మన్ కీ బాత్ తో ప్రజల భావోద్వేగాలను తెలుసుకున్నా : మోడీ

సామాన్యుల సమస్యల పరిష్కారానికి, ప్రజలతో అనుబంధానికి మన్ కీ బాత్  కార్యక్రమం వేదికైందని ప్రధాని మోడీ అన్నారు.  వందో మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ ప్రసంగించారు.  ప్రజల నుంచి తనకు వేల సంఖ్యలో లేఖలు, సందేశాలు వచ్చాయని, వాటిని చదువుతున్నప్పుడు భావోద్వేగాలకు లోనయ్యానని ప్రధాని అన్నారు. ఈ కార్యక్రమం వల్ల తాను అసామన్య సేవలు అందించిన పలువురు గురించి తెలుసుకున్నట్లుగా మోడీ తెలిపారు. సమాజంలో ఎన్నో మార్పులకు మన్ కీ బాత్ శ్రీకారం చుట్టిందని అన్నారు. 

ఈ  సందర్భంగా  మణిపూర్ కు చెందిన విజయశాంతిదేవి తో ప్రధాని మోడీ ఫోన్ లో మాట్లాడారు.  మహిళల సాధికారత కోసం పనిచేస్తున్నారు విజయశాంతి. తన ఉత్పత్తులకు మంచి డిమాండ్ వస్తుందని, ఇంతర దేశాల నుండి  కూడా ఆర్డర్స్  వస్తున్నాయని  విజయశాంతి తెలిపింది. అలాగే విశాఖకు చెందిన వెంకట ప్రసాద్ గురుంచి  కూడా ప్రధాని ప్రస్తావించారు.  భారతీయ వస్తువులే ప్రసాద్ ఎక్కువ ఉపయోగిస్తారని  ప్రధాని అభినందించారు. 

ఈ 100 ఎపిసోడ్ ద్వారా గత స్మృతులను మోడీ గుర్తుచేసుకున్నారు..  సీఎంగా ఉన్నప్పుడు తాను నిత్యం ప్రజలను కలిసేవాడినన్న ప్రధాని..  ఢిల్లీ వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. తనకు చాలాసార్లు ఒంటరినని అనిపించిందని తెలిపారు..ఈ కార్యక్రమం ద్వారా ప్రజలతో  దగ్గరగా ఉన్న అనుభూతి తనకు కలుగుతుందన్నారు.   'సెల్ఫీ విత్ డాటర్' ప్రచారం తనని చాలా ప్రభావితం చేసిందని మోడీ తెలిపారు.  ఈ  ఎపిసోడ్‌లో మోడీ దాని గురించి  ప్రస్తావించారు.  

అక్టోబరు 3, 2014న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇండియాలో 22 ప్రముఖ భాషలు, 29 మాండలికాలతో పాటూ, మన్ కీ బాత్.... ఫ్రెంచ్, చైనీస్, ఇండోనేషియన్, టిబెటన్, బర్మీస్, బలూచి, అరబిక్, పష్టు, పర్షియన్, దరి, స్వాహిలితో సహా 11 విదేశీ భాషలలో కూడా ప్రసారం అవుతుంది. ఆల్ ఇండియా రేడియోకు చెందిన 500కి పైగా ప్రసార కేంద్రాల ద్వారా మన్ కీ బాత్ ప్రసారమవుతోంది.