దేశ వ్యాప్తంగా ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల కమిషన్ ప్రకటించగా.. మరోవైపు దేశంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మార్చి రెండో వారంలో ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉంది. దీంతో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను చుట్టేస్తున్నారు మోదీ. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించన ప్రధాని..పలు ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
మార్చి 4 నుంచి 10 రోజుల పాటు.. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మోదీ షెడ్యూల్ ఖరారు అయ్యింది. తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, బెంగాల్, బీహార్, జమ్మూకాశ్మీర్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. మార్చి 4న తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న మోదీ.. బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.
మార్చి 4న తెలంగాణ పర్యటన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులో పర్యటించనున్నారు. కల్పక్కంలో డిపార్ట్ మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ రూమ్ ను సందర్శిస్తారు. చెన్నైలో జరిగే బహిరంగ సభ తర్వాత.. మోదీ హైదరాబాద్ రానున్నారు. 5న సంగారెడ్డిలో పర్యటించనున్న మోదీ పలు ప్రాజెక్టులను జాతికి అంకితం ఇవ్వనున్నారు. సంగారెడ్డి నుంచి ఒడిశాకు వెళ్లనున్న మోదీ... ఛండీఖోలే, జాజ్ పూర్ లో పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.
మార్చి 6న పశ్చిమబెంగాల్, బీహార్ లో పర్యటించనున్నారు. మార్చి 7న జమ్మూకాశ్మీర్, మార్చి 8న అసోం, మార్చి 9న అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తారు. మార్చి 10న యూపీ, 11న ఢిల్లీలో పర్యటించనున్న మోదీ.. అభివృధ్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. మార్చి 12న గుజరాత్ వెళ్లనున్న ప్రధాని.. అటు నుంచి రాజస్థాన్ వెళ్లనున్నారు. మార్చి 13న గుజరాత్, అసోం లో మూడు సెమీకండక్టర్ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు.