కేసీఆర్​ను ఓడించింది అహంకారమే : కవి అందెశ్రీ

కేసీఆర్​ను ఓడించింది అహంకారమే : కవి అందెశ్రీ
  • ఎల్లకాలం ఏలడానికి తెలంగాణ ఎవరి సొత్తు కాదు
  • కేసీఆర్​కు తెలంగాణ ఇవ్వనిదంటూ ఏదీ లేదు
  • ఆయన ఇచ్చింది మాత్రం రూ. 5లక్షల కోట్ల అప్పు
  • రెండుసార్లు అధికారం అనుభవించి.. వెళ్లేటప్పుడు జనానికి కృతజ్ఞతలన్నా చెప్పిండా?
  • తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరో తేలేదు.. ఎవరో ఇయ్యలేదు.. జనమే తెచ్చుకున్నరు
  • సేవకులమనే మాటను రేవంత్​ నిలబెట్టుకోవాలి.. ఉద్యమ ఆశయాలను నెరవేర్చాలని సూచన

ప్రజలు వేసిన ఓట్ల బిచ్చంతో పదేండ్లు పాలన సాగించిన కేసీఆర్​.. మొన్న ఓడిపోయినంక కనీసం ఆ జనం ముందుకు వచ్చి కృతజ్ఞతలన్నా చెప్పిండా? ఇదా సంస్కారం. ఇదా నాయకుడి తీరు? తెలంగాణకు అదిచ్చినం.. ఇది తెచ్చినం అని అన్నరు. మీరు ఇచ్చిందేముందు.. మీ పాలనే ప్రజలు వేసిన బిచ్చం.  కొడుకును సీఎం చేస్త..  దేశంలో చక్రం తిప్పుతా అనుకున్నడు.. ఇది ప్రజాస్వామ్యం. ఎవరన్నా వస్తరు.. ఎవరన్నా ఏలుతరు.  ఎవరొచ్చినా నా తెలంగాణ తల మీద పెట్టుకుంటది. తలబిరుసుతనం ఉంటే.. దింపేస్తది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే అందుకు ఉదాహరణ. కేసీఆర్​ ఓటమి ఎవరికైనా హెచ్చరికే.

హైదరాబాద్, వెలుగు:  కేసీఆర్​ ఓటమికి కారణం కేసీఆరేనని, ఆయన అహంకారమేనని ప్రముఖ కవి అందెశ్రీ అన్నారు. రాష్ట్రమొస్తే కాపలా కుక్కలెక్క ఉంటానని చెప్పి.. రాష్ట్రమొచ్చినంక అధికారం చేపట్టి ప్రజలను, నేతలను కుక్కలుగా చుట్టూ తిప్పుకున్నారని మండిపడ్డారు. తాను చెప్పిందే శాసనం, తాను చెప్పిందే మంత్రం అనే తీరుగా కేసీఆర్​ వ్యవహరించారని, ఆర్థిక పరిపుష్టి కలిగిన తెలంగాణను రూ. 5లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని తెలిపారు.  

అన్ని రంగాల్లో దోపిడీకి తెగబడ్డారని, భూములను చెరబట్టి కోట్లకు కోట్లు కూడబెట్టుకున్నారని ఫైర్​ అయ్యారు. తాము ‘‘పాలకులం కాదు.. ప్రజల సేవకులమని చెప్పిన కొత్త సీఎం రేవంత్​రెడ్డి ఆ మాటను నిలబెట్టుకోవాలి. అట్ల నిలబెట్టుకుంటే జనం ఆయనను గుండెల్లో దాచుకుంటారు” అని అందెశ్రీ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎవరో తెస్తేనో.. ఎవరో ఇస్తేనో రాలేదని, అది తెలంగాణ ప్రజలు కొట్లాడి తెచ్చుకున్నదని పేర్కొన్నారు. శనివారం ‘వీ6’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అందెశ్రీ పలు అంశాలపై స్పందించారు.  

