కోనరావుపేట,వెలుగు : పోడు భూముల సర్వేను పారదర్శకంగా చేపట్టాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. గురువారం కోనరావుపేట మండలం భూక్యా తండాలో జరుగుతున్న పోడు భూముల సర్వేను అడిషనల్కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి తనిఖీ చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వే చేపట్టాలని సూచించారు. పోడు చేస్తున్న భూమిని కాకుండా కొత్తగా అటవీ భూమి ఆక్రమణ చేపట్టవద్దని సిబ్బందికి తెలిపారు. ప్రభుత్వ స్పిరిట్ ను అర్థం చేసుకుంటూ రెవెన్యూ, ఫారెస్ట్ , వ్యవసాయ శాఖ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు పోడు భూములపై హక్కుల కల్పనకు ప్రాథమిక రిపోర్ట్ సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో 66 గ్రామాలకు చెందిన ప్రజల నుంచి 14,031 ఎకరాలపై హక్కులు కల్పించాల్సిందిగా కోరుతూ 5,940 క్లైమ్ లు వచ్చాయని తెలిపారు. రెవెన్యూ, అటవీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, పంచాయతీ రాజ్ అధికారులతో కూడిన బృందాలను ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయిలో సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. అటవీని సంరక్షిస్తూనే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులైన చిన్న సన్న కారు రైతులకు పోడు భూములపై హక్కులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్‌తెలిపారు. కార్యక్రమంలో ఆయన వెంట జడ్పీ సీఈఓ గౌతంరెడ్డి, ఎంపీడీవో రామకృష్ణ ఉన్నారు.
కేబుల్ బ్రిడ్జి పనుల్లో వేగం పెంచాలి
కరీంనగర్ టౌన్, వెలుగు: కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనుల్లో వేగం పెంచాలని కరీంనగర్ కలెక్టర్ కర్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆర్అండ్ బీ అధికారులతో కలిసి బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పనులను సకాలంలో పూర్తి చేయడానికి ఎక్కువ మంది కూలీలను నియమించాలన్నారు. ఆయన వెంట ఆర్అండ్ బీ ఈఈ సాంబశివరావు, తహసీల్దార్ సుధాకర్ ఉన్నారు.
భూ సేకరణ త్వరగా చేయించాలి
గోదావరిఖని, వెలుగు: సింగరేణి రామగుం డం రీజియన్ పరిధిలో వివిధ బొగ్గు గనుల కోసం భూ సేకరణ, అనుమతులకు సంబంధించిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంస్థ డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్(ఆపరేషన్స్), ఎన్.బలరాం(ప్రాజెక్ట్స్, ప్లానింగ్) పెద్దపల్లి కలెక్టర్ సంగీతను కోరారు. గురువారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీస్‌లో వారిని కలిసి పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నర్సింహమూర్తి, ఎస్‌ఓటు డైరెక్టర్ సుధాకర్, ఆర్జీ 1 ఇన్చార్జి జీఎం బి.సైదులు, ఆర్జీ 2 ఏరియా జీఎం ఎ.మనోహర్, ఆర్జీ 3 ఏరియా జీఎం టీవీ రావు, ఎస్టేట్ ఆఫీసర్ బాల సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
భారీగా సీఎంఆర్ ధాన్యం మాయం?
పెద్దపల్లి, వెలుగు: జిల్లాలోని సబ్బితం గ్రామానికి చెందిన ఓ రైస్ మిల్లు నుంచి సీఎంఆర్ వడ్లు మాయమైనట్లు తెలుస్తోంది. సాధారణ తనిఖీల్లో భాగంగా రెండు రోజుల క్రితం సివిల్ సప్లయ్ అధికారులు సబ్బితానికి చెందిన రైస్ మిల్లును తనిఖీ చేశారు. ఈ క్రమంలో మిల్లుకు కేటాయించిన ధాన్యంలో భారీ తేడాలున్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. దీనిపై మిల్లు యజమానిని వివరణ కోరగా సరైన సమాధానం చెప్పలేదని తెలిసింది. తనిఖీ చేసిన అధికారులు పూర్తి వివరాలతో ఉన్నతాధికారులకు రిపోర్టు చేసినట్లు సమాచారం.
