- పదవిని కాపాడుకునేందుకు భాస్కర్‌రెడ్డి హైడ్రామా, నెగ్గిన అవిశ్వాసం
- ఉమ్మడి జల్లాలో కీలక పదవి కోల్పోయిన బీఆర్ఎస్
- ఇన్చార్జి చైర్మన్‌గా రమేశ్‌రెడ్డికి బాధ్యతలు
- 26న పూర్తిస్థాయి చైర్మన్ ఎన్నిక
నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డిపై మెజార్టీ డైరెక్టర్లు ప్రతిపాదించిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో ఆయన పదవి కోల్పోయారు. మొత్తం 20 మంది డైరెక్టర్లకు ఓటు హక్కు ఉండగా, గురువారం నాటి స్పెషల్ మీటింగ్‌కు 17 మంది అటెండయ్యారు. వారిలో 16 మంది నోకాన్ఫిడెన్స్ తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. దీంతో బలపరీక్షలో చైర్మన్ భాస్కర్‌రెడ్డి ఫెయిల్ అయ్యారని డీసీవో శ్రీనివాస్‌రావు ప్రకటించారు. వైస్ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డికి ఇన్చార్జి చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఈనెల 26న చైర్మన్ ఎన్నిక ఉంటుందని తెలిపారు.
భాస్కర్‌రెడ్డి మైండ్ గేమ్..
చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు భాస్కర్‌రెడ్డి సంతకంతో ఉన్న ఓ లెటర్ బుధవారం రాత్రి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నోకాన్ఫిడెన్స్ మీటింగ్ ఉంటుందా? లేదా? అని డైరెక్టర్లు కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ లెటర్‌ను ఎలా పరిగణించాలో తెలియక కొన్ని గంటలు పాటు ఆఫీసర్లూ సందిగ్ధంలోనే ఉన్నారు. రిజైన్ చేసిన పదవికి నోకాన్ఫిడెన్స్ మీటింగ్ అవసరం లేదనే భావనతో డైరెక్టర్లు మీటింగ్‌కు అటెండ్ కారని, మీటింగ్ జరగని పక్షంలో అవిశ్వాసం వీగి తానే చైర్మన్‌గా కొనసాగొచ్చని భాస్కర్‌రెడ్డి మైండ్ గేమ్ ఆడినట్లు తెలుస్తోంది.
రిజైన్ లెటర్‌ను చైర్మన్ వ్యక్తిగతంగా వచ్చి అందజేయాలని, వాట్సాప్ లేక ఇతర పద్ధతుల్లో పంపితే ఆమోదించమని తేల్చిన అధికారులు యథావిధిగా మీటింగ్‌కు రెడీ అయ్యారు. బుధవారం రాత్రే నిజామాబాద్‌లోని ఓ హోటల్లో బసచేసిన డైరెక్టర్లు వైస్ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి నాయకత్వంలో పోలీస్ బందోబస్తు మధ్య మీటింగ్ హాల్ చేరారు. పదవి కాపాడుకోడానికి ఆఖరు నిమిషం దాకా పోచారం భాస్కర్‌రెడ్డి వేసిన ఎత్తులేవీ ఫలించలేదు.
పాలిటిక్స్‌లో ఎదగాలని చతికిల
పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయుడిగా రాజకీయాల్లో ఎదగాలని ఆరాటపడిన పోచారం భాస్కర్‌రెడ్డి తాజా పరిణామాలతో ఢీలా పడ్డారు. తండ్రి పొలిటికల్ పవర్‌తో డీసీసీబీ చైర్మన్ దాకా వెళ్లగలిగిన ఆయన, మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేయాలని ఆశించారు. సాధ్యం కాకపోవడంతో జహీరాబాద్ ఎంపీకైనా పోటీ చేయాలని అనుకున్నారు. చివరకు అదీ నెరవేరలేదు. ఇప్పుడు చైర్మన్ పదవి కూడా దూరం కావడంతో ఆయన ఆధిపత్య రాజకీయాలకు తెరపడింది.
సుదర్శన్‌రెడ్ది రిటర్న్ గిఫ్ట్!
కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రిగా ఉన్న సుదర్శన్‌రెడ్డి, 2012లో తన అనుచరుడైన బోధన్‌కు చెందిన గంగాధర్‌రావు పట్వారీని డీసీసీబీ చైర్మన్ ను చేశారు. 2014లో బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి రాగా, పోచారం శ్రీనివాస్‌రెడ్డి అగ్రికల్చర్, కోఆపరేటివ్ మినిస్టర్ గా వ్యవహరించారు. గంగాధర్‌రావు పట్వారీ కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్లో చేరేలా పోచారం శ్రీనివాస్‌రెడ్డి బెదిరించారనే ప్రచారం జరిగింది. తన మనిషిని పార్టీ వీడేలా చేశారనే కోపంతో ఇన్నాళ్లు ఉన్న సుదర్శన్‌రెడ్డి ఇప్పుడు భాస్కర్‌రెడ్డిని పదవి దింపేసి తండ్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారనే టాక్ నడుస్తోంది.