హైదరాబాద్, వెలుగు: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు జీవిత ప్రస్థానంపై విడుదల చేసిన పుస్తకాలు దేశ ప్రజలను ప్రభావితం చేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయనతో సుదీర్ఘ కాలం పని చేసే అవకాశం తనకు దక్కిందని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రి, ఉప రాష్ట్రపతి వరకు ఎదిగారన్నారు. ఆదివారం ఢిల్లీ నుంచి వెంకయ్య నాయుడు జీవితానికి సంబంధించిన మూడు పుస్తకాలను ప్రధాని మోదీ వర్చువల్గా రిలీజ్ చేసి మాట్లాడారు. ‘‘చైర్మన్గా ఉన్నప్పుడు రాజ్యసభను ఎంతో సమర్థవంతంగా నడిపారు. ఆయన జీవితం యువతకు ఆదర్శం. రాజకీయ, సేవా రంగంలో ఎంతో మందికి వెంకయ్య నాయుడు మార్గదర్శిగా నిలిచారు. ఆయన వాగ్ధాటి, వాక్ చాతుర్యం ముందు ఎవరూ నిలువలేరు. గ్రామీణ, పట్టణాభివృద్ధి మంత్రిగా దేశవ్యాప్తంగా ఎంతో మార్చు తెచ్చారు. బీజేపీకి ఎలాంటి పునాది లేని టైమ్లో ఏబీవీపీ కార్యకర్తగా ఎంతో గొప్ప పోరాటాలు చేశారు’’అని మోదీ అన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా వెంకయ్య నాయుడు పోరాడారని గుర్తు చేశారు.
చట్టసభ్యులు హుందాగా ప్రవర్తించాలి: వెంకయ్య నాయుడు
గచ్చిబౌలిలోని ఓ కన్వెన్షన్ సెంటర్ లో ఆదివారం “75 ఏండ్ల ఆత్మీయ కలయిక, పంచ సప్తతి” పేరుతో వెంకయ్య నాయుడు బర్త్ డే వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో సినీ, రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు అటెండ్ అయి విషెస్ చెప్పారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణితో పాటు మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రముఖులకు వెంకయ్య బుక్స్ ను అందజేశారు. సిద్ధాంతపరమైన రాజకీయాలను ప్రోత్సహించాలని, చట్టసభలకు తొలిసారి ఎంపికైన వారు హుందాగా ప్రవర్తించాలని, సీనియర్ల స్పీచ్ లను వింటూ నేర్చుకోవాలని వెంకయ్య నాయుడు కోరారు. సిద్ధాంతాలు నచ్చకపోతే పార్టీ మారొచ్చని, అయితే.. పార్టీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేసి వెళ్లాలని సూచించారు. ఉచిత స్కీమ్ లతో పబ్లిక్ ను సోమరులుగా మార్చొద్దని ప్రభుత్వాలను కోరారు. ఫ్రీ రేషన్ దుబారా అవుతున్నదని, అవసరం ఉన్న వారికే రేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. యువతలో స్కిల్స్ పెంచాలని ఇందుకు ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరారు. స్కూల్ బుక్స్ మాతృభాషలో ఉండేలా ప్రధాని నిర్ణయం తీసుకున్నారని, యూజీసీ, ఏఐసీటీఈలు వర్క్ స్టార్ట్ చేశాయని వెంకయ్య నాయుడు తెలిపారు.