మరోసారి తెలంగాణకు మోదీ.. మూడు రోజుల టూర్!

పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ గట్టి ఫోకస్ చేసింది.  400 పైగా సీట్లలో గెలువాలని లక్ష్యంగా పెట్టుకుంది.  నార్త్ తో పాటుగా సౌత్ లోని రాష్ట్రలలో  గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని కమలం పార్టీ టార్గెట్ గా ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 15 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. 

ఈనెల 16, 18, 19 తేదీల్లో ఆయన తెలంగాణలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగిత్యాల, నాగర్ కర్నూల్, మల్కాజిగిరిలో ఆయన బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు సమాచారం.  మార్చి17వ తేదీన ఏపీలోని   చిలకలూరిపేటలో టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి సభకు మోదీ హాజరు కానున్నారని సమాచారం

మరోవైపు రేపు అంటే మార్చి 12వ తేదీన  తెలంగాణకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు.  ఇప్పటికే ఆయన పర్యటన ఖరారైంది.12వ తేదీ  మధ్యాహ్నం 1.05 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.   ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు నగరంలోని ఎల్బీ స్టేడియంలో భారీ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.   లోక్ సభ ఎన్నికల్లో పార్టీ గెలుపుపై శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు.  దాదాపుగా 7 గంటల పాటు అమిత్ షా హైదరాబాద్ లోనే ఉంటారు.