బూర్గంపహాడ్, వెలుగు: గిరిజన మహిళలు ఆర్థికంగా బలపడాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ బీ. రాహుల్ అన్నారు. మండలంలోని మోరంపల్లి బంజర్ లోని జై జగదాంబ మేరమ్మ యాడి రెడీమేడ్ గవర్నమెంట్ మగ్గం కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గిరిజన మహిళలు సొసైటీ ఏర్పాటు చేసుకొని కుట్టు శిక్షణ తీసుకోవాలని, వివిధ రకాల డిజైనింగ్ లు నేర్చుకోవాలని చెప్పారు.
ఎంబ్రాయిడరింగ్, జిగ్ జాగ్, , అల్లికలు డిజైనింగ్ , మగ్గం ద్వారా బట్టలు తయారు చేసి చుట్టుపక్కల గ్రామాల్లో అమ్మాలని చెప్పారు. దీని ద్వారా జీవనోపాధి పెంపొందించుకోవడం అభినందించ దగ్గవిషయమని అన్నారు. సొసైటీగా ఏర్పడి సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు స్థాపించుకొని జీవనోపాధి పెంపొందించుకోవడానికి అన్ని విధాలా సహకారాలు అందిస్తామని తెలిపారు. మోరంపల్లి బంజర్ యూనిట్ సభ్యులను ఆదర్శంగా తీసుకొని గిరిజన మహిళలు మగ్గం వర్క్ లో శిక్షణ తీసుకోవడానికి ముందుకు రావాలని చెప్పారు.
వారికి శిక్షణ ఇచ్చి తప్పనిసరిగా ఎం ఎస్ఎంఎ యూనిట్ ద్వారా నచ్చిన పనికల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎస్ ఓ భాస్కర్, ఏపీఎం నాగార్జున, రామ్ కుమార్, మగ్గం కేంద్రం నిర్వాహుకులు పాల్గొన్నారు.
ముడి సరుకుల కొనుగోలు సొంతంగా చేసుకోవాలి
భద్రాచలం,వెలుగు : దమ్మక్క జాయింట్ లయబిలిటీ గ్రూపు, లక్ష్మీ గణపతి మహిళా ట్రైబల్ జాయింట్ లయబిలిటి గ్రూపు ఆదివాసీ గిరిజన మహిళలు నడుపుతున్న సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలను మంగళవారం ఐటీడీఏ పీవో రాహుల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఈ యూనిట్ ద్వారా గ్రూపు మహిళలు తయారు చేస్తున్న సబ్బులు, షాంపూలు, న్యూట్రిమిక్స్ డ్రైమిక్స్ లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సబ్బుల, షాంపూల, న్యూట్రేషన్ ఫుడ్ తయారీకి అవసరమయ్యే ముడిసరుకులను సొంతంగా గ్రూపుసభ్యులే కొనుగోలు చేసుకోవాలన్నారు. తయారు చేసిన వస్తువుల మార్కెటింగ్‌పై కూడా పట్టుసాధించాలని సూచించారు. సబ్బులు, షాంపూలు గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలకు సరఫరా చేసి ఆర్థికంగా ఎదగాలని అన్నారు.
దళారుల మాటలు నమ్మొద్దని హెచ్చరించారు. న్యూట్రిమిక్స్ డ్రైమిక్స్ ఫుడ్ కూడా హాస్టళ్లలోని గిరిజన బాల,బాలికలకు సరఫరా చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ సెంటర్లకు కూడా సప్లై చేసేలా ఆఫీసర్లు ప్లాన్ చేయాలన్నారు. పీవో వెంట ఇన్చార్జి ఎస్వో భాస్కర్, జీసీసీ డీఎం దావీద్ తదితరులు ఉన్నారు.