తలఎత్తుకొని ఓట్లు అడగండి : పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ, వెలుగు: నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, ఎన్నికల్లో తల ఎత్తుకొని ప్రజలను ఓట్లు అడగాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు సూచించారు. శుక్రవారం బాన్సువాడ శివారులోని సోమేశ్వర్ చౌరస్తాలో కార్యకర్తలతో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మనకు బలం, బలగం రెండు ఉన్నాయని, ఈ సారి కూడా విజయం మనదేనన్నారు. నియోజకవర్గంలోని 76 శాతం మంది బీఆర్ఎస్​కు అనుకూలంగా ఉన్నట్లు చెప్పారు.

నియోజకవర్గాన్ని వేల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ప్రజలు అడిగిన అన్ని పనులు చేశామని, ఓట్లడిగే హక్కు మనకు మాత్రమే ఉందన్నారు. స్పీకర్ రాజ్యాంగబద్ధ పదవి అయినా శాసనసభ్యుడిగా నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు పరిష్కరించానన్నారు.అక్టోబర్ 30న బాన్సువాడలో లక్ష మంది ప్రజలతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, సమావేశానికి సీఎం కేసీఆర్ వస్తారని చెప్పారు. నవంబర్ 4న నామినేషన్ ​వేస్తానన్నారు.

కార్యక్రమంలో డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి, బీఆర్ఎస్​ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, బంజారా నాయకులు బద్యానాయక్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఎంపీపీ నీరజ తదితరులు పాల్గొన్నారు.