అనుమతిలేని వెంచర్లలో ప్లాట్లు కొనొద్దు
వేములవాడ, వెలుగు: మున్సిపల్ పరిధిలో అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు కొనొద్దని మున్సిపల్ కమిషనర్ శ్యాం సుందర్ రావు తెలిపారు. గురువారం వేములవాడ మున్సిపల్ పరిధి నాంపల్లి గ్రామ పరిధిలోని పలు వెంచర్లపై దాడిచేసి హద్దు రాళ్లను తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కొన్ని వెంచర్లకు అనుమతి లేదని, ప్రజలు లక్షలు పెట్టి ప్లాట్లు కొంటే ఇబ్బందులు పడతారన్నారు. ఇంటి నిర్మాణం కోసం అనుమతి రాదని తెలిపారు. రియల్ఎస్టేట్ వ్యాపారులు వెంచర్ అప్రూవల్ లే ఔట్ ద్వారా అనుమతి తీసుకోని ప్లాట్స్విక్రయించాలన్నారు. ఆయన వెంట టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ శ్రీధర్, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
దళితులు సీఎంకు రుణపడి ఉంటారు
కరీంనగర్ సిటీ, వెలుగు: దళిత బంధు పథకంతో రాష్ట్రంలోని దళితులంతా సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటారని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. దళితబంధు పథకంలో భాగంగా గురువారం హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన పెరక హేమలత, గన్నారపు అరుణాదేవి రూ.20 లక్షలకు తీసుకున్న ఆర్టీసీ బస్సును కరీంనగర్ వన్ డిపో ముందు కలెక్టర్ కర్ణన్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హుజూరాబాద్ జోన్లో 18 వేల మందికి దళిత బంధు అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈఓ ప్రియాంక, ఆర్టీసీ ఆర్ఎం ఖుస్రో షా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
దళితులు సీఎంకు రుణపడి ఉంటారు
కరీంనగర్ సిటీ, వెలుగు: దళిత బంధు పథకంతో రాష్ట్రంలోని దళితులంతా సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటారని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. దళితబంధు పథకంలో భాగంగా గురువారం హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన పెరక హేమలత, గన్నారపు అరుణాదేవి రూ.20 లక్షలకు తీసుకున్న ఆర్టీసీ బస్సును కరీంనగర్ వన్ డిపో ముందు కలెక్టర్ కర్ణన్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హుజూరాబాద్ జోన్లో 18 వేల మందికి దళిత బంధు అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈఓ ప్రియాంక, ఆర్టీసీ ఆర్ఎం ఖుస్రో షా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం
రక్షించిన పోలీసులు
కరీంనగర్ రూరల్, వెలుగు: మండలంలోని దుర్షేడ్ గ్రామానికి చెందిన పోరండ్ల రమ భర్త వేధింపులు తాళలేక తన ఇద్దరు పిల్లలతో గురువారం ఆత్మహత్యాయత్నం చేయగా కరీంనగర్ రూరల్ పోలీసులు రక్షించారు. వారి కథనం ప్రకారం.. దుర్షేడ్ గ్రామానికి చెందిన రమకు, కొత్తపల్లి పట్టణానికి చెందిన మహేశ్‌తో సుమారు 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కూలి పనులు చేసుకునే మహేశ్ మద్యానికి బానిసై భార్య రమను నిత్యం వేధించేవాడు. రెండు మూడుసార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీలు కూడా జరిగాయి. అనంతరం రమ్య దుర్షేడ్‌లో భర్త, పిల్లలతో కలిసి అద్దెకు ఉంటోంది. పంచాయతీ జరిగినా మహేశ్‌లో మార్పు రాకపోవడం, నిత్యం వేధిస్తుండటంతో తట్టుకోలేక గురువారం ఇరుకుల్ల బ్రిడ్జిపై ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. దీంతో దుర్షేడ్ ఉపసర్పంచ్ సంపత్ రావు గమనించి సీఐ విజ్ఞాన్ రావుకి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని మహిళను రక్షించారు. అనంతరం సీఐ రమకు, మహేశ్‌కు కౌన్సిలింగ్ ఇచ్చారు.
దేవాలయ నిర్మాణానికి కార్మికుల విరాళం
ముత్తారం, వెలుగు: మండలంలోని ఖమ్మంపల్లిలో నిర్మిస్తున్న ప్రసన్న సీతారామాంజనేయ దేవాలయానికి గ్రామానికి చెందిన రిటైర్డ్ సింగరేణి కార్మికులు గురువారం విరాళాలు అందించారు. గజస్తంభం నిర్మాణానికి మార్త రాజేశం, దేవాలయానికి కటకం రాజలింగు, కట్ల రాయమల్లు, ఇటుకల మల్లయ్య, అల్లం కొమురయ్య, తూర్పు రాజయ్య, రంగు లింగన్న, వేల్పుల మల్లికార్జున్, కాటం రాజేశం, కట్ల రాజేశం రూ.51 వేల చొప్పున, బరపటి మల్లయ్య రూ.31 వేయి చొప్పున విరాళాలను సర్పంచ్ సముద్రాల రమేశ్ఆధ్వర్యంలో దేవాలయ కమిటీకి అందించారు. విరాళాలు అందించిన వారికి సర్పంచ్, కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
పర్యాటక ప్రాంతంగా లింగంపేట చెరువు
జగిత్యాల, వెలుగు: పట్టణంలోని లింగంపేట చెరువును పర్యాటక స్థలంగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి అన్నారు. చెరువు వద్ద టీయూఎఫ్ఐడీసీ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సహకారంతో జగిత్యాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా తీర్చిదిద్దుతామన్నారు. ట్రీ పార్కు పనులు వేగవంతం చేయాలని, బతుకమ్మ ఐడల్ ఏర్పాటు చేశామని, చెరువు వద్దకు వచ్చే పిల్లలకోసం ఆట వస్తువులు ఏర్పాటు చేయాలని, వాకర్స్ కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసేవిధంగా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట కమిషనర్ గంగాధర్, స్థానిక కౌన్సిలర్ ఒద్ది శ్రీలత, జుంబర్తి రాజు కుమార్, అంతర్గం సర్పంచ్ నారాయణ, డీఈ రాజేశ్వర్ పాల్గొన్నారు.
