సీతక్కపై ఈసీ సుమోటో కేసు పెట్టాలే: పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి

  • ఓటమి భయంతో చౌకబారు విమర్శలు చేస్తున్నారు: ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‍రెడ్డి

వరంగల్‍, వెలుగు: కల్తీ సారా, దొంగనోట్లు పంచుతున్నామని బీఆర్‍ఎస్‍  నేతలపై ఆరోపణలు చేసిన ములుగు కాంగ్రెస్‍  అభ్యర్థి సీతక్కపై ఎలక్షన్‍ కమిషన్‍, ఎక్సైజ్‍  డిపార్టుమెంట్‍  సుమోటో కేసు పెట్టాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివా స్‍రెడ్డి డిమాండ్  చేశారు. సీతక్క వ్యాఖ్యలు ఎన్నికల నియమావళిని అనుమానించేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మాజీ ఎంపీ సీతారాం నాయక్‍తో కలిసి మంగళవారం హనుమకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో పోచంపల్లి మాట్లాడారు. సీతక్కకు ఓటమి కళ్ల ముందు కనపడుతోంది కాబట్టే చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

కరోనా కష్టాన్ని సీతక్క కరెన్సీ కట్టలుగా మార్చుకున్నారని, కర్నాటక, ఛత్తీస్‍గఢ్‍ నుంచి వందల కోట్లు చందాలుగా తెచ్చుకున్నారని ఆరోపించారు. తనను కేసీఆర్‍  బినామీ అనడాన్ని తప్పుపట్టారు. నార్కో ఎనాలిసిస్‍  టెస్ట్‌‌ కు సిద్ధంగా ఉన్నానని, ఎవరు ఎవరికి బినామో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని సవాల్  విసిరారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్‍ రెడ్డి డైరెక్షన్‍లో సీతక్క చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.