Naval Ships: సముద్ర రక్షణలో గ్లోబల్ లీడర్‌.. సైన్యంలోకి మరో మూడు అధునాతన యుద్ధనౌకలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు (జనవరి 15) ముంబైలో పర్యటించనున్నారు. దేశ రక్షణ అవసరాల కోసం అత్యాధునిక యుద్ధ నౌకలు ఐఎన్‌ఎస్‌ సూరత్‌(INS Surat), ఐఎన్‌ఎస్‌ నీలగిరి(INS Nilgiri).. జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్‌(INS Vaghsheer)లను జాతికి అంకితం చేయనున్నారు. ఉదయం 10:30 గంటలకు ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లో మూడు యుద్ధనౌకలను ప్రధాని సైన్యానికి అందజేయనున్నారు.

మూడు యుద్ధనౌకలు ఇవే..

INS సూరత్: P15B గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్ట్ లో చివరి(నాలుగో) నౌక ఇది. ప్రపంచంలోని అత్యంత అధునాతన డిస్ట్రాయర్లలో ఇదొకటి.  75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని తయారుచేశారు. అత్యాధునిక ఆయుధ-సెన్సార్ ప్యాకేజీలు, అధునాతన నెట్‌వర్క్-సెంట్రిక్ సామర్థ్యాలు దీని సొంతం.

INS నీలగిరి: P17A స్టెల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్ట్‌లో తొలి యుద్ధనౌక ఐఎన్ఎస్ నీలగిరి.  శత్రువును ఏమార్చే స్టెల్త్‌ పరిజ్ఞానంతో దీన్ని తయారుచేశారు. ఇండియన్ నేవీ వార్‌షిప్ డిజైన్ బ్యూరోచే దీనిని రూపొందించారు. మెరుగైన స్టెల్త్, మనుగడ కోసం అత్యాధునిక సాంకేతికతను అందించారు.

INS వాఘ్‌షీర్: P75 స్కార్పెన్ జలాంతర్గాములలో చివరి(ఆరో) యుద్ధనౌక.. ఐఎన్ఎస్ వాఘ్‌షీర్. ఫ్రాన్స్‌ నావల్‌ గ్రూప్‌ సహకారంతో దీన్ని అభివృద్ధి చేశారు. సముద్ర భద్రతలో ఈ యుద్ధనౌక కీలకం కానుంది.