కశ్మీర్ లోయలో తొలిసారిగా వందే భారత్ రైలు.. విశేషాలు ఇవే..

కశ్మీర్ లోయలో తొలిసారిగా వందే భారత్ రైలు.. విశేషాలు ఇవే..

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందేభారత్ రైలు సేవలు కశ్మీర్ లోయలో ఏప్రిల్ 19 నుంచి కట్రా నుంచి కశ్మీర్ కు తొలిసారి అందుబాటులోకి రానున్నాయి. 272 కి.మీ.ల మేరకు ఉధంపూర్–శ్రీనగర్–బారాముల్లా రైల్ లింక్(యూఎస్ బీఆర్ఎల్)లో కశ్మీర్ నుంచి న్యూఢిల్లీకి అనుసంధానించే ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైల్వే అనుసంధాన ప్రాజెక్టు పూర్తయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 19న ఈ రైలును ప్రారంభించనున్నారు. 

ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన చీనాబ్​రైలు వంతెన గుండా వెళ్లనున్నది. ప్రస్తుతం జమ్ము రైల్వేస్టేషన్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నందున రైళ్లు రియాసి జిల్లాలోని అంజి వంతెన, చీనాబ్ వంతెన ద్వారా ఉధంపూర్, జమ్ము, కాత్రా గుండా వెళ్తాయి. సంగల్దాన్, బనిహాల్ మీదుగా నేరుగా శ్రీనగర్, బారాముల్లా చేరుకుంటాయి. దీంతో రోడ్డు మార్గంతో పోలిస్తే ఆరు గంటలు ఆదా అవుతుంది.

కశ్మీర్ లోయ వరకు సౌకర్యవంతంగా ప్రయాణాన్ని అందించేందుకు ఈ మార్గంలో నడిచే మొదటి రైలుగా వందే భారత్​ను ఎంపిక చేశారు. ఇందులో భాగంగానే ఈ రైలుకు ప్రత్యేక ఫీచర్లు అనుసంధానించారు. 
    
కశ్మీర్ లోయలో ఉష్ణోగ్రతలు కొన్నిసార్లు –20 డిగ్రీలకు పడిపోతాయి. దీంతో బయట విపరీతమైన మంచు కురుస్తున్నా లోపల ఉన్న ప్రయాణికులు వెచ్చదనాన్ని ఆస్వాదించేలా ఈ రైలును భారత రైల్వే శాఖ ప్రత్యేకంగా రూపొందించింది. తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా రైల్లోని నీరు గడ్డ కట్టకుండా ఉండేందుకు అధునాతన వ్యవస్థను ఉపయోగిస్తున్నారు.