ఓరుగల్లుకు మోడీ.. రూ.6 వేల కోట్ల పనులకు శంకుస్థాపన

 

  • నేడు ఓరుగల్లుకు మోడీ
  • రూ.6,100 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని
  • బీజేపీ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి.. 3,500 మంది పోలీసులతో సెక్యూరిటీ
  • హనుమకొండ ఆర్ట్స్‌ కాలేజీ చుట్టూ 20 కిలోమీటర్ల వరకు నో ఫ్లై జోన్‍

హైదరాబాద్ / వరంగల్‍ / హనుమకొండ, వెలుగు:  ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వరంగల్‌కు రానున్నారు. దాదాపు 30 ఏండ్ల కిందట ప్రధాని హోదాలో పీవీ నర్సింహారావు రాగా, ఆ తర్వాత ఇప్పుడు ఓరుగల్లుకు మోదీ వస్తున్నారు. రెండున్నర గంటల పాటు కొనసాగనున్న తన టూర్‌‌లో.. మొత్తం రూ.6,100 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.​ రూ.521 కోట్లతో రైల్వే వ్యాగన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్, రూ.5,550 కోట్లతో 176 కిలోమీటర్ల జాతీయ రహదారులు సహా మొత్తం రూ.6,100 కోట్ల పనులను ప్రారంభించనున్నారు. తర్వాత బీజేపీ ఆధ్వర్యంలో హనుమకొండ ఆర్ట్స్‌ కాలేజీలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌‌తో పాటు ఇతర నేతలు శుక్రవారమే వరంగల్ చేరుకొని జన సమీకరణ, సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు.  జనం భారీగా వచ్చే అవకాశం ఉండటంతో వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు.

జామర్లు.. యాంటీ డ్రోన్‍ టీంలు

ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆర్ట్స్‌‌ కాలేజీ చుట్టూ 20 కిలోమీటర్ల వరకు నో ఫ్లై జోన్‍గా ప్రకటించారు. పీఎం సెక్యూరిటీ చూసే ఎస్‍పీజీ దళాలకుతోడు గ్రేహౌండ్స్, ఆక్టోపస్‍ బృందాలు బందోబస్తును పర్యవేక్షిస్తున్నాయి. దీనికి లోకల్‍గా ఇద్దరు డీఐజీలు, 10 మంది సీపీలు, ఎస్పీలు, 10 మంది డీసీపీలు, 15 మంది అడిషనల్ ఎస్పీలు, 32 మంది ఏసీపీలు, 56 మంది సీఐలు, 250 మంది ఎస్‌‌ఐలతో సహా మొత్తం 3,500 మంది పోలీసులు బందోబస్తులో ఉండనున్నారు. మోదీ పర్యటించే ప్రాంతాల్లో జామర్లు, యాంటీ డ్రోన్‍ టీంలను ఏర్పాటు చేశారు.

భద్రకాళి గుడిలో పూజలు.. కాసేపు ధ్యానం 

ప్రధాని 10.30 గంటలకు భద్రకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుని.. 15 నిమిషాలు అక్కడే గడపనున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలకనున్నారు. పూజల అనంతరం అక్కడే 5 నిమిషాల పాటు మోదీ ధ్యానం చేయనున్నట్లు తెలుస్తున్నది. 

ఆర్ట్స్‌‌ కాలేజీలో రెండు వేదికలు

ప్రధాని సభ కోసం సుబేదారిలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‍లోనే పక్కపక్కనే రెండు వేదికలు ఏర్పాటు చేశారు. మొదటి వేదికలో రూ.6,100 కోట్ల పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో 500 మంది వరకు పాల్గొనేందుకు ఏర్పాట్లు చేశారు. తర్వాత పక్కనే 3 భారీ రెయిన్ ప్రూఫ్‍లతో ఏర్పాటు చేసిన వేదికపై బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు.

గ్రేటర్ వరంగల్‌‌లో ప్రైవేట్‍ స్కూల్స్ బంద్‍

ప్రధాని పర్యటన నేపథ్యంలో వరంగల్ సిటీ పరిధిలోని ప్రైవేట్‍ స్కూళ్లు శనివారం స్వచ్ఛందంగా సెలవు ప్రకటించుకున్నాయి. మోదీ పర్యటించే మెయిన్‍ రోడ్ల వెంట పదుల సంఖ్యలో పెద్ద స్కూళ్లు ఉన్నాయి. దీంతోనే ట్రాఫిక్‌‌కు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. సోమవారం తిరిగి స్కూల్‍ రీఓపెన్‍ చేయనున్నట్లు పేరెంట్స్‌‌కు మెసేజ్‌‌లు పంపాయి.

ప్రధాని షెడ్యూల్ ఇదీ
   

  •  శనివారం ఉదయం 7.35 గంటలకు ప్రత్యేక విమానంలో యూపీలోని వారణాసి నుంచి బయలుదేరనున్న మోదీ 9.25 గంటలకు హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు.
  •     9.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌‌‌‌లో బయల్దేరి 10.15 గంటలకు మామునూర్ హెలిప్యాడ్ కు చేరుకోనున్నారు.
  •     అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రకాళి టెంపుల్‌‌కు 10.30కి చేరుకోనున్నారు.10.45 వరకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
  •     10.50కి భద్రకాళి టెంపుల్ నుంచి బయల్దేరి 11 గంటలకు హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ కు చేరుకోనున్నారు.
  •     11.35 వరకు వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. 
  •     అక్కడ నిర్వహించే బహిరంగ సభలో 11.45 నుంచి 12.20 వరకు పాల్గొననున్నారు.
  •     12.25కు రోడ్డు మార్గం ద్వారా హెలిప్యాడ్ కు వెళ్లనున్నారు.
  •     హెలికాప్టర్‌‌‌‌లో హకీంపేట్ ఎయిర్ పోర్టుకు 1.10 గంటలకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం1.15  బయల్దేరి 3.25కు రాజస్థాన్‌‌లోని బికనీర్ చేరుకోనున్నారు.