ఇక జైలుకే.. నో బెయిల్: కొరియోగ్రాఫర్ జానీపై పోక్సో కేసు

ఇక జైలుకే.. నో బెయిల్: కొరియోగ్రాఫర్ జానీపై పోక్సో కేసు

 కొరియోగ్రాఫర్, పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్ కొరియోగ్రాఫర్ జానీపై ఉచ్చు బిగిసుకుంది. అతనిపై ఏకంగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు. తన సహా మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై.. మైనర్ గా ఉన్నప్పుడే లైంగిక వేధింపులకు గురి చేయటంతో.. ఇప్పుడు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. బాధితురాలి స్టేట్ మెంట్ ఆధారంగా కేసులో కొత్త సెక్షన్లు పెట్టారు. 

పోక్సో చట్టం కింద కేసు నమోదు కావటంతో.. ఇక జానీకి బెయిల్ వచ్చే పరిస్థితులు కూడా లేవు. పోక్సో చాలా తీవ్రమైన నేరం. ఈ కేసులో వెంటనే బెయిల్ కూడా రాదు. అరెస్ట్ అయిన వెంటనే జైలుకు వెళ్లాల్సిందే. ఒక వేళ కోర్టులో నేరం రుజువు అయితే.. జానీకి కనీసం పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 

ప్రస్తుతం జానీ జాడ ఎక్కడా లేదు. అతని కోసం నార్సింగ్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నాలుగు ప్రత్యేక బృందాలు వెతుకుతున్నాయి. నెల్లూరులో ఉన్నట్లు సమాచారం రావటంతో.. అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు నార్సింగ్ పోలీసులు. నెల్లూరులో లేడని సమాచారం. కేసు నమోదు అయిన వెంటనే జానీ.. విదేశాలకు వెళ్లిపోయాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. వీటిపై ఇంకా స్పందించలేదు పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాడా లేక దేశంలోనే ఎక్కడైనా తలదాచుకున్నాడా లేక విదేశాలకు వెళ్లాడా అనేది తెలియాల్సి ఉంది. జానీ ఫోన్లు అన్నీ స్విచ్ఛాప్ అయ్యి ఉన్నాయి. అతని భార్య, ఇతర బంధువుల నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదు.