ఇది 130 కోట్ల భారతీయుల సమష్టి కృషి

ఇది 130 కోట్ల భారతీయుల సమష్టి కృషి

న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్‌లో భారత్ రికార్డు సృష్టించింది. వంద కోట్ల మైలురాయిని అధిగమించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఓ ట్వీట్ చేశారు. భారత్ చరిత్రను సృష్టించిందని హర్షం వ్యక్తం చేసిన ప్రధాని.. దేశ శాస్త్ర, సాంకేతిక విజయానికి మనం సాక్షులుగా నిలిచామన్నారు. ఇది 130 కోట్ల భారతీయుల సమష్టి కృషి వల్లే సాధ్యమైందని కొనియాడారు. వ్యాక్సినేషన్‌లో కీలక పాత్ర పోషించిన డాక్టర్లు, నర్సులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశ జనాభాలో 60 శాతం మందికి వ్యాక్సినేషన్ చేయాలని నిర్ణయించిన కేంద్రం ప్రభుత్వం.. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం..  దేశంలో18 ఏళ్లు దాటిన వారిలో మూడు వంతులకు పైగా మంది ప్రజలు సింగిల్ డోసు టీకా తీసుకున్నారు.  అలాగే 30 శాతం మంది రెండు డోసులు వేయించుకున్నారు.  

ఎక్కువ మంది కొవిషీల్డ్ తీసుకున్నరు 

వ్యాక్సినేషన్‌లో 1 బిలియన్ మార్కును చేరుకోవడానికి భారత్‌కు 279 రోజులు పట్టింది. దేశంలో ఎక్కువ మంది కొవిషీల్డ్ టీకా తీసుకున్నారు. టీకా తీసున్న వారిలో దాదాపు 88.41 శాతం మంది కొవిషీల్డ్, 11.48 శాతం మంది కొవ్యాక్సిన్ తీసుకున్నారు. రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ 0.11 శాతం మంది మాత్రమే వేయించుకున్నారు. టీకా తీసుకున్న వారిలో 51.9 శాతం మంది పురుషులు ఉండగా.. మహిళల శాతం 48.1గా ఉంది. 

టాప్‌లో హిమాచల్.. ఏపీ తర్వాతి ప్లేస్‌లో తెలంగాణ

దేశంలో ఎక్కువ వ్యాక్సిన్‌లు ఇచ్చిన రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నిలిచింది. ఈ స్టేట్‌లో ఫస్ట్ డోసుకున్న తీసుకున్న వారి శాతం 103.1గా ఉండగా.. రెండు డోసులు వేయించుకున్న వారు 56.3 శాతంగా ఉన్నారు. హిమాచల్ తర్వాతి స్థానాల్లో జమ్మూ కశ్మీర్, కేరళ, ఉత్తరాఖండ్, గుజరాత్ టాప్ 5 ప్లేసుల్లో నిలిచాయి. ఇక ఈ లిస్టులో ఆంధ్రప్రదేశ్ 13, తెలంగాణ 14వ స్థానాల్లో ఉన్నాయి. ఏపీలో టీకా తొలి డోసు తీసుకున్న వారు 77 శాతంగా ఉండగా.. రెండో డోసును 43.8 శాతం మంది తీసుకున్నారు. తెలంగాణలో ఫస్టు డోసు తీసుకున్న వారు 75 శాతం ఉండగా.. సెకండ్ డోసు తీసుకున్న వారి శాతం 29.6గా ఉంది.  

తెలంగాణలో 69 లక్షల మంది ఒక్క డోసూ తీసుకోలే

తెలంగాణలో వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతోంది. మరో ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రంలో 3 కోట్ల డోసుల వాక్సినేషన్ పూర్తి కానుంది. 75 శాతం మందికి మొదటి డోస్ పూర్తయింది. రాష్ట్రంలో 50 లక్షల వాక్సిన్ నిల్వలు ఉన్నాయి. దీనిపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాస రావు స్పందించారు. రాష్ట్రంలో 0.4 శాతం పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. కొవిడ్ అదుపులో ఉందని.. అయితే వ్యాక్సిన్ రెండో డోసును లైట్ తీసుకోవద్దన్నారు. రెండో డోస్ తీసుకోవాల్సిన వాళ్లు 36 లక్షల పైచిలుకు మంది ఉన్నారని.. ఆ డోస్‌‌ను తేలిగ్గా తీసుకోవద్దని కోరారు. రష్యా, యూకేల్లో కేసులు, మరణాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. వాక్సిన్ తీసుకోని వారిలో 60 శాతం మందికి వైరస్ సోకుతోందన్నారు. ఒక్క డోస్ తీసుకున్న వాళ్లలో 30 శాతం మందికి కరోనా సోకుతోందని.. ప్రతి ఒక్కరూ రెండు డోసులు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో దాదాపు 69 లక్షల మంది ఇంకా ఒక్క డోస్ కూడా తీసుకోలేదన్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

జైలులో కొడుకును కలిసిన షారూఖ్

గిఫ్టులను పాక్ ప్రధాని అమ్ముకుంటున్నారా?

​​​​​​సీఎం అని కూడా చూడకుండా తిడుతున్నరు: వైఎస్ జగన్