సెప్టెంబర్‎లో ప్రధాని మోడీ రిటైర్మెంట్.. అది చెప్పడానికే RSS ఆఫీస్‎కు వెళ్లారు: సంజయ్ రౌత్

సెప్టెంబర్‎లో ప్రధాని మోడీ రిటైర్మెంట్.. అది చెప్పడానికే RSS ఆఫీస్‎కు వెళ్లారు: సంజయ్ రౌత్

ముంబై: ప్రధాని మోడీ ఆర్ఎస్ఎస్ కార్యాలయ పర్యటనపై శివసేన (యూబీటీ) కీలక నేత, ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ సెప్టెంబర్‎లో రిటైర్మెంట్ అవ్వాలనుకుంటున్నారని.. ఆ విషయం చర్చించడానికే ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శించారని సెన్సేషనల్ ఎలిగేషన్స్ చేశారు.  గత 10, 11 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి మోడీ ఎప్పుడు వెళ్లలేదు.. కానీ ఆయన సడెన్‎గా అక్కడ పర్యటించడానికి కారణం ఇదేనని అన్నారు. 

సెప్టెంబర్లో ప్రధాని పదవి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాననే విషయం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‏కు చెప్పడానికే మోడీ ఆ సంస్థ కార్యాలయానికి వెళ్లారని ఆరోపించారు. మోహన్ భగవత్‏కు స్వయంగా టాటా, బై, బై చెప్పడానికే మోడీ వెళ్లారని ఆరోపణలు చేశారు. తనకు ఉన్న సమాచారం మేరకు.. ఆర్ఎస్ఎస్ దేశ నాయకత్వంలో మార్పు కోరుకుంటుంది. ఇక ప్రధాని మోడీ కాలం ముగిసిందని హాట్ కామెంట్స్ చేశారు. తదుపరి బీజేపీ నూతన అధ్యక్షుడిని కూడా సంఘ్ పరివార్ ఎన్నుకోవాలనుకుంటోందని పేర్కొన్నారు. ప్రధాని మోడీ వారసుడిని త్వరలోనే ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తోందన్నారు. 

ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యలకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పదవి విరమణ గురించి మాట్లాడేందుకే ప్రధాని మోడీ ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వచ్చాడన్న సంజయ్ రౌత్ వ్యాఖ్యలను ఖండించారు. ప్రధాని మోడీ ఇప్పట్లో రిటైర్ కారని.. ఇంకా చాలా సంవత్సరాలు దేశాన్ని పాలిస్తారని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. 2029లో మనం మళ్ళీ మోడీని ప్రధానమంత్రిగా చూస్తామని.. ఇప్పుడే ఆయన వారసుడి కోసం వెతకాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.

 ప్రస్తుతం ఆయన మా నాయకుడని.. భవిష్యత్‎లోనూ ఆయనే కొనసాగుతారని స్పష్టం చేశారు. తండ్రి జీవించి ఉన్నప్పుడు వారసత్వం గురించి మాట్లాడటం మన హిందు సంస్కృతిలో కరెక్ట్ కాదని.. అది మొఘల్ సంస్కృతి అని దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.  మోడీ రిటైర్మెంట్ గురించి చర్చించాల్సిన సమయం ఇంకా రాలేదు అని ఫడ్నవీస్ పేర్కొన్నారు. 

ప్రధాని మోడీ పీఎం హోదాలో తొలిసారి 2025, మార్చి 30న మహారాష్ట్ర నాగ్‎పూర్‎లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్‌కు ప్రధాని మోడీ నివాళులర్పించారు.  ఆర్ఎస్ఎస్ భారతదేశ సాంస్కృతిక, సైద్ధాంతిక వారసత్వాన్ని సూచించే మహా వృక్షం అని అభివర్ణించారు. అలాగే.. నాగ్‎పూర్‎లో దివంగత RSS చీఫ్ మాధవరావు సదాశివరావు గోల్వాల్కర్ అలియాస్ గురూజీ జ్ఞాపకార్థం స్థాపించిన మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్‎కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు.