
బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న నేతలపై మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి ఫైరయ్యారు. పార్టీ నుంచి చెత్త అంతా పోయింది. గట్టి వాళ్లే మిగిలారని అన్నారు. మొదటి నుంచి గులాబీ జెండా మోసిన కార్యకర్తలు, నాయకులు పార్టీలోనే ఉన్నారని అన్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో పోచారం మాట్లాడారు.
పదవులు, అధికారం, వ్యాపారాల కోసం వచ్చిన స్వార్ధపరులు, మోసకారులే పార్టీ మారుతున్నారని పోచారం మండిపడ్డారు. మోసకారుల లిస్ట్ రాస్తే మొదటి పేరు బీబీ పాటిల్ దే ఉంటుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరవాత బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయని తెలిపారు.
మరోవైపు పార్టీలోంచి వెళ్లిపోయిన వారిని రేపు వస్తామంటే పార్టీలోకి తీసుకోవద్దని పార్టీ నిర్ణయించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కష్ట కాలంలో పార్టీకి ద్రోహం చేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్టేనని చెప్పారు. మధ్యలో పార్టీలోకి వచ్చినవాళ్ళు పార్టీలోంచి వెళ్లిపోతున్నారన్నారు. ఇది ఆకులు రాలే కాలం...కొత్త చిగురు మళ్ళీ పార్టీలో పుట్టుకువస్తుందని హరీష్ రావు చెప్పుకొచ్చారు.