ఎనిమిదేళ్లుగా జీతాలు పెంచలేదు
గోదావరిఖని, వెలుగు : ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో 26 వేల మంది సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెరగలేదని ఐఎన్‌టీయూసీ సెక్రెటరీ జనరల్ బి.జనక్ ప్రసాద్ అన్నారు. గురువారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం, మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేల జీతాలు పెంచుకుంటున్నారని కానీ సింగరేణికి లాభాలను తీసుకువచ్చే కార్మికులను మరిచిపోతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం 69 జీఓను విడుదల చేసి గెజిట్ ప్రచురించకపోవడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. సీఎం ప్రకటించిన విధంగా సింగరేణిలో కొత్త బొగ్గు గనులు రాలేదని, నివసించేందుకు క్వార్టర్లు నిర్మించలేదని అన్నారు. వెంటనే జెన్కో, ట్రాన్స్ కో చెల్లించాల్సిన బకాయిలను సింగరేణికి ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. మీటింగ్‌లో లీడర్లు ఎస్.నర్సింహరెడ్డి, వంగ లక్ష్మీపతి గౌడ్, పి.ధర్మపురి, రాజమౌళి, కాంపెల్లి సమ్మయ్య, సదానందం, జగన్ పాల్గొన్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
జమ్మికుంట, వెలుగు : మండలంలోని వెంకటేశ్వర్లపల్లి శివారు ఒజ్జపల్లిలోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 320 క్వింటాళ్ల రేషన్‌బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఓసీడీ ప్రభాకర్ గురువారం తెలిపారు. ఒజ్జపల్లి శివారులో హుజూరాబాద్, జమ్మికుంట రైస్ మిల్లులు అధికంగా ఉండడంతో కొందరు సిండికేట్ గా మారి ప్రతీనెల ప్రభుత్వ గోదాంల నుంచి డీలర్లకు చేరకుండా ఇతర ప్రాంతాలకు బియ్యం అమ్ముకుంటున్నారని సమాచారం వచ్చినట్లు ప్రభాకర్పేర్కొన్నారు. బుధవారం అర్ధరాత్రి లారీలో వచ్చిన బియ్యాన్ని అన్ లోడ్ చేస్తుండగా దాడి చేసి 621 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ గోదాంలకు తరలించామన్నారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని, లారీని పోలీస్ స్టేషన్ కు తరలించామని ప్రభాకర్ పేర్కొన్నారు.
గోదావరిఖని: స్థానిక బాపూజీ నగర్‌లోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన సుమారు 60 క్వింటాళ్ల రేషన్‌బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్ సీఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుళ్లు మహేందర్, మల్లేశ్ గురువారం స్వాధీనం చేసుకున్నారు. రేషన్ దుకాణంలో కాకుండా మరొకరి ఇంట్లో బియ్యం ఉంచారన్న సమాచారంతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. బియ్యం ఉంచిన గదిని సీజ్ చేసినట్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్స్రవంతి తెలిపారు.
అక్రమ సంబంధం ఆరోపణలతో వివాహిత ఆత్మహత్య
కాల్వశ్రీరంపూర్,వెలుగు: అక్రమ సంబంధం ఆరోపణలతో పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ వివాహిత మృతి చెందిన ఘటన కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చీర్లంచ స్వప్న(30) గ్రామంలో ఎవరితో మాట్లాడినా అత్త లక్ష్మి, బావ రాజు, తోటి కోడలు స్వరూప అక్రమ సంబంధం అంటగట్టి ఇష్టం వచ్చినట్లు తిట్టేవారు. దీంతో స్వప్న మానసిక క్షోభకు గురై అక్టోబర్10న ఇంట్లో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు స్వప్నను కరీంనగర్ కు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి చనిపోయింది. మృతురాలి భర్త లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు లక్ష్మి, స్వరూప, రాజుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజవర్ధన్ తెలిపారు.