- గడువులేని కమిటీలతో కాలయాపనే తప్ప లాభం లేదంటున్న గిరిజనులు
- 3.4 లక్షల అప్లికేషన్లు తీసుకొని ఇప్పటికి 9 నెలలు
- ఏడాది క్రితం కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు
- ఉన్నతాధికారుల పర్యటనలతో హడావిడి
- కొత్త జీవోలోనూ విధివిధానాలపై నో క్లారిటీ
- జిల్లా సమన్వయ కమిటీల పేరుతో మరోసారి సాగదీస్తున్న సర్కారు
ఖమ్మం : పోడు భూములకు పట్టాలొస్తాయని కొద్దినెలలుగా ఎదురుచూస్తున్న అడవి బిడ్డలకు సర్కారు మరో షాక్ ఇచ్చింది. 9 నెలల క్రితం 3.4 లక్షల మంది రైతుల నుంచి అప్లికేషన్లు తీసుకొని ఇన్నాళ్లూ పెండింగ్పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం, తీరా ఇప్పుడు శాఖల మధ్య సమన్వయం కోసం జిల్లాలవారీగా కో ఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేయాలంటూ జీవో ఆర్.టీ. నెం. 140 రిలీజ్ చేసింది. జిల్లా ఇన్చార్జి మంత్రి చైర్‌పర్సన్‌గా, జిల్లా కలెక్టర్కన్వీనర్గా ఉండే ఈ కమిటీలో ఏ శాఖ నుంచి ఎవరెవరు ఉండాలో సూచించిందే తప్ప తాజా జీవోలోనూ పోడు భూముల స్క్రూటినీకి సంబంధించిన విధివిధానాలపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు పోడు ఇష్యూను సాగదీసేందుకే జిల్లా కమిటీల పేరుతో సర్కారు మరో కొత్త ఎత్తు వేసిందని గిరిజనులు, గిరిజన సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికీ స్క్రూటినీ చేయలే..
తెలంగాణలో ప్రధానంగా ఆదిలాబాద్, కుమ్రం భీం-ఆసిఫాబాద్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నాగర్‌కర్నూల్ సహా 24 జిల్లాల్లోని 10 లక్షలకుపైగా ఎకరాల్లో పోడు భూముల సమస్య ఉంది. తెలంగాణలో రెండోవిడత ఎన్నికల ప్రచారంలో భాగంగా అవసరమైతే కూర్చేసుకొని కూర్చొని మరీ పోడు రైతులకు పట్టాలు ఇస్తామని నవంబర్23, 2018న మహబూబాబాద్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ వాగ్దానం చేశారు. ఈ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత కూడా ఏళ్ల తరబడి ఆలస్యం చేసిన రాష్ట్ర సర్కారు, చివరకు ఏడాది క్రితం మంత్రి సత్యవతి రాథోడ్ చైర్ పర్సన్‌గా, మంత్రులు పువ్వాడ అజయ్, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి సభ్యులుగా కేబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఆయా జిల్లాల్లో రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు పర్యటించి ఫీల్డ్ లెవల్ లో పోడు భూముల పరిస్థితిని తెలుసుకున్నారు. గతేడాది నవంబర్8 నుంచి నెల రోజులపాటు పోడు సాగుదారుల నుంచి అప్లికేషన్లు తీసుకున్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం సహా 24 జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు పైగా పోడు భూముల సమస్య ఉండగా, 12 లక్షల ఎకరాల భూములను క్లెయిమ్ చేస్తూ 3.4 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. అప్పటి నుంచి వాటి స్క్రూటినీ జరుగుతోందని కొన్నిసార్లు, అప్లికేషన్లను ఆన్ లైన్ చేస్తున్నామని ఇంకొన్నిసార్లు అధికారులు ఆఫ్ ది రికార్డు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయినా ప్రభుత్వం నుంచి అప్లికేషన్ల ప్రాసెస్ కు సంబంధించిన స్పష్టమైన విధివిధానాలు రాకపోవడంతో పట్టాల ఇష్యూ పెండింగ్ లోనే ఉంది.
కొత్తజీవోలోనూ గైడ్‌లైన్స్‌పై క్లారిటీ లేదు
ప్రభుత్వం తాజాగా ఇచ్చిన జీవోలోనూ ఏ ప్రాతిపదికన పట్టాలు ఇవ్వాలనేదానిపై స్పష్టత లేదని గిరిజన సంఘాల నేతలు అంటున్నారు. కొత్త జీవోలో స్క్రూటినీకి సంబంధించిన విధివిధానాలే లేవని చెప్తున్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న పోడుభూముల జోలికి పోకుండా ఫారెస్ట్ ఆఫీసర్లకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, 2006 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేస్తామని ఎక్కడా చెప్పని విషయాన్ని తప్పుపడ్తున్నారు. అలాగే తీసుకున్న దరఖాస్తులను ఎప్పటిలోగా పరిష్కరిస్తారో చెప్పలేదని అభిప్రాయపడ్తున్నారు. జిల్లాలవారీగా ఇన్చార్జి మంత్రి చైర్ పర్సన్ గా, జిల్లా కలెక్టర్ కన్వీనర్ గా కేవలం కమిటీలో ఎస్పీ/ పోలీస్ కమిషనర్, ఐటీడీఏ పీవో, అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ), అడిషనల్కలెక్టర్(లోకల్ బాడీస్), డీఎఫ్ఓ, డీఆర్డీఓ, డీటీడీఓ సభ్యులుగా, ఆయా జిల్లాల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్ పర్సన్ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారని చెప్పడం అంటే మీటింగులతో కాలయాపన చేసేందుకే తప్ప మరోటి కాదని విమర్శిస్తున్నారు. ఇలా కమిటీల పేరుతో సాగదీయకుండా వెంటనే పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
3 నెలల్లోపు క్లియర్ చేయాలి
పోడు భూములకు ఈ అసెంబ్లీ సమావేశాల్లోపే పరిష్కారం చూపిస్తామన్న ప్రభుత్వం ఊరించి, ఉసూరుమనిపించింది. విధానపరమైన స్పష్టత లేకుండా, కాలపరిమితి లేకుండా ఇచ్చిన జీవో వల్ల ప్రయోజనం లేదు. ప్రస్తుత సాగుదారుల జోలికి అధికారులు వెళ్లకుండా ప్రభుత్వం ఆర్డర్స్ ఇవ్వాలి. మూడు నెలల్లోపు దరఖాస్తులను క్లియర్ చేయాలి. పోడుదారులపై కేసులు ఎత్తివేయాలి. కమిటీలో గ్రామ అటవీ హక్కుల కమిటీలు, రాజకీయ పక్షాలకు భాగస్వామ్యం కల్పించాలి.
-పోటు రంగారావు, రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా