
ఏటూరునాగారం, వెలుగు : ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని చిన్న బోయినపల్లిలో పోడు వివాదం నెలకొంది. నాలుగేండ్లుగా రైతులు పంటలు వేయడానికి సిద్ధం కావడం, ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుకోవడం, రాజకీయ నాయకులు ఎంట్రీ ఇచ్చి వివాదాన్ని తాత్కాలికంగా సద్దుమణిగేలా చేయడం పరిపాటిగా మారింది. చిన్నబోయినపల్లిలోని163 జాతీయ రహదారి పక్కన స్థానిక రైతులు 40 ఏండ్ల నుండి పోడు సాగు చేసుకుంటున్నారు. కానీ, ఈ భూములు తమవంటూ హరితహారం మొక్కలు నాటేందుకు ఫారెస్ట్ఆఫీసర్లు ప్రయత్నిస్తున్నారు. రాజకీయ నాయకులు జోక్యం చేసుకొని రెవెన్యూ, ఫారెస్ట్ ఆఫీసర్లతో జాయింట్ సర్వేలు చేపట్టి సమస్యకు పరిష్కారం చూపిస్తామని చెప్పడంతో అందరూ సైలెంటయ్యారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు.
ఈ క్రమంలో ఈ ఏడాది పత్తి నాటే సీజన్ దాటిపోయిందని, పల్లి పంటైనా సాగు చేసుకుందామనే ఉద్దేశంతో సోమవారం రైతులు పోడు భూముల్లో ఎడ్లు, నాగళ్లతో దున్నుతుండగా ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుకున్నారు. ఇది రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ అని బయటకు వెళ్లాలని డీఆర్వో నరేందర్ రైతులను హెచ్చరించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి సర్ధి చెప్పారు. ఈ భూముల్లో 40 ఏండ్లుగా సాగు చేసుకుంటున్నామని, ఫారెస్ట్ ఆఫీసర్లు నాలుగేండ్లుగా సేద్యం చేయకుండా అడ్డుకుంటూ ఇబ్బందుల గురి చేస్తున్నారని రైతులు రోడ్డుపై నిరసనకు దిగారు.
అదే టైంలో ములుగు నుంచి ఏటూరునాగారం వస్తున్న బీఆర్ఎస్జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు ఇరు వర్గాలతో మాట్లాడి విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అప్పటి వరకు రైతులు, ఫారెస్టు ఆఫీసర్లు సంయమనం పాటించాలని చెప్పి వెళ్లిపోయారు.