యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్ కు 20 ఏండ్ల జైలు శిక్ష

  • బాలికపై లైంగిక దాడి కేసులో పోక్సో కోర్టు తీర్పు

అమరావతి: 14ఏండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో యూట్యూబర్ 'ఫన్ బకెట్ భార్గవ్'కు విశాఖపట్నం ప్రత్యేక పోక్సో కోర్టు 20 ఏండ్ల  జైలు శిక్ష విధించింది. అంతేగాక.. , బాధిత బాలికకు నష్టపరిహారంగా రూ.4 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఫన్ బకెట్ భార్గవ్ ఓ బాలికతో టిక్ టాక్ వీడియోలు చేస్తూ, ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు.  

దాంతో బాలిక గర్భం దాల్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పెందుర్తి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసుపై విశాఖ నగర మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ డాక్టర్ జి. ప్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి దర్యాప్తు జరిగింది. అనంతరం ఛార్చ్ షీటుతోపాటు సాక్ష్యాలను పోలీసులు కోర్టులో సమర్పించారు. వాటిని పరిశీలించిన విశాఖపట్నం ప్రత్యేక పోక్సో కోర్టు ఫన్ బకెట్ భార్గవ్ ను దోషిగా తేల్చింది.