కేసీఆర్​ది భూములు మింగే భూతాల పాలన

సబ్బండవర్గాలు కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం తెలంగాణ అని అందెశ్రీ గుర్తుచేశారు. ‘‘అట్ల తెచ్చుకున్న రాష్ట్రంలో కేసీఆర్​ అన్నీ తానే అని చెప్పుకున్నడు. తాను చెప్పిందే శాసనం.. తాను చెప్పిందే మంత్రం అన్నట్లుగా పాలించిండు. నువ్వు చేసే క్రియలే నీకు శ్రతువులను, మిత్రులను తయారు చేస్తయంటడు చాణుక్యుడు. కేసీఆర్​ ఓటమికి కేసీఆర్​ క్రియలే కారణం. కేసీఆర్​ను తెలంగాణ ప్రజలు ఎప్పుడూ శత్రువులుగా చూడలేదు.. కానీ, ఆయన, ఆయన కుటుంబం మాత్రం జనాన్ని శత్రువులుగా చూసింది. శత్రు శేషం మంచిది కాదని జనం నమ్మిన్రు” అని పేర్కొన్నారు.

అధికారంలోకి రాకముందు ఒక మాట.. అధికారంలోకి వచ్చినంక మరోమాట కేసీఆర్​ది అని, అన్నిరంగాల్లో దోపిడీకి తెగబడ్డారని మండిపడ్డారు. భూములను మింగేసే భూతాల పాలనను కొనసాగించారని అన్నారు. ‘‘అధికారంలోకి రాకముందు ఏమీ లేనివాళ్లు.. పార్టీ ఆఫీసుకు కిరాయికట్టడానికి కూడా తిప్పలు పడ్డోళ్లకు కోట్లకు కోట్లు ఎట్లొచ్చినయ్​? వేల ఎకరాల భూములు ఎట్లొచ్చినయ్​? ఊరికో భవనం కట్టుకునే స్థాయికి ఎట్లెదిగిన్రు?  కేసీఆర్​ కుటుంబానికి తెలంగాణ ఇవ్వనిదంటూ లేదు.

కానీ, తెలంగాణకు మేం అదిచ్చినం ఇదిచ్చినం అని వాళ్లంటున్నరు. ఏమిచ్చిన్రు తెలంగాణకు మీరు? రూ. 5లక్షల కోట్ల అప్పా? ఇదేనా పదేండ్ల ప్రగతి? ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం, భూములను గుంజుకోవడం, జనాన్ని కలవకపోవడం, కూడబెట్టుకోవడం.. ఇదేనా మీ పాలన?” అని ఫైర్​ అయ్యారు. ట్రిగ్గర్​ లేని వెపన్​ తెలంగాణ ప్రజానీకం అని, ఆ వెపన్​ ఎప్పుడు పేలుతదో తెలియదని, ఎల్లకాలం ఏలడానికి తెలంగాణ ఎవరికీ సొత్తు కాదని, ఆ విషయం మరిచిపోయి పాలిస్తే ఫలితాలు మొన్నటి ఎన్నికల లెక్కనే ఉంటాయని అన్నారు.

అహంకారం, తలబిరుసుతనంతో  ​పాలించిండు. ఇది పోరాటాల గడ్డ.  అహంకారాన్ని, తలబిరుసుతనాన్ని సహించదు. కేసీఆర్​ను ఎవ్వరో ఓడగట్టలే ఆయన అహకారమే ఓడిగొట్టింది. వాళ్లను వాళ్లే ఓడగొట్టుకున్నరు’’ అని పేర్కొన్నారు. కేసీఆర్​ పాలనతో జరిగిన నష్టాలను,  జరగబోయే నష్టాలను ఎవరు పూడుస్తారని ఆయన ప్రశ్నించారు. 

