మభ్యపెట్టి బాలికను పెళ్లి చేసుకున్నడు .. నలుగురిపై పోక్సో కేసు

మిర్యాలగూడ, వెలుగు : స్కూల్ కి వెళ్తున్న బాలికను (14) మభ్యపెట్టి పెళ్లి చేసుకున్న యువకుడితోపాటు అతనికి సహకరించిన మరో ముగ్గురిపై పోలీసులు పోక్సో చట్టం కింద  కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మిర్యాలగూడ రూరల్  సీఐ సత్యనారాయణ మంగళవారం రాత్రి రూరల్ పీఎస్ లో మీడియా సమావేశంలో వెల్లడించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం రుద్రారం గ్రామానికి చెందిన ఓ బాలిక పట్టణంలోని ఓ స్కూల్లో చదువుతోంది. 

ఈనెల 22వ తేదీన స్కూల్ కు వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో ఆమె పేరెంట్స్  రూరల్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. మిర్యాలగూడ మండలం యాధ్గార్ పల్లి గ్రామానికి చెందిన చరణ్ దీప్  ఆ బాలికను బైక్ పై తీసుకెళ్లి అతని సోదరుడు చరణ్ తేజ, మిత్రులు మహేశ్, అంజి సహకారంతో అడవిదేవులపల్లి మండలం చత్రశాలలో పెళ్లిచేసుకున్నట్లు గుర్తించారు. 

అనంతరం బాలికను హైదరాబాద్ కు తీసుకెళ్లారు. తాను ఇంటికి వెళ్తానని బాలిక చెప్పగా... హయత్ నగర్  బస్టాండ్ లో వదిలివెళ్లారు. అప్పటికే ఆమె ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, తల్లిదండ్రులు ఆమెను గుర్తించి ఇంటికి తీసుకెళ్లారు. పరారీలో ఉన్న నలుగురు నిందితులను అవంతీపురం వ్యవసాయ మార్కెట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.