మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం అక్కెపెల్లిలో పోడు భూముల కేసులో జైలు నుంచి బెయిల్ పై విడుదలైన ఆరుగురికి గ్రామస్తులు డప్పుచప్పుళ్లతో ఘనంగా స్వాగతం పలికారు. చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి పటాకులు పేల్చి సంబురాలు జరుపుకున్నారు. నిరంకుశ బీఆర్ఎస్సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కెపెల్లిలో పోడు సాగు చేస్తున్నారంటూ గ్రామానికి చెందిన 19 మందిపై కేసులు పెట్టిన ఫారెస్ట్ ఆఫీసర్లు దొంగచాటుగా తాపకు కొందరిని అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారు. పోడుతో ఎలాంటి సంబంధం లేకపోయినా.. గ్రామస్తులను పోడుకు ప్రోత్సహిస్తున్నాడంటూ ఓ గవర్నమెంట్టీచర్ ను సైతం ఏ1గా చేర్చారు.
ఆయన కొడుకుతో పాటు మరో నలుగురు యువకులను కుటుంబసభ్యులకు సమాచారం లేకుండానే అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇటీవల మరో ఆరుగురిని ఇలాగే అరెస్టు చేసి జైలుకు పంపగా, వారు గురువారం బెయిల్‌పై విడుదలయ్యారు. గ్రామస్తులు వారికి డప్పు చప్పుళ్లతో స్వాగతం పలుకుతూ గ్రామంలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి నిట్టూరి సారయ్య, నాయకులు నల్లగుంట సంతోష్, కొడిపె సందీప్, మల్లయ్య, ఆత్కూరి రాజలింగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సారయ్య మాట్లాడుతూ.. ఈ అరెస్టుల వెనక ఎమ్మెల్యే బాల్క సుమన్అనుచరులైన వైస్ ఎంపీపీ బాపురెడ్డి, మార్కెట్‌కమిటీ చైర్మన్మల్లెల దామోదార్రెడ్డితో పాటు మరికొందరి హస్తం ఉన్నదని ఆరోపించారు. గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులను ఫారెస్ట్ఆఫీసర్లు వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.