‘జయ  జయహే తెలంగాణ’ గీతాన్ని అవమానించిండు

‘‘పాలకుల తప్పులపై మీరింతలా నిలదీస్తుంటరు.. మీకు భయమనేదే లేదా? అని కొందరు అడుగుతుంటే ఆశ్చర్యమేస్తుంది. బతికుండాలనుకునే వాడికి జీవితమంతా భయమే. ఏలాలని అనుకున్నోడికి వెన్నుపూస నిండా భయమే. శబ్ధమై పేలాలనుకున్నోడికి ఏం భయం. నాకెందుకు భయం? నా పాట జనం పాట. నా గొంతుక జనం గొంతుక” అని అందెశ్రీ అన్నారు. తాను రాసిన జయజయహే తెలంగాణ గీతాన్ని కేసీఆర్​ అవమానించారని మండిపడ్డారు. రాష్ట్ర గీతంగా ఆ పాట ఉంటుందన్న భ్రమలు తనకు ఎప్పుడూ లేవని అన్నారు. ‘‘బ్రిటీషోళ్లకు నిద్దురపట్టకుండా చేసిన వందేమాతర గీతం కూడా స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేండ్లయినా ఇప్పటికీ పార్లమెంట్​లో పాడాలా వద్దా అనే సందిగ్దత నెలకొన్నది.

వందేమాతర గీతాన్ని అవమానించిన ఈ దేశంలో.. జయజయహే తెలంగాణ గీతాన్ని కూడా కేసీఆర్ అవమానించిండు. కానీ  నా తెలంగాణ జాతి మాత్రం జయ జయహే తెలంగాణ గీతాన్ని గుండెల్లో పెట్టుకుంది. ఆ పాట తమ సొంతం అని జనం అనుకున్నరు కాబట్టే.. అది ప్రభాత గీతమైంది. కేసీఆర్​ రాజ్యానికి ఆ గీతం ఎందుకు నచ్చలేదో.. వాళ్లకే తెల్వాలి. పదేండ్ల కేసీఆర్​ పాలనలో రాష్ట్ర గీతంగా పెట్టుకోకపోయినా జై..  ఇప్పుడు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా జై జై. నాకు ఎలాంటి బాధ లేదు. తెలంగాణ ఉన్నన్నాళ్లు జనం గుండెల్లో ఆ గీతం ఉంటది. అదే పదివేలు” అని అందెశ్రీ తెలిపారు. ఉద్యమ టైమ్​లో కేసీఆర్​, తాము కలిసే ఉన్నప్పటికీ.. ఆయన అధికార పగ్గాలు చేపట్టాక ఆయన గుణం తెలిసి దూరం జరిగానని ఆయన చెప్పారు.

రాష్ట్రం ఏర్పడ్డాక  కేసీఆర్​ను నేనెందుకు వదులకున్నానంటే.. మర్మం తెలిసిన నాకు మనుషుల మనసుల్లోని మరకలు తెలియవా. అది తెలుసు కాబట్టే.. కేసీఆర్​ నీడన పోకుండా వైదొలిగిన. ఆయన గుణం తెలుసు కాబట్టే బయటకు వచ్చేసిన. ఏడేండ్లు మౌన ముద్రలో ఉన్న. సారూ.. నీ పాలన అదుపుతప్పుతుందని అప్పుడే చెప్పిన. మీ వెన్నుపూసలు పళ్లపళ్ల విరుగతయని చెప్పిన. కానీ, సారు వినలేదు. జనం గోస పట్టించుకోలేదు. పదేండ్లలో ఏనాడైనా జనాన్ని కలిసిండా? జనం గోస విన్నడా? కేసీఆర్ ను మోసి మోసి జనం విసిగిపోయిన్రు. ఓటర్ కోటర్ అయినంత వరకే ఈ లీడర్ల ఆటలు. ఓటర్ షూటర్ అయితే చుక్కలే” అని అన్నారు. 

