అటు పార్టీ, ఇటు ప్రభుత్వం.. అన్నీ అతడే!

అటు పార్టీ, ఇటు ప్రభుత్వం.. అన్నీ అతడే!

నరేంద్ర మోడీ అయిదేళ్ల పాలనలో ఆయన పార్టీకి మించిపోయి ప్రధానమంత్రిగా ఎదిగారు. నెహ్రూ కాలంలో కాంగ్రెస్‌ పార్టీదే పైచేయి. ఆ తర్వాత ఇందిరా గాంధీ అంతా తానై చక్రం తిప్పారు. సరిగ్గా అలాంటి పరిస్థితే ప్రస్తుతం బీజేపీలో ఉంది. వాజ్‌‌పేయి, అద్వానీ వంటి కాకలుతీరిన నాయకులు పార్టీకి కట్టుబడి పనిచేశారు. మోడీ మాత్రం పూర్తిగా డిఫరెంట్‌. ఇందిర తర్వాత పవర్‌‌ఫుల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌‌ ఎవరంటే మోడీ పేరే వినిపిస్తుంది.

ఈ సారి లోక్‌‌సభ ఎన్నికల్లో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ప్రజల సమస్యలు, కీలక అంశాలు అన్నీ అటకెక్కాయి. ప్రధాని నరేంద్ర మోడీనే ఈ ఎన్నికలకు కీలకం అయ్యారు. మిగతా రాజకీయ పార్టీలన్నీ మోడీ అనుకూలం లేదా మోడీ వ్యతిరేకం అంటూ చీలిపోయాయి. దీనికి తగ్గట్లుగానే  జట్లు కట్టాయి. మిగతా పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాయి. ఒక రాజకీయ పార్టీగా బీజేపీ ఇక్కడ అంశం కానే కాదు. అసలు ఇష్యూ నరేంద్ర మోడీనే. అవసరమైతే బీజేపీతో సర్దుకుపోవడానికి  రెడీ అయ్యే  పార్టీలు కూడా కేవలం మోడీపై ఉన్న వ్యతిరేకతతో ప్రత్యర్థి  పక్షాల్లో ఉన్నాయి.

పార్టీలో  మోడీ కంటూ సొంత టీం

రైటిస్ట్ పార్టీ గా ముద్ర పడ్డ బీజేపీలో సహజంగా సిద్ధాంతాలే కీలక అంశాలు అవుతాయి. మోడీ హయాం ప్రారంభమయ్యాక సిద్ధాంతాల కంటే విధేయ వర్గం కీలకమైంది. బీజేపీలో మోడీకి తనకంటూ ఒక సొంత టీం ఉంది. ఈ టీంలో ఏ నాయకుడు ఏ పనికి పనికివస్తాడో మోడీ కి లెక్కలున్నాయి. ఆ లెక్కల ఆధారంగానే వారికి పార్టీ బాధ్యతలు అప్పగించడమో, ప్రభుత్వంలో మంత్రి పదవులు ఇవ్వడమో చేస్తారు.తన టీంలోని నాయకుల నుంచి బెస్ట్ పెర్ ఫార్మెన్స్ రాబట్టుకోవడంలో ఆయనకు ఆయనే సాటని అంటారు.

మోడీతో  కొత్త రాజకీయ కల్చర్‌‌

పరిపాలనలో మోడీ ఓ కొత్త రాజకీయ కల్చర్‌‌ని తీసుకువచ్చారు. అభివృద్ధికి, పనితనానికి  ప్రయారిటీ ఇస్తూ  పనిచేసుకుంటూ పోవడమే ఈ కల్చర్‌‌. అభివృద్ది అనే మాటను ఇప్పుడు ఎక్కువగా చలామణిలో ఉంచింది మోడీనే. గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పటి నుంచే మోడీ రాజకీయాలన్నీ అభివృద్ధి చుట్టూనే నడిచాయి. ఈ కారణంతోనే  గుజరాత్ సీఎంగా యాంటీ ఇన్ కంబెన్సీ ఫ్యాక్టర్ ను ఆయన అధిగమించగలిగారు. సామాన్య ప్రజలతో ఈజీగా కనెక్ట్ అయ్యే రాజకీయాలను ఆయన ఫాలో అయ్యారు.వీటన్నిటితో పాటు అయోధ్య నినాదం నుంచి అభివృద్ధి నినాదానికి బీజేపీని తీసుకెళ్లింది కూడా మోడీనే.

