ప్రాజెక్ట్, అభయారణ్యం వద్ద వసతుల కల్పనకు ఆఫీసర్ల కసరత్తు
మెదక్, వెలుగు : పోచారం ప్రాజెక్ట్, వన్యప్రాణి అభయారణ్యం ప్రాంతాన్ని టూరిస్ట్ స్పాట్ గా డెవలప్ చేసే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఐదేళ్ల కిందే ఇక్కడ టూరిజం డెవలప్ మెంట్ కోసం అధికారులు ప్రణాళికలు రూపొందించారు. కానీ అవసరమైన ఫండ్స్ మంజూరు కాక అభివృద్ధి అటకెక్కింది. మళ్లీ ఇప్పుడు కసరత్తు మొదలైంది. మరి ఈసారైనా అధికారులు పనులు కంప్లీట్ చేస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏండ్లుగా ఉన్న డిమాండ్..
మెదక్, కామారెడ్డి జిల్లాల సరిహద్దులో పోచారం ప్రాజెక్ట్ ఉంది. దీనిని ఆనుకునే పోచారం వన్యప్రాణి అభయారణ్యం ఉంది. వన్యప్రాణులతో అలరారే పోచారం అభయారణ్యం నిజాం పాలన కాలంలో షికార్ ఘర్ గా పేరొందింది. కృష్ణ జింకలు, నీల్ గాయ్లు, సాంబార్లు తదితర వన్యప్రాణులు ఉండే అభయారణ్యంలో విహరించేందుకు, పోచారం ప్రాజెక్ట్ అందాలను చూసేందుకు ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్ నుంచి సందర్శకులు ఎక్కువగా వస్తుంటారు. వానాకాలంలో ప్రాజెక్ట్ పూర్తిగా నిండి పొంగిపొర్లే సమయంలో ఎక్కువ మంది ఇక్కడికి వస్తారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్, అభయారణ్యం ప్రాంతాన్ని టూరిస్ట్ స్పాట్‌గా డెవలప్ చేయాలనే డిమాండ్ ఎన్నో ఏండ్లుగా ఉంది.
2017లో కొన్ని పనులు చేసి వదిలేసిన్రు..
పోచారం ప్రాజెక్ట్ ప్రాంతాన్ని టూరిస్ట్ స్పాట్‌గా డెవలప్ చేసేందుకు 2017లో అప్పటి జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి చర్యలు చేపట్టారు. ప్రాజెక్ట్ ఒడ్డున ఉన్న స్థలాన్ని చదును చేసి, పర్యాటకులను ఆకర్షించేందుకు బోటింగ్ ఏర్పాటు చేశారు. ప్రాజెక్ట్ మధ్యలో ఉన్న ఐలాండ్ మీద హోటల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఒడ్డున ఉన్న గెస్ట్ హౌస్ ను అధునికీకరించి, తాగునీరు, టాయిలెట్ తదితర మౌలిక వసతులు కల్పిస్తామని, మెదక్, ఎల్లారెడ్డి మెయిన్ రోడ్డు నుంచి ప్రాజెక్ట్ వరకు రోడ్డు సౌకర్యం మెరుగు పరుస్తామని చెప్పారు. కానీ అవేవీ అమలు కాకపోగా, బోటింగ్ కూడా కొన్నాళ్లకే బంద్ అయ్యింది. కలెక్టర్ భారతి హోళికేరి ట్రాన్స్ ఫర్ అయ్యాక పట్టించుకునే వారే కరువయ్యారు.
ఐదేళ్ల తర్వాత మళ్లీ చర్యలు...
ఐదేళ్ల తరువాత ఇప్పుడు మళ్ళీ పోచారం ప్రాజెక్ట్ ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇటీవల తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ నుంచి వచ్చిన సీనియర్ కన్సల్టెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్అధికారులు, జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారితో కలిసి పోచారం ప్రాజెక్ట్ ను పర్యాటక ప్రాంతాంగా అభివృద్ధిపర్చేందుకు ఉన్న అవకాశాలపై అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ సమీక్షించారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా పోచారం ప్రాజెక్ట్ ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నామని ఆమె తెలిపారు.
పర్యాటక అభివృద్ధి సంస్థ ద్వారా పోచారం అభయారణ్యం ప్రాంతంలో సుమారు 30 ఎకరాల స్థలంలో థీమ్ పార్కును ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ప్రాజెక్ట్ సమీపంలో శిథిలావస్థలో ఉన్న రెండు గెస్ట్ హౌస్ ల రెనోవేషన్, హోటళ్ల ఏర్పాటు, ప్రాజెక్ట్‌లో బోటింగ్, ఒడ్డున చిల్డ్రన్ గేమ్స్, లైటింగ్, పార్కింగ్, టాయిలెట్స్ లాంటి సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు కన్సల్టెంట్ లతో కలిసి ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. మరి ఇది ఏ మేరకు కార్యరూపందాలుస్తుందో చూడాలి.