
కోనరావుపేట, వెలుగు : స్టూడెంట్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఓ టీచర్‌పై పోక్సో కేసు నమోదు అయింది. వివరాల్లోకి వెళ్తే... రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ఓ ప్రభుత్వ స్కూల్‌లో బ్రహ్మం అనే టీచర్ సైన్స్ బోధిస్తున్నాడు. ఇతడు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుండడంతో తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లగా వారు హెచ్‌ఎంకు ఫిర్యాదు చేశారు. తర్వాత పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసి స్కూల్ చైర్మన్‌తో మాట్లాడి టీచర్‌ను మందలించారు.
ఇదిలా ఉండగా మహిళా పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక స్కూల్‌లో ‘పోలీస్ అక్క’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు టీచర్ బ్రహ్మం ప్రవర్తన గురించి మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం సదరు టీచర్‌పై పోక్సో కేసు నమోదు చేసి, అతడిని రిమాండ్‌కు తరలించారు