గ్రూప్ దేశాల మీటింగుల్లో హల్‌‌చల్

జీ–7, జీ–20, బ్రిక్స్ వంటి  గ్రూప్ దేశాల మీటింగులు జరిగినప్పుడు ఫోకస్‌‌ అంతా తనమీదనే ఉడే ప్రయత్నం చేస్తారు. అగ్రరాజ్యమైన అమెరికా ప్రెసిడెంట్‌‌తో సరిసమాన గుర్తింపు భారత ప్రైమ్ మినిస్టర్‌‌కి వచ్చిందంటే దీనికి కారణం మోడీ వ్యవహార శైలే అంటున్నారు  అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు.

ఏ లీడర్ విత్ విజన్

నరేంద్ర మోడీ ని  విజన్ ఉన్న నాయకుడంటారు రాజకీయ పండితులు. అనేక అంశాలపై  ఆయనకు స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. దేశ ఆర్థికాభివృద్ధిలో టూరిజంది ప్రధాన పాత్ర అని ఆయన గట్టిగా నమ్ముతారు. అందుకే టూరిజం అభివృద్దికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే విదేశాల నుంచి టూరిస్టులు వస్తారన్న సంగతి ఆయన గ్రహించారు. ఈ కోణంలో పుట్టిందే స్వచ్ఛ్ భారత్.

చాయ్‌‌వాలాగా చెప్పుకోవడానికి సిగ్గుపడరు

జీవితం తొలి రోజుల్లో మోడీ చాయ్ అమ్ముకుని బతికారు. ఈ విషయాన్ని పదేపదే గుర్తు చేయడానికి ఆయన ప్రయత్నిస్తారు. కమిట్మెంట్, కష్టపడి పనిచేసే తత్వం ఉంటే ఎవరైనా తనలా జీవితంలో పైకి రావచ్చంటూ యువతరానికి సంకేతాలు ఇస్తుంటారు.

పవర్​ఫుల్​ పీఎం–2

పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వంటి లీడర్లు ఉన్న రోజుల్లో కూడా కాంగ్రెస్‌‌లో పార్టీదే పైచేయిగా ఉండేది. నెహ్రూది ఆ తర్వాతి స్థానమే. ఇందిర శకం ప్రారంభమయ్యాక పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్ పార్టీని మించి ఇందిరా గాంధీ వ్యక్తిత్వం ఎదిగింది. 1977 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత 1980లో  మళ్లీ అధికారంలోకి వచ్చిందంటే అది కేవలం ఇందిరా గాంధీకి ఉన్న ప్రజాభిమానమే. నూటికి నూరు పాళ్లు ఆమె ఛరిష్మానే. పార్టీలు వేరైనా నరేంద్ర మోడీ కూడా ఇదే కోవకు చెందిన లీడర్. అటల్ బిహారీ వాజ్ పేయి, అద్వానీ వంటి వారు సుదీర్ఘకాలం బీజేపీలో ఉన్నా వారెవరూ పార్టీ కి ప్రత్యామ్నాయం కాలేదు. కానీ మోడీ ఇష్యూ పూర్తిగా డిఫరెంట్. బీజేపీని మించి ఎదిగిన నాయకుడు నరేంద్ర మోడీ. బీజేపీకి ఆయన కమాండర్ వంటి నేత. పార్టీలో ఎవరైనా సరే ఆయన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే. అలాగే ఇందిర తర్వాత దేశ రాజకీయాల్లో అత్యంత పవర్‌‌ఫుల్‌‌ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీయే అంటారు రాజకీయ విశ్లేషకులు.

