భద్రాచలం, వెలుగు : గిరిజనులు తయారు చేసిన వస్తువులకు ఖండాంతరాల్లో పేరు రావాలని తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌చైర్మన్ పొదెం వీరయ్య, ఐటీడీఏ పీవో బి.రాహుల్ అన్నారు. సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆవరణలో బుధవారం దమ్మక్క లయాబిలిటీ గ్రూప్ గిరిజన మహిళలు ఎంఎస్ఎంఈ యూనిట్ ద్వారా కొత్తగా నెలకొల్పిన ట్రైబల్ షాపింగ్ మాల్‌ను వారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీతారాముల దర్శనానికి దేశ, విదేశాల నుంచి భక్తులు, టూరిస్టులు వస్తుంటారని, వారిని మెప్పించేలా, ఆకర్షించేలా కళాఖండాలు ఉండాలని సూచించారు. ప్రకృతి వనరులతో తయారు చేసిన సబ్బులు, షాంపూలు, తేనె, వెదురుతో తయారు చేసిన వివిధ రకాల కళా ఖండాలు వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో రమాదేవి, జీసీసీ డీఎం సమ్మయ్య, జేడీఎం హరికృష్ణ, ముర్ల రమేశ్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.