- సీఎస్ ను ఆదేశించిన పీఎంఓ
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీలో అవినీతి జరిగిందని వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలని తెలంగాణ సీఎస్ ను పీఎంఓ ఆదేశించింది. బల్దియాలోని అవినీతిపై ఈడీ, సీబీసీఐడీతో విచారణ జరిపించాలని 20 రోజుల కింద ప్రధాని నరేంద్ర మోడీకి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్, బీజేపీ మజ్దూర్ సెల్ సిటీ చెర్మన్ ఊదరి గోపాల్ లెటర్ రాశారు. స్పందించిన ప్రధాన మంత్రి కార్యాలయం పూర్తి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఈ నెల 20న సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించిందని గోపాల్ ఆదివారం మీడియాతో చెప్పారు.
రాంకీతో జీహెచ్ఎంసీ చేసుకున్న ఒప్పందం వల్ల జీహెచ్ఎంసీ ఏడాదికి వెయ్యి కోట్లు నష్టపోతోందని, రాంకీ పేరుతో బల్దియాలో పెద్ద అవినీతి జరిగిందని, ఇందులో మంత్రి కేటీఆర్ పాత్ర కూడా ఉందని పీఎంకు రాసిన లెటర్లో గోపాల్పేర్కొన్నారు. ఇప్పటి వరకు వివిధ పనుల పేరుతో రాంకీకి రూ.12 వేల కోట్లు ఇచ్చిందని, ఇందులో దుబారా ఖర్చు వల్ల జీహెచ్ఎంసీకి రూ.5 వేల కోట్లు అప్పులు అయ్యాయని తెలిపారు.