
ప్రభుత్వ రంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) రిటైల్ లోన్లపై వడ్డీ రేట్లను సవరించింది. గృహరుణాలు, కారు, పర్సనల్ లోన్లు, ఎడ్యుకేషన్ లోన్లపై వడ్డీరేట్లను తగ్గించింది. సవరించిన వడ్డీ రేట్లను ఫిబ్రవరి 10, 2025 నుంచే అమలులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ఇటీవల ఆర్బీఐ రెపోరేటు 25బేసిస్ పాయింట్లు తగ్గించిన తర్వాత PNB ఈ నిర్ణయం తీసుకుంది.
హోమ్ లోన్ వడ్డీరేట్లు..
గృహరుణాలపై PNB కస్టమర్లకు స్పెషల్ ఆఫర్లు ప్రకటించింది.. వడ్డీ రేట్లు 8.15 శాతం నుంచి అందిస్తుంది. మార్చి 31, 2025 వరకు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీ, డాక్యుమెంటేషన్ ఫీ లేకుండా అందిస్తోంది. రూ. 5కోట్ల వరకు హోమ్ లోన్స్ పొందవచ్చు. ప్రతి లక్ష రూపాయలకు ఈఎంఐ రూ. 744 నుంచి చెల్లించవచ్చు.
కారు లోన్లు..
కారు లోన్లపై పంజాబ్ నేషనల్ బ్యాంకు 8.50 శాతం నుంచి వడ్డీ రేట్లకు రుణాలు ఇస్తోంది. దాదాపు రూ. 20 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. లక్ష రూపాయలకు రూ. 1240 నుంచి ఈఎంఐ చెల్లించవచ్చు.
పర్సనల్ లోన్లు..
పంజాబ్ నేషనల్ బ్యాంకు ద్వారా రూ. 20లక్షల వరకు లోన్లు పొందవచ్చు. ప్రస్తుత వడ్డీ రేట్లు 11.25శాతం నుంచి ప్రారంభం అవుతాయి. స్వాగత్ ద్వారా ఓటీపీ ఆధా రంగానే రూ. 10 లక్షల వరకు పర్సనల్ లోన్లు పొందవచ్చు.