- హరితహారం పేరుతో పోడు భూములు గుంజుకుంటున్నరు: వివేక్ వెంకటస్వామి
- గిరిజన మహిళలతో కలిసి గవర్నర్ కు ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: ఫారెస్టు అధికారులు ఆదివాసీలను బెదిరిస్తున్నారని, హరితహారం పేరుతో పోడు భూములు గుంజుకుంటున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. అమాయకులైన గిరిజనులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పోడు భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్... ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయ పోషగూడెం గ్రామానికి చెందిన 12 మంది ఆదివాసీ మహిళలను పోడు వ్యవసాయం చేస్తున్నారనే కారణంతో పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు.
దీనిపై బాధిత మహిళలతో కలిసి మంగళవారం రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసైకి వివేక్ ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 50 ఏండ్ల నుంచి ఆదివాసీ మహిళలు పోడు వ్యవసాయం చేసుకుంటుంటే, అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం దారుణమని వివేక్ మండిపడ్డారు. జూన్ 2న అందరూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటే, పోషగూడెంలో మాత్రం 12 మంది ఆదివాసీ మహిళలను ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకు పంపిందని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ మండిపడ్డారు.
10 రోజులు జైల్లో ఉన్నం...
మేము నాయకపోడు వాళ్లం. అడవి మీద ఆధారపడి బతుకుతున్నం. 2002 నుంచి పోడు వ్యవసాయం చేస్తున్నం. మమ్మల్ని ఫారెస్ట్ వాళ్లు, పోలీసులు కేసులు, అరెస్టుల పేరుతో భయపెడుతున్నరు. నాతో పాటు 12 మందిపై కేసులు పెట్టి జైలుకు పంపిన్రు.10 రోజులు జైల్లోనే ఉన్నం. - పోషమ్మ, ఆదివాసీ మహిళ