ముగురమ్మలు

తెలంగాణ ఎవరో తెస్తేనో, ఎవరో ఇస్తేనో రాలేదని.. 1400 మంది ప్రాణ త్యాగం, సబ్బండవర్గాల పోరాట ఫలితంగా వచ్చిందని అందెశ్రీ తెలిపారు. ‘‘నాడు తెలంగాణ బిల్లు పాస్​ చేసేందుకు కాంగ్రెస్​కు మద్దతు సరిపోకపోతే బీజేపీ మద్దతిచ్చింది. పార్లమెంట్​లో సోనియమ్మ, సుష్మాస్వరాజ్, మీరాకుమార్​ అండగా నిలిచిన్రు. తెలంగాణ ఏర్పాటులో ఈ ముగ్గురమ్మల పాత్ర ఎనలేనిది” అని పేర్కొన్నారు. తన జయజయహే తెలంగాణ గీతానికి ముగురమ్మల మూలపుటమ్మ మహిషాసురమర్ధిని స్తోత్రం ‘జయజయహే మహిషాసురమర్దిని’నే ప్రేరణ అని, తెలంగాణ ఏర్పాటు వెనుక కూడా ముగురమ్మలు సోనియా, సుష్మ, మీరాకుమార్​ ఉన్నారని ఆయన తెలిపారు. 

వెళ్లిపోయేముందు జనానికి కృతజ్ఞతలన్నా చెప్పిండా?

పదేండ్లు అధికారం అనుభవించిన కేసీఆర్​.. రాజీనామా చేసి వెళ్లిపోతున్నప్పుడు కనీసం జనానికి కృతజ్ఞతలైనా చెప్పిండా? అని అందెశ్రీ ప్రశ్నించారు. ‘‘ప్రజలు వేసిన ఓట్ల బిచ్చంతో పదేండ్లు పాలన సాగించిన కేసీఆర్​.. మొన్న ఓడిపోయినంక కనీసం ఆ జనం ముందుకు వచ్చి కృతజ్ఞతలన్నా చెప్పడా? ఇదా సంస్కారం. ఇదా నాయకుడి తీరు? తెలంగాణకు అదిచ్చినం.. ఇది తెచ్చినం అని అన్నరు. మీరు ఇచ్చిందేముందు.. మీ పాలనే ప్రజల భిక్ష.

 కొడుకును సీఎం చేస్త..  దేశంలో చక్రం తిప్పుతా అనుకున్నడు.. ఇది ప్రజాస్వామ్యం. ఎవరన్నా వస్తరు.. ఎవరన్నా ఏలుతరు.  ఎవరొచ్చినా నా తెలంగాణ తల మీద పెట్టుకుంటది. తలబిరుసుతనం ఉంటే.. దింపేస్తది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే అందుకు ఉదాహరణ. కేసీఆర్​ ఓటమి ఎవరికైనా హెచ్చరికే” అని ఆయన అన్నారు.  ‘‘కేసీఆర్​ అహంకారమే రేవంత్​ నెత్తిమీద పాలుపోసి.. అధికారం ఇచ్చిపోయింది. కేసీఆర్​తో తలపడే శక్తి కాంగ్రెస్​కు, రేవంత్​కు  ఉన్నదని ఎవరూ అనుకోలేదు.  కానీ, ప్రజాశక్తి అనేది ఒకటుంటది. ఆ ప్రజాశక్తిని నిద్రలేపింది కేసీఆర్​లోని అహంకారమే. ఆ ప్రజాశక్తికి ఎవరైనా తలవంచాల్సిందే” అని పేర్కొన్నారు.  

ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే ప్రజలు ఊరుకోరు

ప్రభుత్వాన్ని పడగొట్టేలా కొందరు మాట్లాడుతున్నారని, ప్రజలు తిరగబడితే అలాంటి వాళ్లు ఉండరని అందెశ్రీ అన్నారు. ‘‘ఎగ్జిట్​ పోల్స్​  వచ్చిన తర్వాత వాళ్లు ఏమన్నరో అందరికీ తెలుసు. ఓటమి చుట్టుముట్టినా కూడా వారి అహంకారం అణగలేదు. ఒకాయన తమకు 54 సీట్లున్నయ్​ అంటున్నడు. ఇంకా ఊడిగం ఏంది?  మీరు లెక్కలు మార్చి ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే.. మిమ్మల్ని తెలంగాణ ప్రజానీకం ఉండనియ్యదు” అని హెచ్చరించారు.