పాక్​లో ప్రభుత్వ ఏర్పాటుపై ఊగిసలాట

ఇస్లామాబాద్: ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో అధికార పంపిణీపై పాకిస్తాన్  ముస్లిం లీగ్  నవాజ్ (పీఎంఎల్ఎన్), పాకిస్తాన్  పీపుల్స్  పార్టీ (పీపీపీ) మధ్య ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. రెండు పార్టీలు అధికార పంపిణీపై ఊగిసలాడుతున్నాయి. ఈ విషయంపై రెండు పార్టీలకు చెందిన సమన్వయ కమిటీ సభ్యుల మధ్య శనివారం జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయని పాక్  మీడియా ఆదివారం తెలిపింది. దీంతో సోమవారం మరోసారి చర్చలు జరపనున్నారు. అయితే, చర్చల్లో పురోగతి కనిపిస్తోందని పీఎంఎల్ఎన్  ఒక ప్రకటనలో తెలిపింది.

బలమైన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ పేర్కొంది. ‘‘పీఎంఎల్ఎన్, పీపీపీ చేసిన ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. అధికార పంపిణీని ఖరారు చేయడానికి మరోసారి చర్చలు నిర్వహించనున్నారు” అని రెండు పార్టీలు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. కాగా, ప్రధానమంత్రి పదవికి మాజీ ప్రధాని నవాజ్  షరీఫ్  తన తమ్ముడు షెహబాజ్​ షరీఫ్​ను నామినేట్  చేసిన విషయం తెలిసిందే. నవాజ్ చేసిన ప్రతిపాదనకు బిలావల్  భుట్టో నాయకత్వంలోని పీపీపీ అంగీకరించింది. అయితే, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలక పదవులను తమకు ఇవ్వాలని పీపీపీ షరతు పెట్టింది.

కాగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే పోటీచేసిన 265 సీట్లలో 133 స్థానాలు గెలవాలి. నేషనల్  అసెంబ్లీలో మొత్తం 266 సీట్లు ఉండగా.. 265 సీట్లకే ఎన్నికలు జరిగాయి. మరో స్థానానికి ఎన్నిక జరపాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్  ఖాన్​ మద్దతుదారులు 101, పీఎంఎల్ఎన్  75, పీపీపీ 54 సీట్లు గెలిచాయి. ముత్తహిద ఖువామీ మూవ్ మెంట్  పాకిస్తాన్(ఎంక్యూఎంపీ) కి 17 సీట్లు వచ్చాయి