేపీ ట్రైలర్ చూపించిందని, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‍ఎస్, కాంగ్రెస్ రెండింటి అడ్రస్‌ను గల్లంతు చేస్తుందని, ఆ పార్టీలను సాఫ్ చేస్తుందని మోదీ అన్నారు. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేననే విషయం ప్రజల స్పందనను చూస్తుంటే అర్థమవుతున్నదని ధీమా వ్యక్తం చేశారు. ‘‘ఓనాడు దేశవ్యాప్తంగా బీజేపీకి రెండు ఎంపీ సీట్లే ఉండె. అందులో ఒకటి హన్మకొండ నుంచి ఎంపీగా జంగారెడ్డి ఉన్నరు. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఎదిగింది. ఇందులో తెలంగాణ పాత్ర ఎంతో ఉంది. రాష్ట్రానికి బీఆర్‍ఎస్, కాంగ్రెస్ ద్రోహం చేశాయి. అవినీతి అనేది కుటుంబ పార్టీల స్టైల్. ఆ పార్టీల పాలనలు అవినీతి పునాదులపైనే ఆధారపడ్తయ్. ఎన్నికల ముందు కొందరు తప్పుడు హామీలు ఇస్తున్నరు. ప్రజలను మభ్య పెట్టేందుకు, మైండ్ డైవర్ట్ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నరు.
బీజేపీతోనే తెలంగాణలో అవినీతిరహిత పాలన సాధ్యమవుతుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం” అని ప్రధాని మోదీ అన్నారు. తొమ్మిదేండ్లుగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తూనే ఉందని ఆయన తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పంటలకు ఎమ్మెస్పీని పెంచామని, ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామని చెప్పారు. వడ్ల కొనుగోళ్ల కోసం రాష్ట్రానికి రూ. లక్షా 30 వేల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. మెగా టెక్స్టైల్ పార్క్‌ను కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని గుర్తుచేశారు.
తెలుగులో ప్రసంగం మొదలుపెట్టి..
విజయ్ సంకల్ప్ సభలో మొదట ప్రధాని మోదీ.. ‘‘భద్రకాళి అమ్మవారి మహత్యానికి, సమ్మక్క-సారలమ్మ పౌరుషానికి, రాణి రుద్రమ పరాక్రమానికి ప్రఖ్యాతిగాంచిన వరంగల్‌కు రావడం సంతోషంగా ఉంది” అంటూ తెలుగులో ప్రసంగించారు. తాను బీజేపీ కార్యకర్తగా ఈ సభకు వచ్చానని చెప్పారు.
ప్రధానికి స్వాగతం పలికేందుకు మంత్రులు కూడా పోలే..
హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రముఖులెవరూ స్వాగతం పలుకలేదు. శనివారం ఉదయం ప్రత్యేక విమానంలో హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి చేరుకున్న మోదీకి.. సీఎస్శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, సైబరాబాద్సీపీ స్టీఫెన్రవీంద్ర, మేడ్చల్మల్కాజిగిరి కలెక్టర్అమోయ్కుమార్, ఇతర అధికారులు వెల్కమ్ చెప్పారు. గతంలో ప్రధాని రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్స్వాగతం పలికేవారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ పర్యటనను బాయ్‌కాట్ చేయడంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులెవరూ రాలేదు. వరంగల్పర్యటన ముగించుకొని ప్రధాని తిరిగి ఢిల్లీ వెళ్లేప్పుడు కూడా అధికారులే ఆయనకు సెండాఫ్ఇచ్చారు. మామునూరు ఎయిర్‌పోర్టులో అధికారులు, స్థానిక బీజేపీ నేతలు మాత్రమే స్వాగతం పలికారు.
బీఆర్‍ఎస్, కాంగ్రెస్‌తో జాగ్రత్త..
ఎందరో అమరుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబ పాలనలో బందీ అయిందని ప్రధాని మోదీ అన్నారు. ఇట్లా ఒక కుటుంబ పాలనలో బందీ అవుతామని ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ఊహించలేదని తెలిపారు. ఉద్యమ సమయంలో ఎన్నో మాటలు చెప్పి, మరెన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ అన్నివర్గాలను మోసం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్‍ఎస్ అవినీతి పార్టీలని, వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.