మోడీ భద్రతా వైఫల్యంపై అన్ని ఎంక్వైరీలు ఆపేయండి

మోడీ భద్రతా వైఫల్యంపై అన్ని ఎంక్వైరీలు ఆపేయండి

ప్రధాని మోడీ పంజాబ్ పర్యటనలో తలెత్తిన భద్రతా వైఫల్యాలపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. రిటైర్డ్ జడ్జితో స్వతంత్ర కమిటీని వేసేందుకు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యాకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం  అనుమతిచ్చింది. చండీగఢ్ డీజీపీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఐజీ, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, పంజాబ్ రాష్ట్ర సెక్యూరిటీ విభాగానికి చెందిన ఏడీజీపీలతో కూడిన స్వతంత్ర కమిటీని నియమించింది. రిటైర్డ్ సుప్రీం జడ్జి నేతృత్వంలో ఈ కమిటీ ఎంక్వైరీ చేస్తుందని సుప్రీం ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎంక్వైరీ కమిటీలను పక్కన పెట్టేయాలని ఆదేశించింది.

అంతకు ముందు వాదనలు వినిపించిన పంజాబ్ అడ్వకేట్ జనరల్.. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కోర్టును కోరారు. అయితే కేంద్రం తరపున వాదనలు వినిపంచిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా..స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు నిబంధనలను సంబంధించి బ్లూ బుక్ వివరాలను కోర్టు ముందు ఉంచారు. నిబంధనలన్నింటినీ తూచ తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత పంజాబ్ డీజీపీదేనని తెలిపారు.  ప్రధాని కాన్వాయ్ ఆగిన ప్రదేశానికి 100 మీటర్ల దూరంలోనే నిరసనకారులు బైఠాయిస్తే డీజీపీ ఎందుకు సమాచారం ఇవ్వలేదని అన్నారు. పంజాబ్ ఇంటెలిజెన్స్  వైఫల్యం కూడా ఇందులో ఉందన్నారు. దానికి ఇంటెలిజెన్స్ ఐజీదే బాధ్యతన్నారు తుషార్ మెహతా. 


కేంద్ర హోం శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై పలు సందేహాలు వ్యక్తం చేసిన న్యాయమూర్తులు సూర్యాకాంత్, హిమా కోహ్లి.. భద్రతా వైఫల్యం జరిగిందని, ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోవాల్సిందేనన్నారు. అయితే జరుగుతున్న విషయాలు సందేహాలు లేవనెత్తుతున్నాయన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చాక కూడా 24 గంటల్లో షోకాజ్ నోటీసులకు సమాధానం ఇవ్వమని రాష్ట్ర అధికారులను కోరడం ఏమిటని ప్రశ్నించారు. అధికారులపై క్రమశికణా చర్యలు తీసుకోవాలనుకుంటున్నప్పుడు ఇక కోర్టు చేయాల్సింది ఏముందని కేంద్రంపై అసహనం వ్యక్తం చేశారు సీజేఐ ఎన్వీ రమణ రమణ. షోకాజ్ నోటీసులుపై సందేహాలు ఉంటే కేంద్ర కమిటీ దర్యాప్తు జరిపి నివేదిక సమర్పిస్తుందని, అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోమని ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత తెలిపారు. కేంద్ర కమిటీలో కేబినెట్ సెక్రటరీ, SPG ఐజీ, ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఉన్నారని.. తాము తప్పు చేసినట్లు వారు ఇప్పటికే నిర్దారణకు వచ్చారన్నారు పంజాబ్ ప్రభుత్వం న్యాయవాది. కేంద్రం కమిటీపై తమకు నమ్మకం లేదని, స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరారు.