పాకిస్తాన్​లో హంగ్?​ ఇమ్రాన్​ ఖాన్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన ఇండిపెండెంట్ల హవా

ఇస్లామాబాద్: పాకిస్తాన్ జనరల్ ఎలక్షన్స్​లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలుపొందారు. అయితే, రాత్రి వరకు వెలువడిన ఫలితాల్లో ఏ పార్టీకి తగిన మెజారిటీ  వచ్చే సూచనలు లేకపోవడంతో హంగ్​ ఏర్పడనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

హింసాత్మక ఘటనల మధ్య గురువారం సాయంత్రం పోలింగ్ ముగిసింది. వెంటనే ఫలితాల వెల్లడి ప్రారంభం కావాల్సి ఉండగా.. పది గంటలు ఆలస్యంగా శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి రిజల్ట్స్ ప్రకటన ప్రారంభమైంది. దీంతో ఎన్నికల ఫలితాలను మార్చేందుకు అవకతవకలు జరుగుతున్నాయంటూ పీటీఐ సహా ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. పాక్ నేషనల్ అసెంబ్లీలోని 336 సీట్లకు గానూ  మహిళలు, మైనార్టీల రిజర్వ్డ్ సీట్లు మినహా 264 సీట్లకు (ఒకచోట ఎన్నిక వాయిదా)ఎన్నికలు జరిగాయి. శుక్రవారం రాత్రి వరకు 225 సీట్ల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో పీటీఐ మద్దతున్న స్వతంత్రులు 92 మంది గెలవగా.. పీఎంఎల్​–ఎన్  64  సీట్లు, పీపీపీ 50 చోట్ల గెలుపొందిందని ఈసీ ప్రకటించింది. దీంతో తామే సింగిల్​ లార్జెస్ట్ పార్టీగా నిలిచామని నవాజ్ షరీఫ్​ తెలిపారు. 

షరీఫ్​ విక్టరీ స్పీచ్​..

ఫలితాలు పూర్తిగా వెల్లడి కాకముందే పీఎంఎల్​– ఎన్ అధినేత నవాజ్ షరీఫ్​ తామే గెలిచినట్లు ప్రకటించుకున్నారు. ఓవైపు స్వతంత్రులు లీడ్​లో కొనసాగుతున్నప్పటికీ షరీఫ్​ తనే గెలిచినట్లు ప్రకటించుకున్నారు. ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ విక్టరీ స్పీచ్ ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుపై పార్టీలతో సంప్రదింపులు జరుపుతామని వెల్లడించారు.

పీటీఐ తరఫున ఇండిపెండెంట్లు.. 

జైలుపాలైన ఇమ్రాన్ ఖాన్​పై ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఉంది. పీటీఐ పార్టీ గుర్తును వాడుకునే చాన్స్ లేకపోవడంతో తన అభ్యర్థులను ఇండిపెండెంట్లుగా బరిలోకి దింపింది.