జనం మెచ్చినవి

బ్యాంకింగ్‌‌‌‌ వ్యవస్థలో ఆర్థిక లావాదేవీలన్నీ ట్రాన్స్‌‌‌‌పరెంట్‌‌‌‌గా మార్చారు. డిజిటల్‌‌‌‌ లావాదేవీలను ప్రోత్సహించడంద్వారా ప్రతి రూపాయికి లెక్క తేలేలా చేశారు. అనేక యాప్‌‌‌‌లతో సామాన్యులు సైతం తేలిగ్గా అన్ని పనులు చేస్తున్నారు. విదేశీ వ్యవహారాల్లో ఇండియాకి కొత్త దశ–దిశ కల్పించారు. అమెరికా, చైనా, రష్యా వంటి దేశాలతో వాణిజ్య సంబంధాల మెరుగుదలకు ప్రాధాన్యమిచ్చారు. సరిహద్దుల్లో తగాదాలను ఫ్రెండ్లీగా పరిష్కరించారు. స్వచ్ఛ భారత్‌‌ ద్వారా దేశాన్ని టూరిజం ఫ్రెండ్లీగా తీర్చిదిద్దారు. ఇండియా అంటే మురికి దేశం అనే చెడు అభిప్రాయాన్ని తొలగించడానికి ప్రయత్నించారు. అన్ని గ్రామాలను ఓడిఎఫ్‌‌గా మార్చాలని నిర్ణయించారు. ఈశాన్య రాష్ట్రాలతో రోడ్డు కనెక్టివిటీ పెంచారు. ప్రధాన భూభాగానికి దూరంగా విసిరేసినట్లుండే ఈశాన్య ప్రాంతంలో రోడ్లు నిర్మించారు. డిఫెన్స్‌‌ అవసరాలు తీర్చడంతో పాటు జీడీపీలో ఇక్కడి ప్రాంతాన్ని చేర్చారు. ప్లానింగ్‌‌ కమిషన్‌‌ స్థానంలో నీతి ఆయోగ్‌‌ ఏర్పాటు చేశారు. కేవలం వచ్చే అయిదేళ్లకు ప్లానింగ్‌‌ మాత్రమే కాకుండా ఆర్థిక లబ్ధికి దూరంగా ఉన్న సామాజిక వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టించారు.పాలనపై పూర్తిగా కంట్రోల్‌‌ సాధించారు. చెదురుమదురు ఘటనలు మినహా అల్లర్లు, ఆందోళనలు సాగనివ్వలేదు. ఫైనాన్స్‌‌ అండ్‌‌ డెవలప్‌‌మెంట్‌‌లో అందరినీ చేర్చడంద్వారా సస్టయినబుల్‌‌ గ్రోత్‌‌కి వీలు కల్పించారు.

జనానికి నచ్చనివి

పెద్ద నోట్ల రద్దువల్ల సామాన్యుల్ని యాభై రోజులపాటు ఉక్కిరిబిక్కిరి చేశారు. రైతులు, మధ్యతరగతి ప్రజలు ఏటీఎంల చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి  సృష్ఠించారు. చివరకు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లయ్యింది. బ్లాక్‌‌మనీని వెలికితీస్తామన్న మాటలు
వట్టిగానే మిగిలిపోయాయి. పేదల ఖాతాల్లో 15 లక్షలు డిపాజిట్‌‌ చేస్తామన్న వాగ్దానం నిలుపుకోలేకపోయారు. జన్​ధన్‌‌ ఖాతాలు తెరిచినవారికి జీరో బ్యాలెన్సే మిగిలింది. జీఎస్టీతో ఇండస్ట్రియలైజేషన్‌‌ మందకొండి తనం ఏర్పడింది. జీఎస్టీ శ్లాబుల్ని పదే పదే మార్చడంద్వారా వస్తువులు, సేవలపై  స్పష్టత లేకుండా చేశారు. పన్నుల ఆదాయం పెరిగి నప్పటికీ జీఎస్టీ గందరగోళం అలాగే ఉంది.పార్టీలో ఆల్టర్నేటివ్‌‌ లేకుండా చేయడంవల్ల నియంతగా ముద్ర పడ్డారు. ప్రభుత్వంలో కూడా తన మాటే చెల్లుబాటు చేసుకుంటూ కేబినెట్‌‌ మంత్రులను ఉత్సవ విగ్రహాలుగా కూర్చోబెట్టారన్న విమర్శలున్నాయి.

ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీ నిలుపు కోలేకపోవడంతో యువతలో నిరాశ ఏర్పడింది. స్టార్టప్‌‌లను ప్రోత్సహిస్తున్నా అనుకున్న వేగం సాధ్యపడడం లేదు. దేశంలో నిరుద్యోగ సమస్యను పట్టించుకోలేదు. చిన్న మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతినడంతో లక్షలాదిమంది రోడ్డున పడ్డారు. దేశంలో స్కిల్డ్‌‌ లేబర్‌‌కి తగినంత పని కల్పించలేకపోయారు. పథకాలు ఆదర్శంగానూ, చేతలు అనాలో
చితంగానూ కనిపిస్తున్నాయి.