- 11,341 అప్లికేషన్లకు 207 మాత్రమే ఓకే చేసిన ఎస్‌డీఎల్‌సీ
- అనేక పెంటలు, గూడాల్లో ఇంకా పూర్తికాని సర్వే
- విధి లేక ‘రీలొకేషన్’ పథకం ఎంచుకుంటున్న గిరిజనేతరులు
- పుట్టిన ఊరు విడిచి బతకలేమంటున్న గిరిజనులు
నాగర్ కర్నూల్, వెలుగు: తరతరాలుగా అడవినే నమ్ముకొని బతుకుతున్న చెంచులు, గిరిజనులు, గిరిజనేతరుల కుటుంబాల్లో పోడు సర్వే చిచ్చుపెడుతోంది. పోడుపట్టాల కోసం నాగర్ కర్నూల్ జిల్లాలో 11,341 మంది అప్లికేషన్లు పెట్టుకుంటే ఇప్పటి వరకు అచ్చంపేట పరిధిలోని 207 అప్లికేషన్లను మాత్రమే సబ్ డివిజన్ లెవల్ కమిటీ ఓకే చేయడం వారి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. మిగతా డివిజన్లలో ఇంకా సర్వే కొనసాగుతున్నా అర్హులు వెయ్యి మంది కూడా దాటే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో కొన్ని పెంటలు, గూడాల్లోని గిరిజనేతరులు రీలొకేషన్ పథకానికి అప్లై చేసుకుంటున్నారు. పోడు పట్టాలు వచ్చే అవకాశం లేదని, విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కూడా సరిగ్గా లేకపోవడంతో విధిలేక ఈ పథకాన్ని ఎంచుకుంటున్నామని వాళ్లు చెబుతున్నారు.
సబ్ డివిజన్ లెవల్‌లో పెండింగ్..!
పోడు భూముల పట్టాల కోసం అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, నాగర్ కర్నూల్ రెవెన్యూ డివిజన్ల పరిధిలో దాదాపు 37,482 వేల ఎకరాల కోసం అన్‌లైన్‌లో దాదాపు 11, 341 అప్లికేషన్స్ వచ్చాయి. ఇందులో గిరిజనేతరుల అప్లికేషన్లే 50 శాతానికి పైగా ఉన్నాయి. ఈ అప్లికేషన్లకు సంబంధించి రెవెన్యూ, ఫారెస్ట్ ఆఫీసర్లు జాయింట్ సర్వే చేసి గ్రామకమిటీల పరిశీలనలకు పంపించాలి. గ్రామ కమిటీలో ఉండే బీట్, రేంజ్ ఆఫీసర్లు, కార్యదర్శి, సర్పంచ్.. గ్రామసభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేయాలి.
అనంతరం డివిజన్ లెవల్ కమిటీకి రికమండ్ చేయాల్సి ఉంటుంది. అచ్చంపేట డివిజన్‌లో దాదాపు 22,842 ఎకరాలకు 6,988 అప్లికేషన్లు రాగా ఆర్డీవో చైర్మన్‌గా ఉండే ఎస్‌డీఎల్‌సీ(సబ్ డివిజన్ లెవల్ కమిటీ) 207 అప్లికేషన్లను ఒకే చేసి డిస్ట్రిక్ట్ కమిటీకి రికమండ్ చేసింది. కొల్లాపూర్ డివిజన్‌లో 13,675 ఎకరాలకు 4,373 అప్లికేషన్స్ రాగా.. ఇంకా కొన్ని గ్రామాల్లో సర్వే కొనసాగుతోంది. నాగర్ కర్నూల్, కల్వకుర్తి డివిజన్లలోను ఇదే పరిస్థితి ఉంది.
తెరమీదికి రీలొకేషన్ స్కీమ్
ప్రభుత్వం పోడు భూములకు పట్టాలిస్తామని ఓవైపు ప్రకటనలు చేస్తూనే.. మరోవైపు చెంచు పెంటలు, గిరిజన తండాలను మైదాన ప్రాంతాలకు తరలించేందుకు రీలొకేషన్ స్కీమ్ తెరమీదికి తెచ్చింది. కేంద్రం ఎన్టీసీఏ(నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) ద్వారా అందించే ఈ స్కీమ్ కింద 18 ఏండ్లు నిండిన వారిని కుటుంబంగా పరిగణించి రూ.15 లక్షల పరిహారంగా అందిస్తారు. లేదా ఇదే డబ్బులతో పునరావాస ఏరియాలో ఇల్లు, మౌలిక వసతులు, ల్యాండ్ అభివృద్ధి చేసి ఇస్తారు. స్కీం పాతదే అయినా అధికారులు కొత్తగా గ్రామసభలు పెట్టి స్థానికుల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలోని వటవర్లపల్లి, సార్లపల్లి,
40 ఏండ్లుగా ఉంటున్నా హక్కు లేదంట 40 ఏళ్లుగా ఇక్కడ భూములను సాగు చేసుకుంటూ బతుకుతున్నం. కొన్నాళ్లుగా భూములు సాగు చేయొద్దని ఫారెస్టోళ్లు అడ్డుకుంటున్నరు. భూమి లేకుంటే బతికేదెట్ల. అందుకే ఈడికెళ్లి పోనీకె కలెక్టర్ కు దరఖాస్తు పెట్టుకున్నం.
–జగన్ మోహన్(బీసీ) , వటవర్లపల్లి
కుడిచింతలబైలు, కొల్లం పెంటలో ఇప్పటికే గ్రామసభలు నిర్వహించారు. బలవంతంగా ఎవరినీ తరలించమని అంటూనే కరెంట్, వాటర్, తదితర మౌలిక వసతుల విషయంలో ఇబ్బందులు పెడుతున్నట్లు తెలుస్తోంది.
అన్యాయం చేస్తున్రు
పోడు పట్టాల కోసం వేలల్లో అప్లికేషన్లు పెడితే వందల్లో ఓకే చేయడం అన్యాయం. గ్రామ కమిటీల దగ్గరి నుంచి డిస్ట్రిక్ లెవల్ దాకా తొలగించుకుంటూ పోతున్నరు. ఏండ్ల నుంచి సాగు చేస్తున్న భూమి ఫారెస్టోళ్లు గుంజుకుంటే ఎట్ల బతకాలి.
– గోబ్రానాయక్, చిట్లంకుంట తండా