
- డెభ్బై ఏండ్లుగా సాగు చేసుకుంటున్నం..
- అప్లికేషన్లు తీసుకుని అన్యాయం చేసిండ్రు!
- ఆఫీసర్లు లెక్కలోకి తీసుకోలేదంటున్న రైతులు
- అన్నీ స్కీములు నష్టపోతున్నామని ఆవేదన
మెదక్, వెలుగు : ఏండ్లుగా సాగుతున్న పోడు భూముల సమస్యను పరిష్కరించామని గొప్పగా చెబుతున్న ప్రభుత్వం అన్ని చోట్ల అర్హులైన రైతులకు పోడు హక్కుపత్రాలను అందించలేదు. వేలాది మంది రైతులు అప్లికేషన్లు పెట్టుకుంటే వందల మందికి మాత్రమే హక్కు పత్రాలిచ్చారు. ఫారెస్ట్ఆఫీసర్లు పోడు పట్టాల కోసం కొన్ని గ్రామాలనే సెలెక్ట్ చేశారు. పోడు భూములు సాగులో ఉన్నా కొన్ని గ్రామాలను లెక్కలోకి తీసుకోలేదు. దీంతో ఆయా చోట్ల దశాబ్దాలుగా పోడు భూములు సాగు చేసుకుంటున్న పోడు రైతులకు హక్కు పత్రాలు దక్కలేదు.
మెదక్జిల్లాలోని చాలా మండలాల్లో పోడు భూములు సాగవుతున్నాయి. ప్రభుత్వం పట్టాలిస్తామని చెప్పడంతో 4,105 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. వీరిలో 1,061 మంది గిరిజనులు, 2,654 మంది గిరిజనేతరులు ఉన్నారు. కాగా ఆఫీసర్లు గిరిజనుల్లో 610 మందిని అర్హులుగా గుర్తించి వారు సాగు చేసుకుంటున్న 525 ఎకరాలకు పోడు హక్కు పత్రాలను అందించారు.
ఏడు దశాబ్దాలుగా సాగు చేస్తున్నా...
తాము దాదాపు70 ఏండ్లుగా పోడు భూములు సాగు చేసుకుంటున్నా తమకు హక్కు పత్రాలను ఇవ్వకపోడంపై మాసాయిపేట మండలం నడిమితండాకు చెందిన గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెట్ల తిమ్మాయిపల్లి గ్రామ శివారులోని సర్వే నెంబర్158, 248, 313లోని పోడు భూమిని దాదాపు 200 మంది సాగు చేస్తున్నట్టు నడిమితండా గిరిజనులు తెలిపారు. తాము సాగులో ఉన్న భూములకు గతంలో రెవెన్యూ పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారని వాటి ఆధారంగా బ్యాంక్‌లో క్రాప్ లోన్ తీసుకున్నామని, బోర్లు తవ్వుకుని, కరెంట్ కనెక్షన్లు తీసుకుని పంటలు పండించుకుంటున్నామని వారు వివరించారు.
కాగా భూప్రక్షాళన తరువాత తమకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు రాలేదని పేర్కొన్నారు. దీంతో తాము క్రాప్ లోన్లు తీసుకోలేకపోతున్నామని, రైతుబంధు, రైతు బీమా వంటి స్కీంలు తమకు వర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్సీ చెంతకు పోడు సమస్య..
హవేలీ ఘన్పూర్ మండలం వాడి పంచాయతీ పరిధిలోని దూప్ సింగ్ తండావాసులు తమకు పోడు పట్టాలిప్పించాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డిని మూడు రోజుల క్రితం కలిసి మొరపెట్టుకున్నారు. తాము చాలా ఏండ్లుగా పోడు భూములు సాగు చేసుకుంటున్నా ఆఫీసర్లు రికార్డుల్లోకి ఎక్కించలేదని చెబుతున్నారు. దీని వల్ల తమకు అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఎమ్మెల్సీ కలెక్టర్ తో మాట్లాడి అర్హులైన రైతులకు పోడు పట్టాలిప్పిస్తామని వారికి హామీ ఇచ్చారు.
సెకండ్ఫేస్లోనైనా ఇవ్వాలి..
ఇటీవల నర్సాపూర్ లో జరిగిన పోడు పట్టాల పంపిణీ కార్యక్రమంలో మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి పోడు భూముల సమస్యను ప్రస్తావించారు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో పోడు రైతుల సమస్య ఉందని తెలిపారు. ఫారెస్ట్, రెవెన్యూ ఆఫీసర్లు సర్వే చేసి ఆయా గ్రామాలు, తండాల పరిధిలో అర్హులైన రైతులకు రెండో విడతలో పోడు పట్టాల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు.
మాకు పోడు పట్టాలియ్యాలే...
నాకు మూడెకరాల పొలం ఉంది. మా తాత, తండ్రుల కాలం నుంచి ఆ భూమి సాగు చేస్తున్నం. బోరు వేసుకుని రెండు పంటలు పండిస్తున్నం. మా తండా కొత్తగా జీపీ అయ్యిందని మాకు పోడు పట్టాల కోసం అప్లికేషన్ పెట్టుకునే ఛాన్స్ ఇయ్యలేదు. మేము కూడా పోడు రైతులమే కాబట్టి మాకు పట్టాలియ్యాలే.
- బర్మావత్ శ్రీనివాస్, రైతు, నడిమితండా
అన్నీ లాస్ అయితున్నం..
మాకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. అండ్ల వానాకాలం, యాసంగిల పంటలు పండిస్తున్నం. కానీ మాకు సర్కార్ నుంచి వచ్చే రైతు బంధు, రైతు బీమా, బ్యాంక్క్రాప్ లోన్ఏమి వస్తలేవు. పట్టా పాస్‌బుక్ లేక అన్నీ లాస్ అయితున్నం. ఇప్పటికైనా కేసీఆర్సర్కార్మాకు న్యాయం చేయాలే.
- మావోత్కాశీరాం, రైతు, నడిమితండా