
- జేసీబీలను అడ్డుకున్న పోడు సాగు రైతులు
- ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు
జయశంకర్ భూపాలపల్లి/ భూపాలపల్లి రూరల్, వెలుగు: భూపాలపల్లి జిల్లాలో ఫారెస్ట్ ఆఫీసర్లకు.. రైతులకు మధ్య పోడు పంచాయితీ జరిగింది. ఘటనపై ఇరుపక్షాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. వివరాల్లోకి వెళ్తే.. భూపాలపల్లి మండలం ఆజంనగర్ పరిధిలోని 16 ఎకరాల ఫారెస్ట్ భూమిలో 11 మంది రైతులు సుమారు 40 ఏండ్లుగా వారసత్వంగా పోడు సాగు చేసుకుంటున్నారు. గురువారం ఆజంనగర్, దూదేకులపల్లి, భూపాలపల్లి, చింతకాని రేంజ్ పరిధిలోని సుమారు150 మంది అటవీ అధికారులు, సిబ్బంది మూడు జేసీబీలో భూముల వద్దకు వెళ్లి ట్రెంచ్ కొట్టేందుకు యత్నించారు. సాగు చేస్తున్న రైతులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పలువురు పోడు రైతులకు గాయాలు కాగా.. మహిళలు పట్టేం శారద, శ్రీరాముల జయ స్పృహ తప్పిపడిపోయారు. బాధితులను ఆస్పత్రికి తరలించారు.
పోడు రైతు పొదిల శ్రీను, కొండి శారద, పొదిల శ్రీను, పొదిల రజితను ఫారెస్ట్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. కాగా.. గతేడాది పత్తి పంట వేసే సమయంలో ఎఫ్ఆర్ వో ఉషా అడ్డుకోగా రూ.5 లక్షలు లంచం ఇచ్చామని, దీంతో ఆ ఏడాది సాగు చేసుకున్నామని రైతులు పేర్కొన్నారు. ఇప్పుడు రూ.2 లక్షలు ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేయగా ఇచ్చుకోలేమని మొర పెట్టుకోగా ఎఫ్ఆర్ఓ ఉష ఫారెస్ట్ సిబ్బందితో వచ్చి దాడి చేసినట్లు బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత ఘటనపై ఫారెస్ట్ ఆఫీసర్లు, పోడు రైతులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేశారు. విచారణ చేస్తున్నట్టు భూపాలపల్లి పోలీసులు తెలిపారు.
దాడిని ఖండించిన ఎమ్మెల్యే
పోడు రైతులపై ఫారెస్ట్ సిబ్బంది దాడి సమాచారం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మీడియాతో మాట్లాడుతూ.. పోడు రైతులపై ఫారెస్ట్ సిబ్బంది దాడి ఖండిస్తున్నట్లు చెప్పారు. రైతులని స్పృహ తప్పేలా కొట్టడమేంటని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగొద్దని హెచ్చరించారు. కొత్తగా పోడు చేయకుండా ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు.