
ఆసిఫాబాద్ / జైనూర్, వెలుగు : ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతరులు సాగు చేసు కుంటున్న పోడు భూములకు ఈసారి హక్కు పత్రాలు ఇచ్చే అవకాశాలు కన్పించడం లేదు. ప్రభుత్వం పెట్టిన నిబంధనలు దీనికి అడ్డు వస్తున్నాయి. షెడ్యూల్ ఏరియా భూ చట్టాలు అమల్లో ఉండడంతో వాళ్ల భూములకు మోక్షం లభించడం లేదు. పోడు చేసుకుంటున్న గిరిజన రైతులకు ఈనెల 24న జిల్లాలో హక్కు పత్రాల పంపిణీని ప్రభుత్వం చేపట్టనుంది. ఎలాగైనా తమకు కూడా సాగు హక్కు పత్రాలు ఇవ్వాలని గిరిజనేతరులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
16,033 అప్లికేషన్లు పెండింగ్ లోనే ..
పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వడానికి గత నవంబర్ లో అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 31,633 అప్లికేషన్లు అందాయి. 15,600 మంది గిరిజనులు దరఖాస్తు చేయగా ,16,033 మంది నాన్ ట్రైబల్స్ అప్లై చేసుకున్నారు. ఇందుకోసం 76,800 ఎకరాల్లో అధికారులు పోడు భూముల సర్వే నిర్వహించారు. మొత్తం మీద ట్రైబల్స్ కన్నా నాన్ ట్రైబల్స్ రైతుల దరఖాస్తులే అధికంగా అందాయి. కాగా జిల్లాలో కేవలం గిరిజన రైతులకు మాత్రమే హక్కు పత్రాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు.
పోడు హక్కు పత్రాల అర్హత కు రూల్స్
గిరిజనులైతే 2005 డిసెంబర్ 13 కంటే ముందు నుంచి సాగులో ఉండి ఆ భూమే జీవనాధారంగా ఉంటున్నట్లు ఆ గ్రామ పెద్దలు వాంగ్మూలం ఇవ్వాలి. గ్రామంలో 2005 కంటే ముందు నుంచే సదరు కుటుంబం నివసిస్తున్నట్టు ఏదైనా ఐడీ ఫ్రూఫ్ తప్పనిసరి చూపాలి. అదే గిరిజనేతరులైతే 1930 కంటే ముందు నుంచి
సుమారు 75 సంవత్సరాలుగా గ్రామంలో ఉండి భూమిని సాగు చేస్తున్నట్టు, భూమికి సంబంధించిన ఫ్రూఫ్ అందించాల్సి ఉంటుంది. జిల్లాలోని పదిహేను మండలాల్లో నాన్ ట్రైబల్స్ రైతులే అధికంగా పోడు సాగు చేస్తున్నారు. ఒక్క జైనూర్ మండలంలోనే 40 వేల ఎకరాల్లో నాన్ ట్రైబల్స్ రైతులు పోడు చేస్తున్నట్లు అంచనా. 1930 కంటే ముందు నుంచి కూడా ఈ ప్రాంతంలో నివసిస్తున్న ఆధారాలు నాన్ ట్రైబల్స్ దగ్గర ఉన్నాయని చెపుతున్నారు.
ఓటు బ్యాంకు రాజకీయం...
జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలోని ట్రైబల్, నాన్ ట్రైబల్ ఓటు బ్యాంకుతో అనేక పార్టీలు రాజకీయం చేస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఐదేళ్ల క్రితం నాన్ ట్రైబల్ రైతులు సాగు చేస్తున్న భూములకు తాత్కాలిక పహానీలు ఇచ్చినట్టే ఇచ్చి అవి చెల్లవంటూ రద్దు చేశారు.
అప్పుడు ఆ పహానీలతో కొంత మంది పంట రుణాలు కూడా తీసుకున్నారు. వాటిని రద్దు చేయడంతో రుణాలు తీసుకున్న రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఆ భూములకు పట్టాలు ఇవ్వాలంటూ నాన్ ట్రైబల్స్ రైతులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు..
మూడుతరాలుగా ముప్పుతిప్పలు
నేను ఆరు ఎకరాలు పోడు సాగుచేస్తున్న. పట్టా లేదు హక్కు పత్రంలేదు. ఈ భూమి మా ముత్తాత జీవనధారంగా సాగు చేసిండు. తరువాత మా తాత మళ్ళీ మా నాన్న. ఇప్పుడు నేను చేస్తున్న. 1930 నుంచి ఊర్లో ఉండి వ్యవసాయం చేస్తున్నాం. పట్టాలకోసం చాలా ప్రయత్నం చేశాం. మొన్నటి పోడు సర్వేలో ఆ ఆధారాలు. మా గ్రామ పెద్దలు వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఈ సారి నాకు పత్రం వస్తుందని ఆశతో చూస్తున్న.
కుటికెల కిష్టయ్య రైతు, శెట్టిహడప్నూర్, సిర్పూర్ (యు )
ట్రైబల్ రైతులకు మాత్రమే హక్కు పత్రాలు
జిల్లాలోని పోడు సాగుచేస్తున్న 13 వేల మంది ట్రైబల్ రైతులకు మాత్రమే హక్కు పత్రాలు రెడీ చేస్తునాం. ఈ నెల 24 న పంపిణీకి అంత సిద్ధంగా ఉన్నాం. దరఖాస్తు చేసిన నాన్ ట్రైబల్ రైతుల విషయంలో ఇప్పటికీ మాకు ఎలాంటి ఆదేశాలు లేవు.
- మణెమ్మ, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ , ఆసిఫాబాద్
న్యాయం చేయండి రాజకీయం చేయద్దు
పోడు సమస్య పరిష్కరించాలని పోరాడుతూనే ఉన్నం . చేస్తామంటుండ్రు చేస్తలేరు. హక్కు పత్రాలకు తగిన ప్రూఫ్ లు కూడా ఈ సారి అందించాం. నాన్ ట్రైబల్స్ ను ఓట్ల కోసం అనేక పార్టీలు వాడుకుంటున్నాయి. మా కులాలతో రాజకీయం చేయకండి. చట్టం ప్రకారం న్యాయం చేసి ఆదుకోవాలి.
సుద్దాల శ్రీనివాస్ షెడ్యూల్ కులాల జేఏసీ కుమ్రం భీం జిల్లా అధ్యక్షుడు