- వృద్ధుడిని ఢీకొట్టిన ఎమ్మెల్సీ కాన్వాయ్
- తల, కాలుకు తీవ్రగాయాలు
- ఓవర్స్పీడ్, అజాగ్రత్త వల్లే ప్రమాదం
- వేరే కారులో వెళ్లిపోయిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
ఆత్మకూరు (దామెర): హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ వద్ద ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ఓ వృద్ధుడిని ఢీకొట్టింది. ఊరుగొండ గ్రామానికి చెందిన దేవులపల్లి సాంబయ్య రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్నాడు. ఈ క్రమంలోనే ఎమ్యెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి అతడిని ఢీ కొట్టింది. దీంతో సాంబయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే అతన్ని సమీపంలోని ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ కు తరలించారు. శ్రీనివాస్ రెడ్డి కారులో నుంచి దిగి వేరే వాహనంలో వెళ్లిపోయాడు. డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. కారు, డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.