- అదే మన బలమైన వారసత్వం: మోదీ
- మన దేశ జీవన విధానంలోనే ప్రజాస్వామ్యం ఉంది
- ప్రవాస భారతీయులతో ప్రపంచవ్యాప్తంగా భారత్ కు గౌరవం దక్కుతోంది
- ఆయా దేశాల్లో భారత్ కు వాళ్లే రాయబారులు అని వెల్లడి
- ఒడిశాలో ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ ప్రారంభించిన ప్రధాని
భువనేశ్వర్: ప్రపంచ భవిష్యత్తు యుద్ధంలో లేదని, బుద్ధుడు చూపించిన శాంతి మార్గంలోనే ఉన్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘ఇప్పుడు ప్రపంచమంతా భారత్ మాట వింటున్నది.
భారత్ కేవలం తన అభిప్రాయాలనే కాకుండా గ్లోబల్ సౌత్ అభిప్రాయాలను బలంగా వినిపిస్తున్నది. యుద్ధంతో సామ్రాజ్య విస్తరణకు అవకాశం ఉన్న టైమ్ లో అశోకుడు శాంతి మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇదే మన దేశ బలమైన వారసత్వం.
ఈ వారసత్వంతోనే ‘భవిష్యత్తు యుద్ధంలో లేదు.. బుద్ధుడిలో (శాంతి) ఉంది’ అని ప్రపంచానికి భారత్ చాటిచెప్పగలుగుతున్నది” అని పేర్కొన్నారు. గురువారం ఒడిశాలోని భువనేశ్వర్ లో మోదీ పర్యటించారు.
ఇక్కడ మూడ్రోజుల పాటు నిర్వహించనున్న 18వ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యానికి భారత్ కేవలం తల్లి లాంటిది మాత్రమే కాదు.. భారతదేశ జీవన విధానంలోనే ప్రజాస్వామ్యం ఉన్నది.
మనకు ఎవరూ వైవిధ్యం గురించి నేర్పించాల్సిన పని లేదు. అందుకే భారతీయులు ఎక్కడికి వెళ్లినా అక్కడి సొసైటీలో భాగమవుతున్నారు. వాళ్లు ఉంటున్న దేశాల్లో అక్కడి సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తున్నారు. ఆయా దేశాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. అదే టైమ్ లో భారత్ కోసం పరితపిస్తున్నారు” అని చెప్పారు. విదేశాల్లో ఉంటున్న భారతీయులందరూ ఆయా దేశాల్లో భారత్ కు రాయబారులు అని పేర్కొన్నారు.
రెండేండ్లలో 14 ఎంబసీలు..
ప్రవాస భారతీయులతోనే ప్రపంచవ్యాప్తంగా భారత్ కు గౌరవం పెరిగిందని మోదీ అన్నారు. ‘‘గత పదేండ్లలో పలు దేశాల అధినేతలను నేను కలిశాను. వాళ్లందరూ ప్రవాస భారతీయులను మెచ్చుకున్నారు.
మీ ద్వారా నాకు ప్రపంచవ్యాప్తంగా ప్రేమ, గౌరవం దక్కాయి. ఇందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. మీ భద్రత, సంక్షేమమే మాకు ప్రాధాన్యం. మీరు ఎలాంటి ఆపదలో ఉన్నా ఆదుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది.
మీకోసం వివిధ దేశాల్లో ఎంబసీలను ఏర్పాటు చేశాం. గత రెండేండ్లలో 14 ఎంబసీలు, కాన్సులేట్ ఆఫీసులను ఏర్పాటు చేశాం” అని తెలిపారు. స్వాతంత్రోద్యమంలో ప్రవాసులు కూడా కీలక పాత్ర పోషించారని చెప్పారు.
2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రవాసులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారత్ విశ్వబంధుగా గుర్తింపు పొందిందని, దాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు.
కుంభమేళాకు వెళ్లండి..
ప్రవాస భారతీయులు తాము ఉంటున్న దేశాల్లో భారత్ గొప్పతనాన్ని చెప్పాలని, అక్కడి వాళ్లు భారత్ ను సందర్శించేలా ప్రోత్సహించాలని మోదీ కోరారు. త్వరలోనే మహాకుంభమేళా ప్రారంభం కానుందని, అందరూ పాల్గొనాలని సూచించారు. కాగా, ఎన్ఆర్ఐల కోసం ఏర్పాటు చేసిన ప్రవాసీ భారతీయ ఎక్స్ ప్రెస్ కు కన్వెన్షన్ వేదికగా మోదీ పచ్చ జెండా ఊపారు. ఈ ట్రైన్ ఢిల్లీ నిజాముద్దీన్ నుంచి బయలుదేరి మూడు వారాల పాటు దేశంలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను చుట్టి రానుంది.
జీనోమ్ సీక్వెన్సింగ్ డేటా రిలీజ్..
మన దేశానికి చెందిన 10 వేల మంది జీనోమ్ సీక్వెన్సింగ్ డేటాను ప్రధాని మోదీ గురువారం విడుదల చేశారు. బయోటెక్నాలజీ రీసెర్చ్ లో ఇదొక మైలురాయి అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐఐటీలు, సీఎస్ఐఆర్, బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ (బీఆర్ఐసీ) లాంటి 20కి పైగా ప్రముఖ సంస్థలు ఈ డేటాను తయారు చేశాయని తెలిపారు. బయోటెక్నాలజీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జీనోమిక్స్ డేటా కాన్ క్లేవ్ లో మోదీ వర్చువల్ గా పాల్గొన్నారు.
ప్రపంచ అభివృద్ధికి భారత్ ఎంతో చేసింది: ట్రినిడాడ్ ప్రెసిడెంట్
ప్రపంచ అభివృద్ధి కోసం భారత్ ఎంతో కృషి చేసిందని ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రెసిడెంట్ క్రిస్టిన్ కార్లా కొనియాడారు. ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ లో ఆమె వర్చువల్ గా మాట్లాడారు.
‘‘ప్రపంచ అభివృద్ధికి భారత్ చేసిన కృషి విశేషమైనది. ప్రపంచంలోనే మొదటి యూనివర్సిటీని తక్షశిలలో క్రీ.పూ. 700 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. 6 వేల ఏండ్ల కిందటే సింధూ నదిలో నావిగేషన్ కు పునాది పడింది. ఆల్జీబ్రా, త్రికోణమితి, డెసిమల్ సిస్టమ్ ఇండియాలోనే డెవలప్ చేశారు” అని ఆమె పేర్కొన్నారు.